జీ హుజూర్‌

ABN , First Publish Date - 2020-09-21T08:30:42+05:30 IST

‘నీ పోస్టింగ్‌ కోసం వచ్చి నా కాళ్లు పట్టుకున్నావ్‌. నే ను చెప్పినట్లు చేస్తానన్నావ్‌. ఎమ్మెల్యే అంటే లెక్కలే దా? మావాళ్ల ఇసుక లారీలు వదిలేస్తావా..

జీ హుజూర్‌

నలిగిపోతున్న నాలుగో సింహం 

పోలీసులపై అధికార నేతల ఒత్తిళ్లు 

నాయకుల సిఫారసులతో పోస్టింగులు 

వారు చెప్పినట్లు వినకపోతే బూతులు 



ప్రజలకు కష్టం వస్తే పోలీసు స్టేషన్‌కు వెళతారు. మరి పోలీసులకే కష్టం వస్తే... ఎవరి దగ్గరికి వెళ్లాలో, ఎటు వెళ్లాలో దిక్కుతోచక తలపట్టుకు కూర్చోవాల్సిందే. పోస్టింగ్‌ కోసం అధికార పార్టీ నేతలతో సిఫారసులు చేయించుకుని, ఆ తర్వాత వారు చెప్పినట్లు ఆడలేక, అక్రమాలకు సహకరించలేక, చట్టప్రకారం డ్యూటీ చేయలేక పోలీసులు నలిగిపోతున్నారు. విధి నిర్వహణలో అడుగడుగునా అవమానాలు దిగమింగుతున్నారు.




(అమరావతి-ఆంధ్రజ్యోతి)

‘నీ పోస్టింగ్‌ కోసం వచ్చి నా కాళ్లు పట్టుకున్నావ్‌. నే ను చెప్పినట్లు చేస్తానన్నావ్‌. ఎమ్మెల్యే అంటే లెక్కలే దా? మావాళ్ల ఇసుక లారీలు వదిలేస్తావా.. లేదా.. ఎస్పీ, డీజీపీకి చెప్పి 2 నిమిషాల్లో లేపించేయాలా?’ గుంటూరులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్న సీఐకి అధికార పార్టీ ఎమ్మెల్యే శ్రీదేవి చేసిన ఇటీవలి హెచ్చరిక ఇది. చిత్తూరు జిల్లాలో ఓ సీఐపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇంతకంటే తీవ్రస్థాయిలో నోరు పారేసుకోవడమే గాక ఏకంగా బూతుపురాణం అందుకున్న ఘటన ఇటీవల వెలుగు చూసింది. ఇక, తాజాగా కర్నూలు జిల్లాలో నంద్యాలలో ‘నాలుగు రోజులు డ్యూటీ చేస్తే పెద్ద పాలెగాడిననుకున్నావా..? నువ్వు యూనిఫాం అయినా వదలాల.. లేకపోతే నేను రాజకీయమన్నా వదలాల.. నేనేమిటో చూపిస్తా’ అంటూ పోలీసు అధికారిపై ఓ వైసీపీ నేత చిందులు తొక్కాడు.


రాష్ట్రంలో అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు ఎలా ఉన్నాయో, ఉద్యోగం చేసేందుకు పోలీసులు ఎన్ని ఒత్తిళ్లు, అవమానాలు ఎదుర్కొంటున్నారో చెప్పేందుకు ఈ ఘటనలే నిదర్శనం. చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. సీఐలు, డీఎస్పీలతో పాటు జిల్లాల్లో ఎస్పీలపైనా ఇదే స్థాయిలో అధికార నేతల ఒత్తిళ్లున్నాయి. ఐపీఎస్‌ అధికారులైనా సరే తమ అక్రమాలను అడ్డుకుంటే రెండేళ్ల పోస్టింగ్‌ కాస్తా రెండు నెలలకే మారిపోతుందనే హెచ్చరికతో కూడిన సందేశాన్ని పోలీసుశాఖకు పంపడంలో అధికార పార్టీ నేతలు సఫలమయ్యారు. దీంతో అక్రమాలకు సహకరించలేదని ఓ ఎమ్మెల్యే ఫోన్‌చేసి బూతులు తిట్టినా ‘మీరు చెప్పినట్టే చేస్తా.. మేడమ్‌’ అని ఒక సీఐ బదులిచ్చే దీనస్థితికి పోలీసు విభాగం చేరుకుంది.


