వలసదారులకు బైడెన్‌ గుడ్‌న్యూస్ !

ABN , First Publish Date - 2021-02-26T12:49:44+05:30 IST

వలసదారులకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ తీపికబురు అందించారు. గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులపై ఆంక్షలను ఎత్తివేశారు. కరోనా సంక్షోభం దరిమిలా స్థానికుల ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందనే కారణంతో నిరుడు ఏప్రిల్‌లో గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు అమెరికాలో ప్రవేశించకుండా ట్రంప్‌ నిషేధం విధించారు.

వలసదారులకు బైడెన్‌ గుడ్‌న్యూస్ !

ట్రంప్‌ ఆదేశాలు వెనక్కి.. వలసదారులకు బైడెన్‌ తీపికబురు

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 25: వలసదారులకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ తీపికబురు అందించారు. గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులపై ఆంక్షలను ఎత్తివేశారు. కరోనా సంక్షోభం దరిమిలా స్థానికుల ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందనే కారణంతో నిరుడు ఏప్రిల్‌లో గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులు అమెరికాలో ప్రవేశించకుండా ట్రంప్‌ నిషేధం విధించారు. డిసెంబరు 31, 2020 వరకు ఉన్న ఆంక్షల గడువును ట్రంప్‌.. ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థతో పాటు అమెరికన్ల ఉపాధిని పరిరక్షించే చర్యగా అప్పట్లో ట్రంప్‌ దీనిని అభివర్ణించారు. తద్వారా గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లారు.


ఈ ఆంక్షలు అమెరికాలో కుటుంబాలను తిరిగి కలవనీయకుండా నిరోధించాయని, అమెరికా వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీశాయని బైడెన్‌ పేర్కొన్నారు. తాను అధికారంలోకి వస్తే కఠినమైన ఇమిగ్రేషన్‌ విధానాలను సరళీకృతం చేస్తానన్న హామీ లో భాగంగా గ్రీన్‌కార్డులపై ట్రంప్‌ విధించిన ఆంక్షలను బైడెన్‌ తాజాగా ఉపసంహరించారు. వలసేతర వీసా హెచ్‌1బీపై అమెరికాలో పనిచేస్తూ శాశ్వత నివాస హోదా కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయ నిపుణులకు నిజంగా ఇది ఊరట కలిగించే విషయమే. కాగా, వలస విధానాల్లో సమగ్ర సంస్కరణల ఆవశ్యకత ఎంతో ఉందని మైక్రోసాఫ్ట్‌ సహా ప్రముఖ ఐటీ దిగ్గజసంస్థలు అమెరికా చట్టసభ సభ్యులకు సూచించాయి.  

Updated Date - 2021-02-26T12:49:44+05:30 IST