H1-B visa: బైడెన్ సర్కార్ తీపి కబురు.. భారతీయులకు భారీ మేలు!

ABN , First Publish Date - 2021-11-12T18:57:23+05:30 IST

హెచ్​-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం తీపి కబురు అందించింది. 'ఆటోమేటిక్‌ వర్క్‌ ఆథరైజేషన్‌' కింద అనుమతులు ఇచ్చేందుకు జో బైడెన్‌ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో యూఎస్‌లో ఉంటున్న భారతీయులతో పాటు వేలాది మంది ప్రవాసులకు ప్రయోజనం కలుగనుంది. ఈ అంశంపై వలసదారుల జీవిత భాగస్వాముల తరఫున అమెరికన్‌ ఇమ్మిగ్రేషన్‌..

H1-B visa: బైడెన్ సర్కార్ తీపి కబురు.. భారతీయులకు భారీ మేలు!

వాషింగ్టన్: హెచ్​-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వం తీపి కబురు అందించింది. 'ఆటోమేటిక్‌ వర్క్‌ ఆథరైజేషన్‌' కింద అనుమతులు ఇచ్చేందుకు జో బైడెన్‌ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో యూఎస్‌లో ఉంటున్న భారతీయులతో పాటు వేలాది మంది ప్రవాసులకు ప్రయోజనం కలుగనుంది. ఈ అంశంపై వలసదారుల జీవిత భాగస్వాముల తరఫున అమెరికన్‌ ఇమ్మిగ్రేషన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌(ఏఐఎల్‌ఏ) వేసిన పిటిషన్‌పై అక్కడి హోంల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ సానుకూలంగా స్పందించింది. హెచ్​-1బీ, ఎల్-1 వీసా హోల్డర్ల జీవిత భాగస్వాములకు వర్క్ ఆథరైజేషన్ పర్మిట్‌లపై 180 రోజుల వరకు ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్‌ను అనుమతించాలని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్)ను యూఎస్ కోర్టు ఆదేశించింది. కనుక ఇకపై హెచ్‌-4 వీసాలు కలిగిన హెచ్​-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు వర్క్ ఆథరైజేషన్ పర్మిట్‌ల పొడిగింపు విషయంలో ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.   


ఇక అమెరికాలో హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏళ్లలోపు వారి పిల్లలు అక్కడ ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా హెచ్‌-4 వీసాలు జారీ చేస్తోంది. అయితే, గతంలో హోంల్యాండ్‌ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్‌-4 వీసాదారులు ఉద్యోగాలు పొందకుండా నిషేధం విధించడంతో వారు రీ-ఆథరైజేషన్‌ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. దీంతో వీరు భారీ వేతనాలు లభించే ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తోంది. దీనిపై వలసదారుల జీవిత భాగస్వాములు ఏఐఎల్‌ఏను ఆశ్రయించడంతో పాటు హోంల్యాండ్‌ సెక్యూరిటీస్‌ విభాగంలో పిటిషన్‌ వేశారు. 


తాజాగా ఈ పిటిషన్‌పై బైడెన్‌ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. దీంతో హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములు ఇకపై తమ ఎంప్లాయిమెంట్‌ ఆథరైజేషన్‌ పొడగింపు కోసం ఎదురుచూడకుండా ఆటోమెటిక్‌గా పని అనుమతులు పొందేందుకు వీలు ఏర్పడింది. కాగా, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములకు పని అనుమతులు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇదిలాఉంటే.. ఇప్పటి వరకు అమెరికా 90వేలకు పైగా హెచ్‌-4 వీసాలను జారీ చేసింది. వీటిలో భారీ సంఖ్యలో భారతీయ మహిళలే అందుకున్నారు. జో బైడెన్ సర్కార్ తాజా నిర్ణయంతో వీరికి లబ్ధి చేకూరనుంది. 

Updated Date - 2021-11-12T18:57:23+05:30 IST