లాలుప్రసాద్ యాదవ్‌పై జితన్ రామ్ మాంఝీ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-11-26T22:10:00+05:30 IST

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందూస్థాన్ అవామ్ మోర్చా జాతీయ అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

లాలుప్రసాద్ యాదవ్‌పై జితన్ రామ్ మాంఝీ సంచలన వ్యాఖ్యలు

పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందూస్థాన్ అవామ్ మోర్చా జాతీయ అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తమకు సహకరించాల్సిందిగా కోరుతూ ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ యాదవ్ తనను కూడా సంప్రదించారని ఆరోపించారు. లాలు తనతో మాట్లాడాలనుకుంటున్నారని చెబుతూ ఓ వ్యక్తి నుంచి మంగళవారం రాత్రి తనకు ఫోన్ వచ్చిందని, అయితే, మాట్లాడేందుకు తాను నిరాకరించానని తెలిపారు. 


‘‘రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆయన నాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కానీ నేను మాట్లాడలేదు. లాలుపై సుశీల్ కుమార్ మోదీ, బీజేపీ ఎమ్మెల్యే లలన్ పాశ్వాన్ చెప్పింది 200 శాతం నిజం’’ అని మాంఝీ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత లాలు యాదవ్ తమ పార్టీ ఎమ్మెల్యేలను సంప్రదించారని, మహాఘట్‌బంధన్‌కు విధేయులుగా ఉంటే మంత్రి పదవులు ఇస్తామని కూడా ఆఫర్ ఇచ్చారని ఆరోపించారు.  


లాలు ప్రసాద్ రాంచీ జైలు నుంచే రాజకీయాలు చేస్తున్నారని, ఈ ఘటనపై విచారణ జరిపించాలని మాంఝీ డిమాండ్ చేశారు. మంత్రి పదవులు ఇస్తామంటూ తమ ఎమ్మెల్యేలను సంప్రదించారని పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే లలన్ పాశ్వాన్‌ను ఫోన్‌లో సంప్రదించిన లాలు ప్రసాద్ యాదవ్.. నితీశ్ కుమార్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు స్పీకర్ ఎన్నికల్లో మహాఘట్‌బంధన్‌కు అనుకూలంగా ఓటేసినా, లేకుంటే గైర్హాజరైనా తర్వాత ఏర్పడే తమ ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇస్తామని ఆఫర్ చేసినట్టుగా ఉన్న ఆడియో టేప్‌ను బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ విడుదల చేశారు. ఆ తర్వాతి రోజే జితన్ రామ్ మాంఝీ కూడా ఇలాంటి ఆరోపణలే చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

Updated Date - 2020-11-26T22:10:00+05:30 IST