సర్కారుతో ఢీ!

ABN , First Publish Date - 2022-01-29T08:36:26+05:30 IST

మంత్రుల కమిటీపై పీఆర్సీ స్ట్రగుల్‌ కమిటీ నేతలు భగ్గుమన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు అపరిపక్వతతో వ్యవహరిస్తున్నారంటూ కమిటీ చేసిన వ్యాఖ్యలపై మాటల తూ టాలు పేల్చారు. అపరిపక్వత నిజమేనని..

సర్కారుతో ఢీ!

మా ఉద్యమాన్ని మీరేం చేస్తారు.. గళం పెంచిన ఉద్యోగ నేతలు 

లెటర్‌ ప్యాడ్‌ సంఘాలతో మాట్లాడి ఏం తేలుస్తారు? 

సభ్యులు, కార్యవర్గం లేని సంఘాలతో చర్చిస్తున్నారు 

మిమ్మల్ని నమ్మిన అపరిపక్వత నిజమే... 

ఇప్పుడే అసలైన నాయకులుగా వ్యవహరిస్తున్నాం 

మంత్రుల కమిటీపై పీఆర్సీ స్ట్రగుల్‌ కమిటీ నేతల ఫైర్‌ 

3 జీవోలు రద్దు చేశాకే ఏదైనా మాట్లాడండి: బండి 

చిత్తశుద్ధి లేని ప్రభుత్వం మెలికలు పెడుతోంది

ఉద్యోగుల డబ్బునూ వాడతారేమో?: సూర్యనారాయణ 

సజ్జల, బుగ్గన వల్లే నమ్మకం పోయింది: బొప్పరాజు


‘పరిపక్వత లేదు, మొండిగా ఉన్నారు, చర్చలకు రావడం లేదు’... అంటూ తమపై నిందలు మోపుతున్నారంటూ మంత్రుల కమిటీపై ఉద్యోగ నేతలు భగ్గుమన్నారు. తాజాగా... ఇతర సంఘాలతో చర్చలు జరపడంపై మండిపడ్డారు. ‘ఢీ అంటే ఢీ’ అనేలా ప్రభుత్వ తీరును కడిగేశారు. ‘రెండున్నరేళ్లు గుడ్డిగా నమ్మాం. ఇంక నమ్మలేం.మీరు ఓపెన్‌ మైండ్‌తో లేరు. మేం చర్చలకు రావడంలేదనొద్దు. జీతం తగ్గదనే వాదన ఆపండి’ అంటూ ధ్వజమెత్తారు.


విజయవాడ, జనవరి 28(ఆంధ్రజ్యోతి): మంత్రుల కమిటీపై పీఆర్సీ స్ట్రగుల్‌ కమిటీ నేతలు భగ్గుమన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు అపరిపక్వతతో వ్యవహరిస్తున్నారంటూ కమిటీ చేసిన వ్యాఖ్యలపై మాటల తూ టాలు పేల్చారు. అపరిపక్వత నిజమేనని.. అది మిమ్మల్ని గుడ్డిగా నమ్మడమేనంటూ రివర్స్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఇప్పుడే పరిపక్వత చెంది, అసలైన నేతలుగా వ్యవహరిస్తున్నామన్నారు. డెమోక్రసీలో ఫుల్‌స్టాప్‌ ఉండదని కా మా మాత్రమే ఉంటుందన్నారు. లెటర్‌ప్యాడ్‌ సంఘాలతో మాట్లాడి మా ఉద్యమాన్ని మీరేం చేస్తారని నిలదీశారు. పీఆర్సీ స్ట్రగుల్‌ కమిటీ నేతలు కేఆర్‌ సూర్యనారాయణ, బొప్పరాజు వెంకటేశ్వర్లు శుక్రవారం విజయవాడలోని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడగా, ఒంగోలులోని కలెక్టరేట్‌ వద్ద జరుగుతున్న రిలేదీక్షలను ఏపీ ఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, గుంటూరు కలెక ్టరేట్‌ ఎదుట నిరాహరదీక్షలను బొప్పరాజు ప్రారంభించి, మాట్లాడారు. 


వేరే సంఘాలతో మాట్లాడి ఉద్యమాన్ని ఆపగలరా?

