జేఎన్‌టీయూ కళాశాల వచ్చేస్తోంది..

ABN , First Publish Date - 2021-08-01T06:08:22+05:30 IST

సిరిసిల్ల ప్రాంత ప్రజల జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల కల కొద్ది రోజుల్లోనే నేరవేరనున్నది.

జేఎన్‌టీయూ కళాశాల వచ్చేస్తోంది..

 - సిరిసిల్లలో ఆరు కోర్సులతో ప్రారంభానికి సన్నాహాలు 

- రాష్ట్రంలోనే తొలిసారిగా బీటెక్‌లో టెక్స్‌టైల్‌ కోర్సు

- రూ. 400 కోట్లతో ఏర్పాటుకు ప్రతిపాదనలు 

- పెద్దూర్‌ శివారులో 88 ఎకరాల స్థలం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

సిరిసిల్ల ప్రాంత ప్రజల జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల కల కొద్ది రోజుల్లోనే నేరవేరనున్నది. జూలై 4న సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్‌ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ జేఎన్‌టీయూ కళాశాల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలు ముందుకు కదిలాయి. ఈ విద్యాసంవత్సరమే జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నారు. ముందుగా ఐదు కోర్సుల్లో సివిల్‌, మెకానికల్‌, ఎలక్ర్టికల్‌, ఎలక్ర్టానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులు అనుకున్నారు. తాజాగా జేఎన్‌టీయూ పాలకమండలి సిరిసిల్ల జేఎన్‌టీయూలో టెక్స్‌టైల్‌ ఇంజనీరింగ్‌ విభాగాలను కూడా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీంతో అరు కోర్సులతో 2021-22 విద్యా సంవత్సరంలోనే ప్రవేశాలు మొదలు కానున్నాయి. 

- ‘అగ్రహారం’లో తాత్కాలికంగా తరగతులు.. 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాత్కాలికంగా జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ తరగతులను ప్రారంభించడానికి అనువైన భవనాలను పరిశీలించారు. ముందుగా సిరిసిల్ల సెస్‌ భవనాన్ని ఉపయోగించుకోవాలని భావించారు. దాదాపు మూడున్నరేళ్లుగా కలెక్టరేట్‌ నిర్వహణలో ఉన్న భవనం ఖాళీ కావడంతోనే సెస్‌ సిబ్బంది మళ్లీ తమ సొంత భవనంలోకి వచ్చారు. దీంతో అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తాత్కాలికంగా తరగతులు ప్రారంభించాలని భావిస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ కూడా భవనాన్ని పరిశీలించాలని సూచనలు కూడా చేశారు. అగ్రహారం కళాశాలలో తరగతులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. 

- విద్యా హబ్‌గా.. 

జిల్లాలో ఇప్పటికే పాలిటెక్నిక్‌ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల, వ్యవసాయ డిగ్రీ కళాశాలలతో పాటు ఐటీఐ, గురుకులాలు, మైనార్టీ రెసిడెన్షియల్‌, వంటి కళాశాలలకు తోడు జేఎన్‌టీయూ ప్రారంభం కాబోతోంది. రెండో విడతలో ముఖ్యమంత్రి మెడికల్‌ కళాశాల కూడా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో సిరిసిల్ల విద్యాహాబ్‌గా మారబోతోంది. జేఎన్‌టీయూ కళాశాల కోసం సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారులో సర్ధాపూర్‌, వెంకటాపూర్‌ ప్రాంతాల మధ్య సర్వే నంబర్‌ 61, 247లో 88 ఎకరాల స్థలాన్ని కేటాయించి ఉన్నత విద్యామండలికి పత్రాలను కూడా అందించారు. ఇప్పటికే కామారెడ్డికి రైల్వేలైన్‌ ఉండడం, సిరిసిల్లకు త్వరలో రైలు సౌకర్యం రాబోతుండడంతో విద్యారంగానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. 88 ఎకరాల స్థలంలో రూ. 400కోట్లతో కళాశాల ఏర్పాటు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు జేఎన్‌టీయూ పాలకమండలి పేర్కొంది. 

- టెక్స్‌టైల్‌  డిప్లోమా విద్యార్థులకు ఉపయోగకరంగా..

దేశంలో వ్యవసాయం తరువాత టెక్స్‌టైల్‌ రెండో అతిపెద్ద ఉపాధి రంగంగా ఉంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశంలో పది కోట్ల మంది టెక్స్‌టైల్‌లో ఉపాధి పొందుతున్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జేఎన్‌టీయూలో మాత్రమే టెక్స్‌టైల్‌ కోర్సు ఉంది. తరువాత బరోడాలో మహారాజా శాయాజీరావు యూనివర్సిటీ, భువనేశ్వరలో కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, ఇండోర్‌లో వైష్ణవ్‌ విద్యాపీఠ్‌ విశ్వవిద్యాలయం, కోయంబత్తూర్‌లో పీఎస్‌జీ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌లో మాత్రమే టెక్స్‌టైల్‌ కోర్సులు ఉన్నాయి. రాష్ట్రంలో తొలి, దేశంలో ఆరో కాలేజీగా సిరిసిల్ల జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కాలేజీ నిలవబోతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారంలో శ్రీరాజరాజేశ్వర స్వామి పాలిటెక్నిక్‌ కళాశాలలో మాత్రమే టెక్స్‌టైల్‌ డిప్లామా కోర్సులు ఉన్నాయి. ఇంజనీరింగ్‌ కళాశాలలో టెక్స్‌టైల్‌ ఇంజనీరింగ్‌ విభాగం కోర్సులు పెట్టడంతో డిప్లోమా చేసే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు. 


Updated Date - 2021-08-01T06:08:22+05:30 IST