హెచ్‌-1బీ వీసాలపై సందిగ్ధంలో బైడెన్ సర్కార్ !

ABN , First Publish Date - 2021-03-02T21:13:57+05:30 IST

ట్రంప్ హయాంలో అమలైన పలు ఇమ్మిగ్రేషన్ విధానాలను మార్చిన జో బైడెన్ ప్రభుత్వం.. హెచ్-1బీ వీసాల జారీపై మాజీ అధ్యక్షుడు విధించిన బ్యాన్‌ను తొలిగించే విషయమై మాత్రం సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది.

హెచ్‌-1బీ వీసాలపై సందిగ్ధంలో బైడెన్ సర్కార్ !

వాషింగ్టన్: ట్రంప్ హయాంలో అమలైన పలు ఇమ్మిగ్రేషన్ విధానాలను మార్చిన జో బైడెన్ ప్రభుత్వం.. హెచ్-1బీ వీసాల జారీపై మాజీ అధ్యక్షుడు విధించిన బ్యాన్‌ను తొలిగించే విషయమై మాత్రం సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. అగ్రరాజ్యంలో విదేశీ నిపుణులకు అందించే హెచ్‌-1బీ వీసాల జారీపై ట్రంప్‌ విధించిన నిషేధాన్ని తొలగించే అంశంపై బైడెన్‌ సర్కార్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మేయర్‌కాస్‌ తెలిపారు. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో ట్రంప్ హెచ్​-1బీ వీసాల జారీ నిలిపివేతను మార్చి 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మహమ్మారి కారణంగా దేశంలో నిరుద్యోగిత రేటు భారీగా పెరగడం, అధిక సంఖ్యలో విదేశీ కార్మికులకు ప్రస్తుత పరిస్థితుల్లో పని కల్పించే స్థితిలో యూఎస్ లేదనే కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పుడు ట్రంప్ పేర్కొన్నారు. 


అయితే, కొత్తగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్.. ట్రంప్‌ హయాంలో ఇమ్మిగ్రేషన్ విషయమై తీసుకున్న నాటి పలు నిర్ణయాలను ఒక్కొక్కటిగా రద్దు చేస్తూ వస్తున్నారు. దీనిలో భాగంగానే ముస్లిం వీసా బ్యాన్ తొలగింపు, గ్రీన్‌కార్డు పరిమితి ఎత్తివేత వంటి వాటిని బైడెన్ అమలు చేశారు. కానీ, హెచ్​-1బీ జారీ నిలిపివేతపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 31తో ఈ నిషేధం ముగుస్తున్న తరుణంలో మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా తలెత్తిన ప్రశ్నకు సమాధానంగా.. ఈ విషయమై తనకు ఎలాంటి వివరాలు తెలియవని అలెజాండ్రో మీడియాతో అన్నారు. ఇప్పుడు తమ పరిపాలన విభాగం కేవలం అమెరికా పునురుద్ధరణ, పునర్నిర్మాణంపైనే దృష్టిసారించినట్లు చెప్పుకొచ్చారు. అలాగే యూఎస్ సిటిజన్షిష్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్‌) కూడా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్-1బీ వీసా దరఖాస్తుల ప్రాసెస్ విషయంలో తలమునకలై ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 


కాగా, 2021 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్ణీత పరిమితికి సరిపడా దరఖాస్తులు స్వీకరించినట్టు యూఎస్‌సీఐఎస్ ఇప్పటికే వెల్లడించింది. యేటా యూఎస్ వీదేశీయులకు 65 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది. అలాగే మరో 20వేల హెచ్-బీ వీసాలు మాస్టర్ క్యాప్(అత్యున్నత విద్యార్హతలు, నైపుణ్యం) కింద ఇస్తోంది. ఇలా ప్రతి ఏడాది అగ్రరాజ్యం విదేశీయులకు ఉపాధి కల్పించేందుకు మొత్తం 85వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది. ఇక హెచ్‌-1బీ వీసా విధానం అనేది నిపుణులైన విదేశీయులను ఉద్యోగాల్లో నియమించుకునేందుకు యూఎస్ కంపెనీలకు వీలు కల్పిస్తుంది. దీని ద్వారానే ఇండియా, చైనా తదితర దేశాల నుంచి యేటా వేల సంఖ్యలో ఐటీ నిపుణులు అగ్రరాజ్యంలో ఉపాధి పొందుతున్నారు.

Updated Date - 2021-03-02T21:13:57+05:30 IST