హెచ్‌-1బీ వీసాలపై.. ట్రంప్ బాటలోనే జో బైడెన్?

ABN , First Publish Date - 2021-03-03T12:47:58+05:30 IST

హెచ్‌-1బీ వీసాలపై నిషేధాన్ని ఎత్తివేసే విషయంలో అమెరికా సర్కారు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జనవరి నెలలో పదవి నుంచి తొలగిపోయే ముందు.. హెచ్‌-1బీ వీసాలపై నిషేధం విధించారు. దానిని ఎత్తివేస్తామని అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రకటించారు.

హెచ్‌-1బీ వీసాలపై.. ట్రంప్ బాటలోనే జో బైడెన్?

వాషింగ్టన్‌, మార్చి 2: హెచ్‌-1బీ వీసాలపై నిషేధాన్ని ఎత్తివేసే విషయంలో అమెరికా సర్కారు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జనవరి నెలలో పదవి నుంచి తొలగిపోయే ముందు.. హెచ్‌-1బీ వీసాలపై నిషేధం విధించారు. దానిని ఎత్తివేస్తామని అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రకటించారు. ట్రంప్‌ తెచ్చిన కొన్ని నిబంధనలను క్రమంగా ఎత్తివేశారు. అందులో ముఖ్యమైనవి.. గ్రీన్‌ కార్డులపై, ముస్లిం వీసాలపై, ముస్లిం దేశస్థులపై ఉన్న నిషేధాలను ఎత్తివేయడం. అయితే.. వృత్తి నిపుణులకు ఇచ్చే హెచ్‌-1బీ వీసాల జారీపై నిషేధాన్ని ఇంకా ఎత్తివేయాల్సి ఉంది. దీనిపై బైడెన్‌ సర్కారు ఎటూ తేల్చుకోలేదని తెలుస్తోంది. దీనిపై హోంల్యాండ్‌ సెక్యూరిటీ కార్యదర్శి అలెజాండ్రో మయోర్కాస్‌ సోమవారం స్పష్టతనిచ్చారు. 


హెచ్‌-1బీపై నిషేధం ఎత్తివేత ఇప్పట్లో సాధ్యం కాదని పరోక్షంగా చెప్పారు. ‘‘మా ముందు ఇంకా ముఖ్యమైన అంశాలున్నాయి. శరణార్థుల సమస్యలు పరిష్కరించడం, వ్యవసాయ కార్మికులకు సహకరించడం, చట్టవిరుద్ధంగా తమ తల్లిదండ్రులతో ఈ దేశానికి వచ్చిన పిల్లలను ఆదుకోవడం, ఇమిగ్రేషన్‌లో వృత్తి నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిసారించాం’’ అని వివరించారు. హెచ్‌-1బీల జారీపై ట్రంప్‌ విధించిన నిషేధం ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి ప్రారంభం కానున్న ఆర్థిక సంవత్సరానికి వచ్చిన హెచ్‌1-బీ దరఖాస్తులను పరిశీలిస్తున్నారు.


బైడెన్‌ ఉప సహాయకుడిగా మాజూ వర్గీస్‌

బైడెన్‌ ప్రభుత్వంలో మరో భారత సంతతి వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించారు. బైడెన్‌ ఎన్నికల ప్రచారంలో కీలక సభ్యుడిగా వ్యవ హరించిన లాయర్‌ మాజూ వర్గీస్‌.. బైడెన్‌ ఉప సహాయకుడిగా, శ్వేత సౌధ మిలిటరీ కార్యాలయ డైరెక్టర్‌గా నియమితుడయ్యారు. 

Updated Date - 2021-03-03T12:47:58+05:30 IST