భారత సంతతి మహిళకు అత్యున్నత గౌరవం

ABN , First Publish Date - 2020-08-13T13:49:57+05:30 IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత సంతతి వ్యక్తికి అత్యున్నత గౌరవం దక్కింది. కాలిఫోర్నియా నుంచి డెమోక్రటిక్‌ సెనేటర్‌గా ఉన్న కమలా హారిస్‌ (55)ను ఆ పార్టీ అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న జో బైడెన్‌.. ఉపాధ్యక్ష పదవికి కమల బరిలో నిలుస్తున్నట్లు వెల్లడించారు.

భారత సంతతి మహిళకు అత్యున్నత గౌరవం

అమెరికా ఉపాధ్యక్ష పోటీలో కమలా హారిస్‌

డెమోక్రాట్‌ అభ్యర్థిగా బరిలోకి

ఆమె పేరును ప్రకటించిన బైడెన్‌ 

ఇద్దరం కలిసి ట్రంప్‌ను ఓడించబోతున్నామని వ్యాఖ్య

ఈ పదవికి పోటీపడుతున్న తొలి నల్లజాతి మహిళ

యూఎస్‌కు శుభదినం: ఒబామా 

భారతీయ అమెరికన్ల హర్షం 

హారిస్‌.. మర్యాదలేని వ్యక్తి: ట్రంప్‌

వాషింగ్టన్‌/న్యూఢిల్లీ, ఆగస్టు 12: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత సంతతి వ్యక్తికి అత్యున్నత గౌరవం దక్కింది. కాలిఫోర్నియా నుంచి డెమోక్రటిక్‌ సెనేటర్‌గా ఉన్న కమలా హారిస్‌ (55)ను ఆ పార్టీ అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న జో బైడెన్‌.. ఉపాధ్యక్ష పదవికి కమల బరిలో నిలుస్తున్నట్లు వెల్లడించారు. ఈ పదవికి మహిళను పోటీలో నిలుపుతానని ప్రకటించిన బైడెన్‌ తన మాట నిలబెట్టుకున్నారు. మంగళవారం కమలా హారిస్‌ పేరును ప్రకటించడం ద్వారా చరిత్ర సృష్టించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అత్యంత కీలకమైన నల్లజాతి ఓటర్లను ఆకర్షించి డొనాల్డ్‌ ట్రంప్‌కు చెక్‌ పెట్టే వ్యూహంలో భాగంగానే బైడెన్‌ ఉపాఽధ్యక్ష పదవికి కమలను ఎంపిక చేశారు. అమెరికాలోని అత్యుత్తమ ప్రజాసేవకుల్లో ఒకరని కమలను ప్రశంసించిన బైడెన్‌.. ‘మీతో కలిసి ట్రంప్‌ను ఓడించబోతున్నాం’ అంటూ ట్వీట్‌ చేశారు. అమెరికాను తిరిగి గాడిలో పెట్టేందుకు కమలా హారిస్‌ తనకు చక్కటి భాగస్వామి అని పేర్కొన్నారు. కమల పేరు ప్రకటించడం ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సవాలు విసిరారు. ఉపాధ్యక్ష పదవికి ఎంపికవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు కమల తెలిపారు. బైడెన్‌ను అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు.  


తొలి నల్లజాతి మహిళ

అమెరికా ఉపాధ్యక్ష పదవికి కమలా హారి్‌సను ఎంపిక చేయడంతో తొలిసారి ఈ పదవికి ఓ నల్లజాతి మహిళ బరిలో నిలుస్తున్నట్లయింది. అమెరికా చరిత్రలో ఇప్పటి వరకూ ఒక మహిళ అధ్యక్షురాలిగా లేదా ఉపాధ్యక్షురాలిగా పనిచేయలేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా హారిస్‌ అభ్యర్థిత్వానికి మద్దతు పలికారు. ఆమె ఎంపికలో ఒబామా కీలకపాత్ర పోషించారు. ఆయన సూచనలతోనే బైడెన్‌.. కమలను ఎంపిక చేశారు. ఉపాధ్యక్షుడిని ఎంచుకోవడమే ఒక అధ్యక్షుడు తీసుకునే తొలి ప్రధాన నిర్ణయమని, కమలా  ఎంపికతో బైడెన్‌ తన సమర్థతను చాటుకున్నారని ప్రశంసించారు. 


చరిత్రాత్మకం.. భారతీయ అమెరికన్లు 

కమలను ఎంపిక చేయడం చరిత్రాత్మకమని భారతీయ అమెరికన్లు హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ ఇండియన్‌ అమెరికన్‌ గ్రూపులు, పెప్సికో మాజీ చీఫ్‌ ఇంద్రా నూయీ, పలువురు ప్రముఖులు డెమోక్రాట్లు గొప్ప నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. ‘మన దేశానికి సంబంధించి ఇదో గొప్ప ఎంపిక’ అని ప్రపంచంలోని ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిప్రదాతగా నిలిచిన ఇంద్రా నూయీ ట్వీట్‌ చేశారు. కమల ఎంపిక మొత్తం భారతీయ అమెరికన్లకు ఉత్తేజం కలిగించే అంశమని ప్రముఖ భారతీయ అమెరికన్‌ ఎం.ఆర్‌.రంగస్వామి పేర్కొన్నారు. కమల అభ్యర్థిత్వాన్ని స్వాగతించిన ప్రముఖ భారతీయ అమెరికన్‌ సంస్థ ఇంపాక్ట్‌.. ఆమె ప్రచారం కోసం 10 మిలియన్‌ డాలర్ల నిధులు సేకరిస్తామని తెలిపింది. అయితే కొందరు భారతీయ అమెరికన్లు మాత్రం భారత్‌-అమెరికా బంధాల బలోపేతానికి కమల ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. భారతీయ అమెరికన్ల ప్రభావం ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో బైడెన్‌-కమల ద్వయానికి అంత సులువుగా ఓట్లు పడవని ‘ట్రంప్‌ విక్టరీ ఇండియన్‌ అమెరికన్‌ ఫైనాన్స్‌ కమిటీ’ సహాధ్యక్షుడు అల్‌ మాసన్‌ చెప్పారు. భారతీయులు ఎక్కువగా ఉండే టెక్సాస్‌, మిషిగాన్‌, ఫ్లోరిడా, వర్జీనియా, పెన్సిల్వేనియా వంటి రాష్ట్రాల్లో సాధారణంగా డెమోక్రాట్లకు ఓటేస్తారని, వారిలో ఇప్పుడు 50 శాతం మంది ట్రంప్‌ వర్గానికి ఓటేయనున్నట్లు తమ సర్వేలో తేలిందని చెప్పారు. తమిళనాడు ప్రజలకు గర్వకారణమని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం పేర్కొన్నారు. 


