నన్నాపారో దగ్గేస్తా.. కరోనా అంటిస్తా.. జేఎన్‌యూ విద్యార్థి వింత ప్రవర్తన!

ABN , First Publish Date - 2020-04-05T20:35:01+05:30 IST

క్యాంపస్ నుంచి బయటకు రానివ్వనందుకు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి ఒకరు సెక్యూరిటీ అధికారులనే...

నన్నాపారో దగ్గేస్తా.. కరోనా అంటిస్తా.. జేఎన్‌యూ విద్యార్థి వింత ప్రవర్తన!

న్యూఢిల్లీ: క్యాంపస్ నుంచి బయటకు రానివ్వనందుకు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి ఒకరు సెక్యూరిటీ అధికారులనే బెదిరించాడు. ‘నేను మీపై దగ్గుతా.. అందరికీ కరోనా వ్యాప్తి చేస్తా.. అంటూ వారిని బెదిరించేందుకు ప్రయత్నించాడు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


జేఎన్‌యూలో చదువుకునే ప్రణవ్ మీనన్ బుధవారం రాత్రి 8 గంటల సమయంలో బయటకు వెళ్లేందుకు నార్త్ గేట్ వద్దకు వచ్చాడు. సెక్యూరిటీ అధికారులు అతడిని బయటకు వెళ్లనివ్వలేదు. తనకు అత్యవసరమైన పని ఉందని, బయటకు వెళ్లనివ్వాలని ప్రణవ్ వారిని కోరాడు. అయితే లాక్‌డౌన్ అమలులో ఉందని, ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లడానికి వీల్లేదని సిబ్బంది చెప్పడంతో ప్రణవ్ అక్కడే కూర్చుకున్నాడు. అయినా బయటకు వెళ్లనివ్వకపోవడంతో మీనన్ సిబ్బందిని బెదిరించడం ప్రారంభించాడు. ‘మీపై దగ్గుతా.. మీ అందరికీ కరోనా అంటిస్తా’ అంటూ బెదిరించడం మొదలెట్టాడు. దీంతో అతడిని పట్టుకుని లోనికి తీసుకెళ్లేందుకు సిబ్బంది ప్రయత్నించగా మీనన్ వారితో పెనుగులాడడమే కాకుండా వారి మాస్కులను కూడా లాగేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 


ఇదిలా ఉంటే మీనన్ కూడా ఆన్‌లైన్‌లో ఓ కంప్లైంట్ దాఖలు చేశాడు. తనను వర్సిటీ యాజమాన్యం కావాలని ఇందులో ఇరికిస్తోందంటూ శనివారం కంప్లైంట్ నమోదు చేశాడు. నాపై సెక్యూరిటీ సిబ్బంది తప్పుడు కంప్లైంట్ దాఖలు చేసి నన్ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తన కంప్లైంట్‌లో పేర్కొన్నాడు.

 

అంతేకాకుండా విద్యార్థులపై తప్పుడు ఆరోపణలు చేయడం యూనివర్సిటీ యాజమాన్యానికి ఇదేం కొత్త కాదని, బయటకు వెళ్లేందుకు హాస్టల్ వార్డెన్ నుంచి తాను అనుమతి తీసుకున్నానని, దీనికి ఆ వార్డెనే సాక్షమని, అవసరమైతే క్యాంపస్ ప్రధాన ద్వారం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తే పోలీసులకు అసలు విషయం తెలుస్తుందని మీనన్ రాసుకొచ్చాడు. మార్చి 18 నుంచి ఏప్పిల్ 1 వరకు తాను ఎన్నడూ లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించలేదని, కానీ అత్యవసరం కావడంతోనే బుధవారం బయటకు వెళ్లాలనుకున్నానని, అయితే సెక్యూరిటీ తనను తిట్టడమే కాకుండా, కొట్టారని మీనన్ తన కంప్లైంట్‌లో పేర్కొన్నాడు. 

Updated Date - 2020-04-05T20:35:01+05:30 IST