జాబ్‌ లెస్‌ క్యాలెండర్‌

ABN , First Publish Date - 2021-06-21T05:40:12+05:30 IST

‘‘ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలన్న పట్టుదలతో డిగ్రీ పూర్తయిన వెంటనే పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఓ ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్‌ తీసుకున్నాను.

జాబ్‌ లెస్‌ క్యాలెండర్‌

‘ఉద్యోగాల విప్లవం’ ప్రకటనపై నిరుద్యోగుల ఆగ్రహం

తమ ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లిందంటూ ఆవేదన

పోలీస్‌, విద్యా శాఖల్లో ఖాళీ ఉద్యోగాల భర్తీ ప్రస్తావన లేకపోవడం దారుణం

గ్రూపు-1, 2లకు సంబంధించి 36 ఖాళీలను మాత్రమే ప్రకటించడంపై సర్వత్రా నిరసన

అన్ని ఉద్యోగాల ఖాళీలతో కొత్త క్యాలెండర్‌ విడుదల చేయాలని డిమాండ్‌

లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని నిరుద్యోగుల హెచ్చరిక


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం) 


‘‘ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలన్న పట్టుదలతో డిగ్రీ పూర్తయిన వెంటనే పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఓ ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్‌ తీసుకున్నాను. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని అధికారంలోకి రాకముందు వైసీపీ అధినేత చెప్పడంతో ఎంతో సంతోషించాను. ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఎప్పుడు నోటిఫికేషన్‌ జారీ చేస్తుందా అని రెండేళ్ల నుంచి ఆశగా ఎదురుచూస్తున్నాను. ఎట్టకేలకు ఇటీవల విడుదల చేసిన తొలి జాబ్‌ క్యాలెండర్‌ చూసి మైండ్‌బ్లాంక్‌ అయ్యింది. ఏళ్ల తరబడి ఇంటికి దూరంగా ఉంటూ, కష్టపడి ప్రిపేర్‌ అయ్యాను. ఏం చేయాలో అర్థం కావడం లేదు’’ అని రామకృష్ణ అనే నిరుద్యోగి వాపోయాడు. 

రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల క్రితం ‘ప్రభుత్వ ఉద్యోగాల విప్లవం’ పేరుతో ఎంతో గొప్పగా చెప్పుకుంటూ విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌పై నిరుద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు. ఇది ‘జాబ్‌ క్యాలెండర్‌’ కాదని, ముమ్మాటికీ ‘జాబ్‌ లెస్‌ క్యాలెండర్‌’ అని మండిపడుతున్నారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని, తాము అధికారంలోకి వస్తే వీటిని వెంటనే భర్తీ చేయడమే కాకుండా, ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని ఎన్నికల ప్రచారం సమయంలో జగన్మోహన్‌రెడ్డి పదేపదే చేసిన ప్రకటనలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఎట్టకేలకు రెండేళ్ల తరువాత కేవలం పది వేల పోస్టులతో తొలి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేశారంటూ తీవ్రనిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు 2.3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని చెప్పిన ఆయన... తీరా అధికారంలోకి వచ్చిన తరువాత వాటిల్లో నాలుగు శాతం మాత్రమే భర్తీ చేయడం ఎంతవరకు సమంజసమని నిరుద్యోగులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం లక్షలాది మంది నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించకపోవడం దురదృష్టకరమని వాపోతున్నారు. 

ఇచ్చిన మాట తప్పకూడదు...

వేలాది మంది నిరుద్యోగులు ఆశగా ఎదురు చూసే పోలీసు, విద్యా శాఖల్లోని పోస్టుల భర్తీ విషయాన్ని తాజాగా ప్రకటించిన క్యాలెండర్‌లో ప్రకటించకపోవడం దుర్మార్గమని, ఇది నిరుద్యోగ యువతను మోసం చేయడమేనని వాపోతున్నారు. ‘మాట తప్పను, మడమ తిప్పను’ అని తరచూ మాట్లాడే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి... ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రతిపక్షంలో వున్నప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఏటా ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేసేలా నోటిఫికేషన్లు ఇవ్వాలని, ఆ మేరకు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.