ఒక అమాత్యుడి అక్రమాలు, అరాచకాలకు అడ్డుపడుతున్నారని చిత్తూరు జిల్లా ఎస్పీ వెంకటప్పలనాయుడును ఆరు నెలలకే బదిలీ చేసిన ప్రభుత్వం.. ప్రజలతో సంబంధం లేని పోస్టులో నియమించింది. నెల్లూరులో వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహానికి గురైన ఎస్పీ ఐశ్వర్య రస్తోగి చివరకు డీజీపీ ఆఫీసులో లూప్‌లైన్‌ పోస్టుకు వెళ్లక తప్పలేదు. శాంతిభద్రతల విభాగంలో పోస్టింగ్‌ కావాలంటే రాజకీయ సిఫారసులు తప్పనిసరి.


దీంతో  అధికార పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధుల వద్దకెళ్లి.. మీరు చెప్పినట్లు చేస్తామని సిఫారసు లేఖలు తెచ్చుకొని పోస్టింగ్‌లు వేయించుకొంటున్నారు. ఎక్కడైనా బాధితులకు అండగా నిలిస్తే మాత్రం నెల్లూరు ఎస్పీకి పట్టిన గతే ఎస్‌హెచ్‌వోలకు పడుతోంది. రూలింగ్‌ పార్టీ నేతలకు జీ హుజూర్‌ అంటేనే పోస్టింగ్‌ ఉంటుంది. దళితు లు, మహిళలపై దాడులు చేస్తే చట్టపరంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న తెలివితో వైసీపీ నేతలు ఆ పని పోలీసులతో చేయిస్తున్నారు.


మేమూ బాధితులమే:

అధికార పార్టీ నేతల తీరుతో ప్రజలతో పాటు తాము కూడా బాధితులుగా మారి, తీవ్రంగా నష్టపోతున్నామని పోలీసులు వాపోతున్నారు. కృష్ణాజిల్లాలో ఓ యువకుడి ఆత్మహత్య ఘటనలో సంబంధిత ఎస్‌ఐని ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. రాజమండ్రిలో దళితుడికి శిరోముండనం చేయించిన ఎస్‌ఐని సస్పెండ్‌ చేయడమే కాకుండా అట్రాసిటీ కేసు నమోదు చేసి జైలుకు పంపారు.




రాష్ట్రంలో జగన్‌ పోలీస్‌ సర్వీస్‌: పట్టాభి


తుని, సెప్టెంబరు 20: ‘‘రాష్ట్రంలో ఐపీఎ్‌సకు బదులు జగన్‌ పోలీసు సర్వీ్‌స(జేపీఎస్‌) నడుస్తోంది. ప్రశ్నించే ప్రతిపక్షంపై, నీతిగా పనిచేస్తున్న అధికారులపై, మీడియాపై, న్యాయవ్యవస్థపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు’’ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ తునిలో అన్నారు. 


లోకేశ్‌ ఫోన్‌ పరామర్శ :

తూర్పుగోదావరిలో నిజాయితీగా పనిచేసిన దుర్గారావు చనిపోయే ముందురోజు అధికారులు మెమో ఇవ్వడంపై టీడీపీ నేత లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాఽధిత కుటుంబీకులతో ఫోన్‌లో మాట్లాడారు. 


Updated Date - 2020-09-21T08:30:42+05:30 IST