భద్రత కల్పించని మార్గదర్శకాలు!

ABN , First Publish Date - 2021-04-11T08:38:42+05:30 IST

టీఎస్ఆర్టీసీలో అమలవుతున్న ఉద్యోగ భద్రత ఉత్తర్వులు.. కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, ఇతర సిబ్బందికి భద్రత కల్పించలేకపోతున్నాయి.

భద్రత కల్పించని మార్గదర్శకాలు!

  • ఆర్టీసీలో ప్రశ్నార్థకంగా మారిన ఉద్యోగ భద్రత 
  • కొత్త మార్గదర్శకాలు వచ్చాకా 55 మంది సస్పెన్షన్‌
  • టికెట్లు తీసుకోకపోతే బాధ్యులవుతున్న కండక్లర్లు
  • సీఎం కేసీఆర్‌ హామీలకు విరుద్ధంగా సస్పెన్షన్లు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): టీఎస్ఆర్టీసీలో అమలవుతున్న ఉద్యోగ భద్రత ఉత్తర్వులు.. కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, ఇతర సిబ్బందికి భద్రత కల్పించలేకపోతున్నాయి. విధుల నుంచి సస్పెండ్‌ కాకుండా కాపాడలేకపోతున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులతో ఉద్యోగ భద్రత లభిస్తుందని భావించిన సిబ్బంది ఆశలు ఆడియాసలయ్యాయి. సంస్థలో ఎప్పటిలాగే సస్పెన్షన్లు, డిపో స్పేర్‌లు కొనసాగుతున్నాయి. ఉద్యోగ భద్రత ఉత్తర్వులు వెలువడిన తర్వాత సంస్థలో ఇప్పటివరకు 55 మంది కండక్టర్లు, డ్రైవర్లు సస్పెండ్‌ అయినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. కానీ, ఈ సంఖ్య 500 మందికి పైనే ఉంటుందని యూనియన్ల నాయకులు అంటున్నారు. మొత్తం 97 డిపోల్లో ఒక్కో డిపో నుంచి ఐదారుగురిని సస్పెండ్‌ చేశారని పేర్కొంటున్నారు. 2019లో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె అనంతరం వారికి సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీల్లో ఉద్యోగ భద్రత కూడా ఉంది. ఈ మేరకు.. బస్సులో టికెట్‌ తీసుకోకపోతే ప్రయాణికుడినే బాధ్యుడిని చేయాలి తప్ప.. కండక్టర్‌ను, టిమ్స్‌ డ్రైవర్‌ను కాదని, ఇందుకనుగుణంగా ఉద్యోగ భద్రత మార్గదర్శకాలను రూపొందించాలని ఆర్టీసీ అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో అధికారులు మార్గదర్శకాలను రూపొందించి ఈ ఏడాది ఫిబ్రవరి 5న సర్క్యులర్‌ జారీ చేశారు. అయితే పాత నిబంధనలనే స్పల్ప మార్పులు చేసి సర్క్యులర్‌ జారీచేశారని యూనియన్లు అప్పట్లోనే ఆరోపించాయి. ఇవి ఉద్యోగ భద్రత కల్పించలేవని మండిపడ్డాయి. మార్గదర్శకాలను మార్చాలంటూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌శర్మకు విన్నవించాయి. అయినా అవే మార్గదర్శకాలను అమలు చేస్తూ వచ్చారు. 


కొత్త మార్గదర్శకాలు వచ్చినా ఆర్టీసీ ఉద్యోగుల సస్పెన్షన్ల పరంపర కొనసాగుతూనే ఉంది. బస్సుల్లో ఒకరిద్దరు ప్రయాణికులకు టికెట్‌ ఇవ్వలేదని, డ్యూటీలు తీసుకునే సమయంలో ఎస్‌టీఐ, సీఐలతో అమర్యాదగా ప్రవర్తించారంటూ ఇన్‌-సబార్డినేషన్‌ కేసుల కింద కండక్టర్లను సస్పెండ్‌ చేస్తున్నారు. ప్రయాణికులు టికెట్‌ తీసుకోకపోతే కండక్టర్లు, టిమ్స్‌ డ్రైవర్లనే బలి చేస్తున్నారు. బస్సు ప్రమాదాల కేసుల్లో డ్రైవర్లను సస్పెండ్‌ చేస్తున్నారు. పెద్ద ప్రమాదం జరిగి, ప్రయాణికులు చనిపోయిన కేసుల్లోనే డ్రైవర్లను సర్వీసు నుంచి తొలగించాలన్న నిబంధన ఉంది. చిన్న చిన్న ప్రమాదాలను మొదటి తప్పు కింద భావించి వదిలేయాలని కొత్త మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కానీ, ఇలాంటి కేసుల్లోనూ డ్రైవర్లను సస్పెండ్‌ చేస్తున్నారని యూనియన్ల నేతలు ఆరోపిస్తున్నారు. తనిఖీ చేసిన బస్సులు బ్రేక్‌ డౌన్‌ అయినా, టైర్లు పగిలిపోయినా, గేర్లు, బ్రేకులు ఫెయిల్‌ అయినా... మెకానిక్‌లను సస్పెండ్‌ చేస్తున్నారు. కొంత మంది సిబ్బందిని డిపో స్పేర్‌లో పెట్టి నెలల తరబడి విధులివ్వకుండా సతాయిస్తున్నారు. ఇలా ఖమ్మం డిపోలో ఏడుగురు, నిజామాబాద్‌-2, మంచిర్యాల డిపోల్లో ఆరుగురు చొప్పున, షాద్‌నగర్‌ డిపోలో ఐదుగురు, గద్వాల్‌ డిపోలో నలుగురు, కామారెడ్డి డిపోలో ముగ్గురు, మెదక్‌, నల్లగొండ, అచ్చంపేట, కొల్లాపూర్‌, సంగారెడ్డి డిపోల్లో ఇద్దరు చొప్పున, నారాయణపేట, మహేశ్వరం, జీడిమెట్ల, జహీరాబాద్‌ డిపోల్లో ఒక్కొక్కరిని సస్పెండ్‌ చేశారు. వేములవాడ, సిరిసిల్ల డిపోల్లో నలుగురు చొప్పున, నర్సంపేట డిపోలో ఇద్దరిని సస్పెండ్‌ చేశారు. 


సర్క్యులర్‌ను రద్దు చేయాలి

ఉద్యోగులకు భద్రత కల్పించడానికి జారీ చేసిన సర్క్యులర్‌తో ఎలాంటి ప్రయోజనం లేదు. వీటి వల్ల భద్రత లభించడం కాదు కదా.. ఉద్యోగుల్లో అభద్రతా భావాన్ని మరింత పెంచాయి. సర్క్యులర్‌ వచ్చాక... ఇప్పటివరకు ఐదారు వందల మంది సస్పెండయ్యారు. ముఖ్యమంత్రి హామీకి అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందలేదు. ఆర్టీసీ అధికారులు ఇష్టం వచ్చినట్లు సిబ్బందిని సస్పెండ్‌ చేస్తున్నారు. భద్రత కల్పించలేని మార్గదర్శకాల సర్క్యులర్‌ను రద్దు చేసి, పూర్తి భద్రత కల్పించే మార్గదర్శకాలను జారీ చేయాలి. 

కె.హనుమంతు ముదిరాజ్‌, 

తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి

Updated Date - 2021-04-11T08:38:42+05:30 IST