పెరిగిపోతున్న నిరుద్యోగ యువత

ప్రభుత్వ శాఖల్లో మూడేళ్లుగా ఖాళీల భర్తీ ప్రక్రియను చేపట్టకపోవడంతో  జిల్లాలో విద్యా వంతులైన నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. జిల్లాలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమైన నిరుద్యోగులు  కనీసం మూడు లక్షల మంది ఉంటారని అంచనా. . 


కొత్త జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాల్సిందే

హేమంత్‌ కుమార్‌, ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ పేరుతో ఇటీవల విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ నిరుద్యోగులను తీవ్రనిరుత్సాహానికి గురిచేసింది. ముఖ్యమంత్రి కాకముందు జగన్మోహన్‌రెడ్డి చెప్పిన దానికి పూర్తి విరుద్ధంగా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేశారు. గతంలో చెప్పినట్టు వివిధ శాఖల్లో ఖాళీగా వున్న మొత్తం రెండు లక్షల 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలి. ఈ మేరకు వెంటనే మరో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి, నోటిఫికేషన్లను విడుదల చేయాలి. అప్పటి వరకు పోరాటం సాగుతుంది. 


తీవ్ర అసంతప్తి కలిగించింది

కోటీశ్వరరావు, నిరుద్యోగి

పోలీసు శాఖలో ఎస్‌ఐ ఉద్యోగాన్ని సాధించేందుకు అవసరమైన శిక్షణ తీసుకుంటున్నా. ఎప్పుడెప్పుడు ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి నోటిఫికేషన్‌ ఇస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నాం. వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తరువాత విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌ తీవ్ర నిరాశ మిగిల్చింది. పోలీస్‌ శాఖలో పది వేల పోస్టులు వుంటే... 450 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామనడం దారుణం. జాబ్‌ క్యాలెండర్‌ నిరుద్యోగులను అవహేళన చేసేలా వుంది.


ఖాళీలను పూర్తిగా భర్తీ చేయాలి.. 

- ఆర్‌.సాయి, నిరుద్యోగి 

గ్రూపు-2 ఉద్యోగం కోసం నాలుగేళ్లుగా సిద్ధమవుతున్నా. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌లో గ్రూపు-1, 2లకు సంబంధించిన పోస్టులను చూస్తుంటే తీవ్రఆవేదన కలుగుతోంది. మొత్తంగా 36 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నామడం దురదృష్టకరం. ప్రభుత్వం పునరాలోచన చేసి, ఆయా శాఖలలోని ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలి. లేకపోతే ఆందోళనకు దిగుతాం. 



నేడు నిరుద్యోగుల మహా ధర్నా

ఏయూ మెయిన్‌ గేటు వద్ద 9 గంటలకు ప్రారంభం

విశాఖపట్నం, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువగా ఉండడంపట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగ యువత.. సోమవారం మహా ధర్నాకు పిలుపునిచ్చింది. ఏపీ నిరుద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఆంధ్రా యూనివర్శిటీ ప్రధాన గేటు వద్ద ఉదయం 9 గంటల నుంచి ధర్నా చేపట్టనున్నారు. గ్రూప్‌-1, 2లకు సంబంధించి 1,000 పోస్టులు భర్తీ చేయాలని, డీఎస్సీని జాబ్‌ క్యాలెండర్‌లో చేర్చి ఖాళీగా ఉన్న 20 వేల టీచర్‌ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇంకా పోలీస్‌ ఉద్యోగాలకు సంబంధించి 6,500 పోస్టులను, గ్రంథాలయాల్లో పోస్టులను పెంచాలని, ఉద్యోగుల వయో పరిమితిని 47 ఏళ్లకు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ధర్నా చేపట్టనున్నారు. 



Updated Date - 2021-06-21T05:40:12+05:30 IST