నిరుద్యోగులవి ఆత్మహత్యలు కావు.. ప్రభుత్వ హత్యలే

ABN , First Publish Date - 2022-01-31T08:13:11+05:30 IST

‘రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో పలువురు నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడటం విచారకరం. ఆ నిరుద్యోగులవి బలవన్మరణాలు కావు.. అవి ప్రభుత్వ హత్యలే’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు

నిరుద్యోగులవి ఆత్మహత్యలు కావు.. ప్రభుత్వ హత్యలే

  • నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే
  • మిలియన్‌ మార్చ్‌ నిర్వహించి తీరుతాం: బండి 
  • గాంధీజీ వర్ధంతి సందర్భంగా అమరుల దినోత్సవం


హైదరాబాద్‌, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో పలువురు నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడటం విచారకరం. ఆ నిరుద్యోగులవి బలవన్మరణాలు కావు.. అవి ప్రభుత్వ హత్యలే’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగులకు భృతి ఇవ్వాలన్న డిమాండ్‌తో బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల ఉద్యమాన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆదివారం తొలి సంతకం చేసి సంజయ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్లే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు లేక, కుటుంబాలను పోషించలేక నిరుద్యోగులు ప్రాణాలు తీసుకోవడం కలచివేస్తోందన్నారు.


తమ సూసైట్‌ నోట్‌లోనూ సీఎం కేసీఆర్‌ పేరు రాసి.. ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఈ నేపథ్యంలో కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను డిమాండ్‌ చేశారు.  నిరుద్యోగ భృతి హామీ ఇచ్చిన రోజు నుంచి రాష్ట్రంలోని నిరుద్యోగుల ఖాతాలో తక్షణం రూ. 1.08 లక్షలు జమ చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మిలియన్‌ మార్చ్‌ నిర్వహించి తీరుతామని తేల్చిచెప్పారు. నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఉద్యోగ నోటిఫికేషన్‌ల కోసం ఇదే చివరి ఉద్యమం కావాలని ఆకాంక్షించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌,  మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌ రావు, శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామి గౌడ్‌,  నేతలు గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్‌తో పాటు పలువురు నేతలు.. జాతిపిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ పిలుపు మేరకు నమో యాప్‌ ద్వారా సూక్ష్మ  విరాళాల సేకరణ కార్యక్రమాన్ని బండి సంజయ్‌, లక్ష్మణ్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా  పోస్టర్‌ విడుదల చేశారు. మల్కాజిగిరికి చెందిన యువజన కాంగ్రెస్‌ నాయకులు పలువురు బీజేపీలో చేరారు. 

Updated Date - 2022-01-31T08:13:11+05:30 IST