జీగిరాం మళ్లీ ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-20T04:57:36+05:30 IST

జీగిరాం జూట్‌ పరిశ్రమ లాకౌట్‌ను ఈ నెల 20 నుంచి ఎత్తివేస్తున్నట్టు యాజమాన్యం మంగళవారం స్పష్టం చేసింది. సాలూరు మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జరజాపు ఈశ్వరరావు కార్మికుల సమక్షంలో ఈ ప్రకటన చేశారు. ఆయన చొరవ వల్లనే మేనేజ్‌మెంట్‌ 13 మంది కార్మికులతో విజయనగరంలో ఇటీవల చర్చలు జరిపింది. తాజాగా మంగళవారం మరోసారి ఫోన కాన్ఫరెన్సలో చర్చించారు.

జీగిరాం మళ్లీ ప్రారంభం

నేటి నుంచి పనులు

కార్మికులతో యాజమాన్యానికి కుదిరిన ఒప్పందం

సాలూరు రూరల్‌, అక్టోబరు 19: జీగిరాం జూట్‌ పరిశ్రమ లాకౌట్‌ను ఈ నెల 20 నుంచి ఎత్తివేస్తున్నట్టు యాజమాన్యం మంగళవారం స్పష్టం చేసింది. సాలూరు మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జరజాపు ఈశ్వరరావు కార్మికుల సమక్షంలో  ఈ ప్రకటన చేశారు. ఆయన చొరవ వల్లనే మేనేజ్‌మెంట్‌ 13 మంది కార్మికులతో విజయనగరంలో ఇటీవల చర్చలు జరిపింది. తాజాగా మంగళవారం మరోసారి ఫోన కాన్ఫరెన్సలో చర్చించారు. అనంతరం లాకౌట్‌ను ఎత్తివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. జీగిరాం జూట్‌కు గతేడాది డిసెంబర్‌ 1న లాకౌట్‌ ప్రకటించారు. నిర్వహణ నుంచి పాత  యాజమాన్యం తప్పుకుంటూ కొత్త యాజమాన్యానికి బాధ్యతలు అప్పగించింది. కొత్త యాజమాన్యం తొలుత లాకౌట్‌ను 20 నుంచి ఎత్తి వేస్తున్నట్టు ప్రకటించింది. మిల్లులో ఉత్పత్తి ప్రారంభించడానికి ముందు ఈ నెల 20 నుంచి యంత్రాల శుద్ధి, నిర్వహణ పనులు ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. తొలిరోజు 11 మంది మెకానికల్‌ సిబ్బంది నిర్వహణ పనులకు రానున్నారు. ఆ తర్వాత ఏ రోజు ఏయే విభాగాల కార్మికులు రావాల్సి ఉంటుందో చెబుతారు. ఉత్పత్తి ప్రారంభ తేదీతో పాటు 1200 మంది కార్మికులు పనులకు వచ్చే తేదీని ఖరారు చేస్తారు. చర్చల్లో భాగంగా క్రమశిక్షణతో మెలగాలని, ఉత్పత్తి పెంపుదలకు అంకితభావంతో పనిచేయాలని, విద్యుత్‌ కోతల సమయంలో షిప్టుల సర్దుబాటును మేనేజ్‌మెంట్‌ ప్రతిపాదించగా కార్మికులు అంగీకరించారు. గ్రాట్యూటీ రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంపు, మిల్లులో ఉత్పత్తి ప్రారంభమైన 15 రోజులకు బోనస్‌ చెల్లింపు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ బకాయిల చెల్లింపు, జనవరి నుంచి నవంబర్‌ వరకు 160 రోజుల పనిదినాలున్న వారికి ప్రతి 20 రోజులకు ఒక ఆర్జిత సెలవు ఇవ్వాలని తదితర డిమాండ్లును కార్మికులు ప్రతిపాదించారు. దీనికి యాజమాన్యం  దాదాపుగా సుముఖత వ్యక్తం చేసింది. మిల్లులో ఒప్పంద పత్రంపై కార్మికులు సంతకాలు చేశారు. యాజమాన్య ప్రతినిధులు విజయనగరంలో ఉన్నందున సంతకాలు చేయాల్సి ఉంది. 

సాలూరుకు నెలకు రూ. కోటి నష్టం: జరజాపు 

మిల్లుకు లాకౌట్‌ వల్ల సాలూరుకు నెలకు రూ. కోటి నష్టం ఏర్పడిందని మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ జరజాపు ఈశ్వరరావు అన్నారు. ఆయన మంగళవారం మిల్లు వద్ద లాకౌట్‌ ఎత్తివేత నోటీసు ప్రదర్శించిన అనంతరం కార్మికులనుద్దేశించి మాట్లాడారు. మిల్లు నడిచినప్పుడు నెలకు కోటి రూపాయల వేతనాలు, జీతాలు తదితర చెల్లింపులను యాజమాన్యం చేపట్టేదన్నారు. లాకౌట్‌ వల్ల ఒక్క సాలూరులోని ఆర్థిక కార్యకలపాలకు రూ.కోటి టర్నోవర్‌ తగ్గిందన్నారు. మిల్లును తెరవనున్న నేపథ్యంలో దానిని పరిరక్షించుకోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు. సమావేశంలో మిల్లు ప్రతినిధి సారిపాక రాంప్రసాద్‌, కార్మిక నేతలు సింహాచలం తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-10-20T04:57:36+05:30 IST