అమెరికా అధ్యక్షుడిగా నా మొదటి చర్యలలో అదొకటి: బైడెన్

ABN , First Publish Date - 2020-12-04T16:34:11+05:30 IST

అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కొత్త కేసులు, మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడిగా నా మొదటి చర్యలలో అదొకటి: బైడెన్

వాషింగ్టన్: అమెరికాలో మహమ్మారి కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కొత్త కేసులు, మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ గురువారం మీడియాతో మాట్లాడుతూ... అధ్యక్షుడిగా తన మొదటి చర్యలలో ఒకటిగా 100 రోజుల పాటు ముఖానికి మాస్కులు ధరించడానికి కట్టుబడి ఉండమని అమెరికన్లను అడుగుతానని అన్నారు. వైరస్ వ్యాప్తి కట్టడిలో ఫేస్‌మాస్క్ ధరించడం చాలా కీలకమని ఈ సందర్భంగా బైడెన్ పేర్కొన్నారు. 2.75 లక్షల మంది అమెరికన్లను పొట్టనబెట్టుకున్న మహమ్మారిని నిలువరించడంలో సులభమైన మార్గాలలో ఇదొకటి అని ప్రజారోగ్య నిపుణులు చెబుతున్న.. దీనిని స్వీకరించడానికి చాలా మంది సుముఖంగా లేకపోవడం చాలా నిరాశపరుస్తోందని బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి అమెరికన్ ముఖానికి మాస్క్ ధరించడం 'ప్యాట్రియాటిక్ డ్యూటీ'గా భావించాలని సూచించారు. ప్రమాణ స్వీకారం చేసే జనవరి 20న తాను అమెరికన్లను మొదట రిక్వెస్ట్ చేసేది ఇదేనని తెలిపారు. 


"ప్రమాణ స్వీకారం రోజు అమెరికన్లకు నేను కోరేది ఒక్కటే... ప్రతిఒక్కరూ 100 రోజులు తప్పకుండా ముఖానికి మాస్క్ ధరించాలి. కేవలం వంద రోజులే.. ఎప్పటికీ కాదు, కేవలం వందంటే 100 రోజులే. దీనిని తూచతప్పకుండా పాటిస్తే ఆ తర్వాత వైరస్ వ్యాప్తిలో తగ్గుదలను మీరే గమనిస్తారు." అని బైడెన్ అన్నారు. అలాగే తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీని ఆయన పదవిలో(చీఫ్ మెడికల్ అడ్వైజర్) కొనసాగాలని కోరుతానన్నారు. అంతేగాక తన కొవిడ్ అడ్వైజరీ బృందంలో కూడా ఫౌసీని చేరాలని కోరనున్నట్లు బైడెన్ తెలిపారు. 


ఇక కరోనా వ్యాక్సిన్‌ సామర్థ్యం, భద్రతాపై దేశ ప్రజల్లో నెలకొన్న అనుమానాన్ని తొలిగించేందుకు ముగ్గురు యూఎస్ మాజీ అధ్యక్షులు ముందుకు రావడం హర్షణీయం అన్నారు. కొవిడ్ టీకాపై అమెరికన్లలో విశ్వాసాన్ని కలిగించేందుకు మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్ వాలంటీర్లుగా బహిరంగంగా వ్యాక్సిన్ తీసుకునేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే.  

Updated Date - 2020-12-04T16:34:11+05:30 IST