ఉద్యోగులను రెచ్చగొట్టేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ప్రభుత్వం కొన్ని సంఘాలను పిలిపించి మాట్లాడినంత మాత్రాన మా ఉద్యమాన్ని ఆ సంఘాల నేతలు ఆపగలరా? గతంలో ఉద్యోగులను ఉద్యమంలోకి నడిపించడానికి నాయకత్వం చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉద్యోగులు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. చర్చలకు రావడంలేదంటూ మాపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది. మా డిమాండ్లను రెండురోజుల క్రితమే రాతపూర్వకంగా మంత్రుల కమిటీకి ఇచ్చాం.   పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకుంటే ప్రభుత్వంతో చర్చలు కొనసాగించేందుకు సిద్ధం. ట్రెజరీ ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఆ క్షణం నుంచే సమ్మెలోకి వెళ్తాం. 

 వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు 


ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు

ఉద్యోగ సంఘాలను కించపరిచే ఇలాంటి ప్రభుత్వాన్ని నా సర్వీసులో చూడలేదు. ఈ ప్రభుత్వం మీద నమ్మకం పోవడానికి సజ్జలతో పాటు ఆర్థికమంత్రి బుగ్గన కారణం. మేం చర్చలకు రాలేదని మరోసారి అనొద్దని చెబుతున్నాం. లిఖితపూర్వకంగా మా సూచనలను పంపాం. మా స్టీరింగ్‌ కమిటీ సభ్యులతోనే మీకు నివేదించాం. మీరిచ్చిన జీవోలలో అనేక తప్పులు ఉన్నాయి. 2019 జూలై నుంచి ఇచ్చిన ఐఆర్‌ మొత్తాన్ని ఇప్పు డు వెనక్కు తీసుకోవాలనుకుంటున్నారు. పరిపక్వత లేకుండా ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడుతున్నారని సలహాదారు సజ్జల వ్యాఖ్యానించడం సరికాదు. కొవిడ్‌ సమయంలో జీతా లు తగ్గించి ఇచ్చినా సహకరించాం. 12సార్లు ప్రభుత్వం వద్ద కు చర్చలకు వెళ్లినా సాధించిదేమీ లేదు. ఉద్యోగుల జీతాలను వెనక్కి తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఉద్యోగులకు అందాల్సిన మెడికల్‌, పీఎఫ్‌ ఇతర ఖాతాల నుంచి ప్రభు త్వం దాదాపు రూ.4వేల కోట్లు వాడుకుంది. దాదాపు రూ.4 కోట్లు ఖర్చుపెట్టి రూపొందించిన అశుతోష్‌ మిశ్రా నివేదికను ఎందుకు దాచిపెట్టారో చెప్పాలి. కొత్త పీఆర్సీతో ప్రభుత్వంపై రూ.10వేల కోట్ల అదనపు భారం పడుతుందని అవాస్తవాల ను ప్రచారం చేయడం తగదు. ఉద్యోగులకు పాత జీతాలే ఇచ్చి ఆ డబ్బును మీ సంక్షేమ పథకాలకు వాడుకోండి. 

 బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ 


ఇప్పటి వరకు మిమ్మల్ని గుడ్డిగా నమ్మాం 

మీ మీద నమ్మకంతో ఇప్పటి వరకు గుడ్డిగా వ్యవహరించాం. మేమంతా ఇప్పుడే అసలైన నాయకులుగా ఉద్యోగుల మనోభావాలకు తగినట్టు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాం. సభ్యులు లేకుండా కాగితంపై కనిపించే సంఘా లు, కార్యవర్గం లేని సంఘాలతో మీరు చర్చిస్తున్నారు. మా స్టీరింగ్‌ కమిటీ తరపున వె ళ్లినవారిని మాత్రం గుర్తించడం లేదు. సోకాల్డ్‌ సంఘాలతో మాట్లాడి ఏం తేలుస్తారు? కమిటీతో చర్చలు జరుపుతున్నవారు మా కార్యాచరణను ఏ రకంగా నూ అడ్డుకోలేరు. డెమోక్రసీలో ఎండ్‌ అంటూ ఏమీ ఉండదు. నడుస్తూనే ఉంటుంది. మంత్రులు పాత వాదాన్ని మరోసారి మీడియాలో వినిపించారు. మీరు చర్చకు ఓపెన్‌ మైండ్‌తో లేరు. జీతం తగ్గలేదని పదేపదే చెబుతున్నారు. ఆ ప్రయత్నాన్ని మానుకోండి. లేదంటే పలచనైపోతారు. పీఆర్సీ రిపోర్టు ఇవ్వడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటిని అడుగుతున్నా. మీ స్టాండ్‌ అలానే ఉంటే, మా డిమాండ్లపై స్పందించేవరకు చర్చలకు రాకూడదన్నది మా స్టాండ్‌. మేం ఈ స్టాండ్‌ తీసుకోవటానికి రెండున్నరేళ్లు కాళ్లకు బలపాలు కట్టుకుని మీచుట్టూ తిరిగిన అనుభవానిది. జనవరి నెలకు పాతజీతాలే ఇవ్వండి. అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదిక ఇవ్వడి అని పెట్టిన రెండు షరతులు మినహా ఇంకా ఏవో చర్చిస్తానంటోంది. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మాట్లాడుకుందామంటారు. కానీ మా రెండు షరతులను ఎందుకు అంగీకరించడం లేదో తెలియదు. ఉద్యోగులకు రావాల్సిన వేల కోట్లు ఉన్నాయి. వాటిని ఇవ్వమనండి! 2018-2019 మధ్య ఉన్న డీఎలు ఇవ్వాలి. పెన్షనర్లకు డబ్బు ఇచ్చినట్లుగా రాసుకుని ఆదాయపు పన్ను కూడా మినహాయించుకుని పాపం వారికి టోపీ పెట్టారు. సీపీఎస్‌ ఉద్యోగులనూ మోసం చేశారు. ఇలా కాలయాపన చేసి ఉద్యోగుల డబ్బును కూడా ఏదైనా పథకాలకు వినియోగించుకుంటారేమో? 

