దైవం చేరువయ్యేది వారికే!

ABN , First Publish Date - 2021-02-12T08:19:54+05:30 IST

ఒక సందర్భంలో, ఏసు ప్రభువు తన ప్రసంగాన్ని ముగించుకొని వెళ్తున్నాడు. దారిలో పన్నులు వసూలు చేసే కార్యాలయం కనిపించింది. అక్కడ అల్ఫయి అనే వ్యక్తి

దైవం చేరువయ్యేది వారికే!

ఒక సందర్భంలో, ఏసు ప్రభువు తన ప్రసంగాన్ని ముగించుకొని వెళ్తున్నాడు. 

దారిలో పన్నులు వసూలు చేసే కార్యాలయం కనిపించింది. అక్కడ అల్ఫయి అనే వ్యక్తి 

కుమారుడైన లేవీ పన్నులు వసులు చేస్తున్నాడు.

ఏసు ప్రభువు అతనితో... ‘‘రా! నన్ను అనుసరించు’’ అన్నాడు.

ఏసు మాట వినగానే లేవీ ఎక్కడి పని అక్కడ వదిలేశాడు. ఆయన వెంట నడిచాడు. ఆ తరువాత, ఏసు గౌరవార్థం తన ఇంట్లో బ్రహ్మాండమైన విందును ఏర్పాటు చేశాడు. ఆ విందుకు పన్ను వసూలుదారులు కూడా చాలామంది హాజరయ్యారు. అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. 


ఇది గమనించి, యూదులలో ఒక తెగకు చెందిన పరిసయ్యులు, వారి బోధకులు అభ్యంతరం తెలుపుతూ, ‘‘పన్నులు వసూలు చేసేవారితో, పాపాత్ములతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నారు?’’ అని ఏసు ప్రభువు శిష్యులను అడిగారు. 

వారి మాటలు విన్న ఏసు ‘‘ఆరోగ్యంగా ఉన్న మనుషులకు వైద్యుడు అక్కరలేదు. రోగులకే కావాలి. నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు. పశ్చాత్తాపం చెందాలని పాపులను పిలవడానికి వచ్చాను’’ అని బదులిచ్చాడు. (లూకా 5: 27-32, మార్కు 2: 13-17)


పాపాల నుంచి మనుషులను విముక్తి చేయడానికే... దైవం ఆదేశాల మేరకు 

ఏసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. పాపులలో పశ్చాత్తాపం కలిగించి, పరలోకానికి వారిని అర్హులుగా మార్చడమే ఆయన సంకల్పం. సన్మార్గంలో ఉన్నవారికన్నా, తప్పుడు మార్గాల్లో జీవిస్తున్నవారికే దైవ సహాయం ఎక్కువ అవసరం. అలాంటివారిలో మార్పు తేవడం కోసం దైవం వారికి చేరువవుతాడు.

Updated Date - 2021-02-12T08:19:54+05:30 IST