బైడెన్ సర్కార్ కీలక ప్రతిపాదనలు.. హెచ్-​1బీ వీసాదారులకు భారీ ఊరట !

ABN , First Publish Date - 2021-03-24T13:45:34+05:30 IST

జో బైడెన్ ప్రభుత్వం హెచ్-​1బీతో పాటు ఇమ్మిగ్రెంట్, నాన్ ఇమ్మిగ్రెంట్ వర్కర్ల వేతన సవరణలకు సంబంధించిన నిబంధనల అమలుపై తాజాగా కీలక ప్రతిపాదనలు చేసింది.

బైడెన్ సర్కార్ కీలక ప్రతిపాదనలు.. హెచ్-​1బీ వీసాదారులకు భారీ ఊరట !

వాషింగ్టన్: జో బైడెన్ ప్రభుత్వం హెచ్-​1బీతో పాటు ఇమ్మిగ్రెంట్, నాన్ ఇమ్మిగ్రెంట్ వర్కర్ల వేతన సవరణలకు సంబంధించిన నిబంధనల అమలుపై తాజాగా కీలక ప్రతిపాదనలు చేసింది. ఈ నిబంధనల అమలు గడువును మరో 18 నెలలు పొడిగించాలని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయించింది. దీంతో కార్మిక శాఖకు ఈ నిబంధనల చట్టబద్ధత, విధానపరమైన సమస్యలను సమగ్రంగా విశ్లేషించి పరిష్కరించేందుకు తగిన సమయం లభిస్తుందని సోమవారం ఈ ప్రకటన సందర్భంగా సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ నెల ప్రారంభంలో బైడెన్ ప్రభుత్వం ఈ నిబంధనల అమలును 60 రోజుల పాటు వాయిదా వేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. 


కాగా, ఈ కనీస వేతన నిబంధనలను 2021 జనవరిలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకువచ్చారు. హెచ్-1బీ, హెచ్-1బీ1, ఈ3 నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల ద్వారా శాశ్వత, తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగులను నియమించుకునే కంపెనీల కోసం ఈ విధానాలను రూపొందించింది ట్రంప్ ప్రభుత్వం. ఇంతకుముందు హెచ్​1-బీ వీసా పొందాలంటే కనీస వార్షికవేతనం 65 వేల డాలర్ల వరకు ఉంటే సరిపోయేది. కానీ, ట్రంప్ ఈ పరిమితిని 1.10 లక్షల డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు. దీని వల్ల అమెరికా పౌరులకు భారీగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతాయనేది ట్రంప్ ఆలోచన. దీంతో ట్రంప్ నిర్ణయాన్ని అప్పట్లో వలసదారులు తీవ్రంగా వ్యతిరేకించారు.

Updated Date - 2021-03-24T13:45:34+05:30 IST