200 నగరాల్లో జియోమార్ట్‌ సేవలు

ABN , First Publish Date - 2020-05-27T06:36:41+05:30 IST

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అధినేత ముకేశ్‌ అంబానీ మరో భారీ వ్యాపారానికి తెరతీశారు. జియోమార్ట్‌ పేరుతో హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, వైజాగ్‌తో సహా దేశవ్యాప్తంగా 200 ...

200 నగరాల్లో జియోమార్ట్‌ సేవలు

  • ఏపీ, తెలంగాణలోని ప్రధాన పట్టణాల్లో అందుబాటులోకి


న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) అధినేత ముకేశ్‌ అంబానీ మరో భారీ వ్యాపారానికి తెరతీశారు. జియోమార్ట్‌ పేరుతో హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, వైజాగ్‌తో సహా దేశవ్యాప్తంగా 200 నగరాల్లో పెద్దఎత్తున రిటైల్‌ వ్యాపారం ప్రారంభించారు. కొనుగోలుదారులు జియోమార్ట్‌ వెబ్‌సైట్‌కి వెళ్లి.. వినియోగదారులు ఉండే ఏరియా పిన్‌కోడ్‌ ఎంటర్‌ చేసి, తమ చిరునామా ఇచ్చి కావాల్సిన సరుకులు బుక్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత సమీపంలోని రిలయన్స్‌ రిటైల్‌ స్టోర్ల నుంచి సరుకులు డోర్‌ డెలివరీ చేస్తారు. లాక్‌డౌన్‌ దృష్ట్యా ప్రస్తుతం ఇందుకు రెండు రోజల వరకు సమయం పడుతోంది.


ఆఫర్లే ఆఫర్లు.. 

వినియోగదారుల్ని ఆకర్షించేందుకు ఇతర కంపెనీల వస్తువుల గరిష్ఠ ధర (ఎంఆర్‌పీ)పై 5 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తున్నారు. పండ్లు, కూరగాయలు, ఆహార ఉత్పత్తులతో పాటు అనేక వినియోగ వస్తువులను ప్రస్తుతం జియోమార్ట్‌ వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చు. త్వరలో దేశవ్యాప్తంగా ఉన్న కిరాణా దుకాణాలతోనూ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు జియోమార్ట్‌ సిద్ధమవుతోంది. అప్పుడు వాట్సప్‌ ద్వారా సరుకులు బుక్‌ చేసుకోవచ్చు. వినియోగదారులు తమకు సమీపంలోని రిలయన్స్‌ రిటైల్‌తో ఒప్పందం చేసుకున్న కిరాణా దుకాణం నుంచే సరుకులు తీసుకోవచ్చు. జియోమార్ట్‌ సేవలతో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, బిగ్‌బాస్కెట్‌, గ్రోఫర్‌ వంటి ఆన్‌లైన్‌ ఈ-కామర్స్‌ దిగ్గజాలతో పాటు బిగ్‌బజార్‌, మోర్‌ వంటి రిటైల్‌ చెయిన్స్‌కు తీవ్ర పోటీ ఏర్పడుతుందని భావిస్తున్నారు. 

Updated Date - 2020-05-27T06:36:41+05:30 IST