కేఆర్‌ సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు 




ఉద్యోగులను రెచ్చగొట్టొద్దు

రాష్ట్రంలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య పీఆర్సీ విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగిన తర్వాతే మంత్రుల కమిటీతో చర్చించేందుకు వెళ్తాం. కొత్త పీఆర్సీతో వేతనాలు ఇవ్వాలని ట్రెజరీ అధికారులు, డీడీవోలపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. వారు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఇప్పుడు కలెక్టర్లు, ట్రెజరీ డైరెక్టర్లు డీడీవోలపై ఒత్తిడి పెంచారు. ఆ చర్యలను ఉపసంహరించుకోవాలి. శాంతియుతంగా ఉద్యోగులు నిరసనలు తెలుపుతుంటే ప్రభుత్వం రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోంది. పిలిచినా ఉద్యోగ సంఘాలు చర్చలకు రావడం లేదంటూ సజ్జల మాట్లాడే తీరు దారుణం. ముందుగా ప్రభుత్వం పీఆర్సీ కమిటీ నివేదికను బహిర్గతం చేయడంతో పాటు రివర్స్‌ పీఆర్సీ జీవోలు రద్దుచేసిన తర్వాత చర్చలకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఏ పీఆర్సీ ప్రకారం వేతనం తీసుకోదల్చుకున్నారో చెప్పే హక్కు ప్రతి ఉద్యోగికి ఉందనే విషయాన్ని తెలుసుకోవాలి. ఉద్యోగులు జీతాల కోసం ఉద్యమాలు చేస్తున్నారనడం కరెక్టు కాదు. ఉద్యమాన్ని పక్కదారి పట్టించేందుకు జిల్లాల విభజన అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

బండి శ్రీనివాసరావు, ఏపీఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు


వీటిని అమలు చేస్తే తక్షణమే చర్చలకు సిద్ధం 

చర్చలు దేనిమీద చేయాలో ఈ నెల 25నే మంత్రుల కమిటీకి స్పష్టం చేశామని పీఆర్సీ స్ట్రగుల్‌ కమిటీ సభ్యుడు జి.హృదయరాజు శుక్రవారం తెలిపారు. ఈ మూడు అంశాలపై ప్రభుత్వం తమతో చర్చించాల్సిన అవసరంలేదని, వాటిని తక్షణమే అమలు చేస్తే తాము చర్చలకు సిద్ధమన్నారు. అవి.... 

1. అశుతోష్‌మిశ్రా కమిషన్‌ నివేదికను బయట పెట్టడానికి 20మంది పీఆర్సీ స్ట్రగుల్‌ కమిటీ సభ్యుల ఈ మెయిల్స్‌ పంపిస్తాం. ప్రభుత్వ సైట్‌ ద్వారా, మీడియా ప్రతినిధుల ద్వారా బహిర్గతం చేయాలి.

2. అసంబద్ధ పీఆర్సీ జీవోలను రద్దు చేయాలి. 

3. ఫైనాన్స్‌ అధికారులు కొత్త జీతాల ప్రక్రియను నిలుపుదల చేసి పాత జీతాలను మంజూరు చేయాలి.

పీఆర్సీ స్ట్రగుల్‌ కమిటీ సభ్యుడు హృదయరాజు

Updated Date - 2022-01-29T08:36:26+05:30 IST