‘జిల్మ’ కానొత్తలేదు

ABN , First Publish Date - 2021-03-15T09:31:14+05:30 IST

తెల్లకొంగల్ని కప్పుకున్న నల్లతుమ్మచెట్టు నీడల్ని తడుముతూ కొండల్ని తాగుతున్న లోలోపలి చెర్వుల్లోని జిల్మలకు ఈతనెవలు నేర్పుతరని...

‘జిల్మ’ కానొత్తలేదు

1. తెల్లకొంగల్ని కప్పుకున్న నల్లతుమ్మచెట్టు నీడల్ని తడుముతూ కొండల్ని తాగుతున్న లోలోపలి చెర్వుల్లోని జిల్మలకు ఈతనెవలు నేర్పుతరని రాయినిసిరి అలజడినైతే పుట్టిత్తవు. ప్రతిధ్వనించే జవాబులన్నీ తీరమే మింగేత్తాందని నిందలు మోపుతవు.


2. ఎంతకని ఊకుంచుతవు? పంచుకుంటే పాశిపోయే బాధలని నమ్మిచ్చి మోసం చేయలేవు. దోసిళ్ళు నింపే దుక్కంలో మునకేయమని బతిలాడలేవు. సైసూడకుంటనే మాటలన్నీ ఉప్పిసమని కొలిశేటోల్లపై జాలి సూపైనా ఇసురలేవు.


3. యిది ఏ కంటి దుక్కమో, ఏ యింటి బరువో పాడకుంటనే గాల్లో కల్సిన గితమొకటి ఎంబడిబడుతాంటది. ఏ అనాథ గొంతుకల సూరుకింద తలదాసుకుంటదో, ఎప్పుడెప్పుడు తలెత్తి పిడికిలి బిగీత్తదోగని..బొండిగె దిగీన కత్తి చేయబోయే గాయం కోసం రాతిరంతా సలపరిత్తనే వుంటవు.


4. కరగని పగళ్ళ ఉక్కపోతల గురించి సుత మాట్లాడినంక అడుగుబొడుగులన్నీ చీకటికి ముట్టజెప్పుతవు. ఏ కానల దాశినవో తెల్వని నవ్వు మొఖాన్ని ఎప్పటికీ ఇడిపియ్యలేక న్యాలకేసి ఎనుదిరుగుతవు.


5. ఎల్తురు ఎగజిమ్ముకుంట జిల్మలు ఎదురుపడుతయి. అడుగంటిన చెర్వు నిండిందని పట్టరాని సంబురమైతది. మాయిల్నే ఇచ్చుకపోయిన కల ఉచ్చుబిగీచ్చినట్టయితది. 

బండారి రాజ్‌ కుమార్‌

9959914956


Updated Date - 2021-03-15T09:31:14+05:30 IST