అమ్మే స్ఫూర్తి: కమల 

తనకు తన తల్లే స్ఫూర్తి అని కమలా హారిస్‌ చెబుతారు. తనకు ఎంత గుర్తింపు దక్కినా శ్యామలా గోపాలన్‌ కుమార్తెనని చెప్పుకోవడమే ఇష్టమని అంటారు. అనేక కట్టుబాట్లు, అవరోధాలను అధిగమించి 19 ఏళ్ల వయసులో ఉన్నత విద్య కోసం అమెరికా వచ్చిన ఓ యువతి (శ్యామలా గోపాలన్‌).. రొమ్ము కేన్సర్‌పై పరిశోధనలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన తీరు తనకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకని కమల స్పష్టం చేశారు. తల్లే తనకు నిజమైన హీరో అన్నారు.   


ఆమె.. ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థా?

 ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిగా కమలా హారి్‌సను ఎంపిక చేయడం తనకు ఆశ్చర్యం కలిగించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పారు. తన ప్రత్యర్థి బైడెన్‌ తీసుకున్న నిర్ణయం తననెంతగానో ఆశ్చర్యపరిచిందన్నారు. అంతేకాదు కమలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కమల ఎంత నీచంగా, అగౌరవంగా వ్యవహరిస్తుందో తెలిసి కూడా బైడెన్‌ ఆమెను అభ్యర్థిగా ఎంపిక చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. అమెరికా సెనేట్‌లో ఆమెను అత్యంత అసహ్యకరమైన వ్యక్తిగా భావిస్తున్నట్లు తెలిపారు. 


 చైనాలో కలవరం మొదలు

చైనాలో కలవరం మొదలైంది. జిన్జియాంగ్‌, హాంకాంగ్‌లకు సంబంధించి మానవహక్కుల సమస్యలపై  చైనాకు వ్యతిరేకంగా కమల బలమైన వైఖరి ప్రదర్శించారు. చైనా విధానాలను ఎండగట్టడంలో ఆమె ముందుంటారు. ఆమె పోటీ అంశంపై స్పందించడానికి చైనా బుధవారం అధికారికంగా తిరస్కరించింది. రెండు దేశాల మధ్య ప్రస్తుత వివాద పరిస్థితుల నేపథ్యంలో అగ్నికి ఆజ్యం పోసినట్లు ఉంటుందని చైనా అధికార మీడియా పేర్కొంది.  


ఇదీ ‘కమల’ ప్రస్థానం.. 

కమలా హారిస్‌ 1964 అక్టోబరు 20న కాలిఫోర్నియాలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు శ్యామలా గోపాలన్‌, డొనాల్డ్‌ హారిస్‌. చెన్నైకి చెందిన శ్యామలా గోపాలన్‌ న్యూట్రిషన్‌, ఎండోక్రినాలజీలో పరిశోధన కోసం అమెరికా వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో జమైకాకు చెందిన డొనాల్డ్‌ హారి్‌సతో ఆమెకు పరిచయమైంది. అది కాస్తా పెళ్లికి దారితీసింది. ఇక కమల తాతయ్య పీవీ గోపాలన్‌ భారత స్వాతంత్య్ర సమరయోధుడు. దౌత్యాధికారిగా కూడా పనిచేశారు. చిన్నతనంలో తరచూ చెన్నై రావడంతో కమలపై తాత ప్రభావం పడింది. ఆమె 2014లో డగ్లస్‌ ఎంహో్‌ఫను పెళ్లి చేసుకున్నారు. ఆఫ్రికా సంతతి తండ్రి- ఆసియా సంతతి తల్లి పెంపకంలో రెండు సంస్కృతుల కలయికకు చిహ్నంగా నిలిచిన కమలను రాజకీయంగా బరాక్‌ ఒబామాతో పోలుస్తారు. 


కమల 1986లో హోవార్డ్‌ వర్సిటీ నుంచి రాజకీయ, ఆర్థిక శాస్త్రాల్లో డిగ్రీ పూర్తిచేశారు. 

హేస్టింగ్‌ కాలేజ్‌ ఆఫ్‌ లా నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 

డెమోక్రటిక్‌ పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగారు. 2003లో శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్‌ అటార్నీగా ఎన్నికై.. ఆ పదవి చేపట్టిన తొలి నల్లజాతి, దక్షిణాసియా సంతతి మహిళగా రికార్డు సృష్టించారు. 

2011-17 మధ్య కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేశారు. 

2017 జనవరిలో కాలిఫోర్నియా సెనేటర్‌ అయ్యారు. 

Updated Date - 2020-08-13T13:49:57+05:30 IST