అధ్యక్షుడిగా జో బైడెన్ మొదటి రోజు తీసుకోబోయే నిర్ణయాలివే!

ABN , First Publish Date - 2021-01-21T01:56:50+05:30 IST

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేసే సమయం ఆసన్నమైంది.

అధ్యక్షుడిగా జో బైడెన్ మొదటి రోజు తీసుకోబోయే నిర్ణయాలివే!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేసే సమయం ఆసన్నమైంది. మరి కొద్ది గంటల్లో వీరిద్దరూ అధికారికంగా బాధ్యతలను చేపట్టనున్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ భద్రత నడుమ జో బైడెన్ ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇదిలా ఉంటే.. జో బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ తీసుకున్న అనేక నిర్ణయాలను వెనక్కు తీసుకునేలా బైడెన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేయనున్నారు. పారిస్ ఒప్పందం నుంచి మాస్క్‌ను ధరించడం తప్పనిసరి చేయడం వరకు బైడెన్ అనేక కీలక నిర్ణయాలను తీసుకోబోతున్నారు. 


బైడెన్ మొదటి రోజు తీసుకోబోయే నిర్ణయాలు ఇవే..


ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)లో మళ్లీ చేరడం:

కరోనా మహమ్మారికి చైనానే కారణమంటూ ట్రంప్ అనేక ఆరోపణలు చేస్తూ వచ్చారు. కరోనా గురించి ముందుగానే హెచ్చరించకుండా డబ్ల్యూహెచ్ఓ జాప్యం చేసిందంటూ ట్రంప్ మండిపడ్డారు. అంతేకాకుండా అమెరికా అన్ని దేశాల కంటే ఎక్కువ నిధులు ఇస్తున్నప్పటికి చైనాకు మద్దతుగా వ్యవహరిస్తోందంటూ ట్రంప్ ఆరోపించారు. ఈ కారణంగా ఆయన డబ్ల్యూహెచ్ఓకు నిధులు ఆపేయడమే కాకుండా ఆ సంస్థ నుంచి బయటకు వచ్చేశారు. ఇప్పుడు జో బైడెన్ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన వెంటనే తిరిగి డబ్ల్యూహెచ్ఓలో అమెరికాను చేర్చనున్నారు.


ప్రభుత్వ సంస్థల్లో మాస్క్ తప్పనిసరి చేయడం:

అమెరికా వ్యాప్తంగా అన్ని ఫెడరల్ బిల్డింగ్స్‌లోనూ మాస్క్ ధరించేలా, ఫిజికల్ డిస్టెన్సింగ్‌ పాటించేలా జో బైడెన్ ఆదేశాలు జారీ చేయనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఫేస్ మాస్క్‌ను తప్పనిసరిగా ధరిస్తూనే ఉన్నారు. అయినప్పటికి తాము ఉదాహరణగా నిలిచేందుకు బైడెన్ ఈ ఆదేశాలు ఇవ్వనున్నారు. దీంతో పాటు వంద రోజుల పాటు ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని బైడెన్ ప్రజలను కోరనున్నారు. ‘100 డే మాస్కింగ్ చాలెంజ్‌’ను లాంచ్ చేయనున్నారు.


విద్యార్థులపై రుణ భారాన్ని తగ్గించడం:

జో బైడెన్ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. విద్యార్థులు రుణాలపై చెల్లించాల్సిన వడ్డీని,  రుణాల గడువు తేదీని సెప్టెంబర్ 30 వరకు పెంచనున్నారు.  


పారిస్ వాతావరణ ఒప్పందంలో తిరిగి చేరడం:

ఒబామా ప్రభుత్వం వాతావరణ సవాళ్లకు సంబంధించి అనేక కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇప్పుడు జో బైడెన్ ప్రభుత్వం కూడా అదే విధంగా పనిచేయనుంది. ఇందులో భాగంగానే పారిస్ వాతావరణ ఒప్పందంలో మళ్లీ అమెరికాను చేర్చనున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా ప్రపంచ దేశాలు సగటు ఉష్ణోగ్రత రెండు డిగ్రీల కంటే తక్కువగా ఉండేలా ఉద్గార లక్ష్యాలను రూపొందించాల్సి ఉంటుంది. ఒబామా ప్రభుత్వంలో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఈ ఒప్పందం జరగడం విశేషం. ట్రంప్ ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చేయగా.. బైడెన్ ప్రభుత్వం మళ్లీ ఒప్పందంలో చేరనుంది. 


సరిహద్దు గోడ నిర్మాణాన్ని ఆపేయడం:

ట్రంప్ అధ్యక్షుడిగా కాక ముందు నుంచి సరిహద్దుల్లో గోడను నిర్మిస్తానంటూ హామీ ఇచ్చారు. అధ్యక్షుడయ్యాక సరిహద్దు గోడ నిర్మాణానికి భారీగా నిధులను కూడా సమకూర్చారు. అయితే జో బైడెన్ ప్రభుత్వం మాత్రం సరిహద్దు గోడ నిర్మాణాన్ని ఆపివేయనుంది. ఇకపై దీని నిర్మాణానికి నిధులను ఆపేసి.. ఆ నిధులను మిలిటరీ కన్‌స్ట్రక్షన్‌కు వాడనుంది. 


ట్రావెల్ బ్యాన్‌ను ఎత్తివేయడం: 

ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికన్ల కంటే కూడా ఎక్కువ ఆసక్తి విదేశీయులపైనే పెట్టారని చెప్పచ్చు. దేశంలోని విదేశీయులు వారి దేశాలకు వెళ్లిపోయేలా, ఇతర దేశస్థులు అమెరికాలో అడుగుపెట్టకుండా ఆయన అనేక చర్యలు తీసుకుంటూ వచ్చారు. ఆ చర్యలను ఖండించిన బైడెన్ ఇప్పుడు విదేశీయులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయనున్నారు. ట్రంప్ అనేక ముస్లిం దేశాలపై ఆంక్షలు విధించగా.. బైడెన్ అధ్యక్షుడైన వెంటనే ఆ ఆంక్షలను ఎత్తివేయనున్నారు.


లైబీరియన్స్‌ను రక్షించే చర్యలు తీసుకోవడం: 

జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే లైబీరియన్స్‌ను రక్షించేలా కీలక నిర్ణయం తీసుకోనున్నారు. లైబీరియాలో సివిల్ వార్ తరువాత చాలా మంది దేశస్థులు అమెరికాకు వచ్చి జీవిస్తున్నారు. వారిని దేశం నుంచి బహిష్కరించకుండా కనీసం 2022 జూన్ వరకు గడువునిచ్చేలా జో బైడెన్ ఆదేశాలివ్వనున్నారు.


వివక్షకు వ్యతిరేకంగా కీలక నిర్ణయాలు:

గడిచిన నాలుగేళ్లలో అమెరికా వ్యాప్తంగా వివిక్షకు సంబంధించి అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. వివక్షకు ఎక్కడా తావివ్వకుండా ముందుకు వెళ్లేలా బైడెన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే పనిచేసే చోట ఎవరూ వివక్షకు గురికాకుండా, వివక్షను నిషేధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయనున్నారు. 


జో బైడెన్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే వీటితో పాటు మరికొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేయనున్నారు. పైన చెప్పిన వాటితో కలిపి మొదటి రోజే మొత్తంగా 15 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై బైడెన్ సంతకం చేయనున్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2021-01-21T01:56:50+05:30 IST