హెచ్1బీ వీసాల విషయంలో.. బైడెన్ సర్కార్ కీలక ఉత్తర్వులు

ABN , First Publish Date - 2021-03-12T22:28:49+05:30 IST

అగ్రరాజ్య అధినేత జో బైడెన్.. కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్1-బీ వీసాల విషయంలో ట్రంప్ సర్కార్ గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుకు మరోసారి బ్రేకులు వేశారు. ఈ మేరకు జో బైడెన్ టీం శుక్రవారం రో

హెచ్1బీ వీసాల విషయంలో.. బైడెన్ సర్కార్ కీలక ఉత్తర్వులు

వాషింగ్టన్: అగ్రరాజ్య అధినేత జో బైడెన్.. కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్1-బీ వీసాల విషయంలో ట్రంప్ సర్కార్ గతంలో ఇచ్చిన ఆదేశాల అమలుకు మరోసారి బ్రేకులు వేశారు. ఈ మేరకు జో బైడెన్ టీం శుక్రవారం రోజు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో లక్షలాది మంది ప్రవాసులు లబ్ధి పొందనున్నారు. ఈ క్రమంలో ప్రవాసలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 


అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలుచేందుకు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఉద్యోగ అవకాశల్లో అమెరికన్లకు మేలు జరిగేలా చేసి.. తద్వారా మరోసారి అధ్యక్ష పీఠాన్ని చేజిక్కుంచుకోవాలని భావించారు. ఇందులో భాగంగా హెచ్1-బీ వీసాపై అమెరికాకు వచ్చే విదేశీయుల జీతాలను అమాంతం పెంచుతూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అమెరికా సంస్థలు విదేశీ నిపుణులకు పెద్ద మొత్తంలో జీతాలు చెల్లించలేక.. స్వదేశీ పౌరులకు ఉద్యోగాలిస్తాయని ట్రంప్ అనుకున్నారు. అయితే అప్పట్లో దిగ్గజ సంస్థలన్నీ ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎన్నికల్లో జో బైడెన్ విజయం సాధించడంతో ట్రంప్ ఇచ్చిన ఆదేశాల అమలుకు బ్రేకులు పడ్డాయి.



ఈ క్రమంలో బైడెన్ టీం శుక్రవారం రోజు కీలక ఉత్తర్వులను వెలువరించింది. గత ప్రభుత్వ ఆదేశాలను దాదాపు 60 రోజుల వరకు పెండింగ్‌లో పెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్1బీ వీసాదారుల జీతాల పెంపు అంశంపై ట్రంప్ సర్కార్ ఇచ్చిన ఆదేశాలు మే 14 వరకు అమలులోకి రాకుండా డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఆ తర్వాత కూడా ట్రంప్ ఆదేశాలను అమలు చేయాలా? వద్దా? అనే అంశంపై చర్చించనున్నట్టు పేర్కొంది. హెచ్1-బీ వీసాలు అత్యధికంగా పొందుతున్న దేశాల జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ తర్వాత స్థానంలో ఉంది. కాగా.. బైడెన్ సర్కారు తాజా నిర్ణయంతో ప్రవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2021-03-12T22:28:49+05:30 IST