భారత్‌తో సంబంధాలు.. ట్రంప్ ఫొటోలకే పరిమితం..: జో బైడెన్ కామెంట్స్

ABN , First Publish Date - 2020-10-24T22:30:16+05:30 IST

‘ట్రంప్‌ ఓ జాత్యాహంకారి.. మాయమాటలతో అధికారంలోకి వచ్చి.. తన విధానాలతో భారతీయ అమెరికన్లను ఇబ్బందులకు గురిచేశాడు.. అమెరికాలో జరిగిన జాత్యాహంకార దాడులకు అతడి వైఖరే ప్రధాన కారణం.. భా

భారత్‌తో సంబంధాలు.. ట్రంప్ ఫొటోలకే పరిమితం..: జో బైడెన్ కామెంట్స్

వాషింగ్టన్: ‘ట్రంప్‌ ఓ జాత్యాహంకారి.. మాయమాటలతో అధికారంలోకి వచ్చి.. తన విధానాలతో భారతీయ అమెరికన్లను ఇబ్బందులకు గురిచేశాడు.. అమెరికాలో జరిగిన జాత్యాహంకార దాడులకు అతడి వైఖరే ప్రధాన కారణం.. భారతీయ అమెరికన్లంటే ఆయనకు అస్సలు పడదు.. వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించండి.. నేను అధికారంలోకి వస్తే అనేక అంశాల్లో భారత్‌తో కలిసి పనిచేస్తా..’ అంటూ డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న జో బైడెన్ వ్యాఖ్యానించారు. శనివారం భారతీయ అమెరికన్లతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.. 


‘ఉగ్రవాద నిర్మూలన విషయంలో భారత్‌తో కలిసి పనిచేస్తాం.. చైనాయే కాదు.. మరే ఇతర దేశం కూడా సరిహద్దు దేశాల్లో అలజడులు సృష్టించకుండా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటా.. భారతీయ అమెరికన్లతో నాకు ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయి.. అమెరికాలోని కాలేజీలు, యూనివర్శిటీల్లో ట్యూషన్ ఫీజును లక్షా 25వేల డాలర్లలోపే ఉండేలా చేస్తా.. దీని వల్ల వేలాది భారతీయ అమెరికన్ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. భారత్- అమెరికా మధ్య సంబంధాల విషయంలో ట్రంప్ కేవలం ఫొటోలకే పరిమితమయ్యారు. నేను మాత్రం అలా కాదు.. ఆయా అంశాల్లో ఇరు దేశాలు సంతృప్తికరమైన ఫలితాన్ని పొందేలా చేస్తా.. నేను కమలా హారిస్‌ను ఉపాధ్యక్ష పదవికి నామినేట్ చేసినప్పుడు మీరు బాగా సంతోషించారని నాకు తెలుసు.. ఆమె కథ... మీ కథ ఒక్కటే..’ .. అంటూ భారతీయ అమెరికన్లను ఉద్దేశించి జో బైడెన్ ప్రసంగించారు. ఈ ఎన్నికల్లో తనకు మద్ధతుగా నిలిచి గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. 

Updated Date - 2020-10-24T22:30:16+05:30 IST