తాలిబాన్లను మించిన ముప్పు ఉంది : బైడెన్

ABN , First Publish Date - 2021-08-20T00:46:23+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టినప్పటికీ, ఇతర

తాలిబాన్లను మించిన ముప్పు ఉంది : బైడెన్

వాషింగ్టన్ : ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టినప్పటికీ, ఇతర దేశాల్లోని అల్ ఖైదా, దాని అనుబంధ సంస్థల నుంచి ఎక్కువ ముప్పు పొంచి ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అమెరికా సైనిక శక్తిని ఆఫ్ఘనిస్థాన్‌లో కేంద్రీకరించడం ఇక ఎంత మాత్రం హేతుబద్ధం కాదని చెప్పారు. అమెరికన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూ గురువారం ప్రసారమైంది. 


ముప్పు ఎక్కువ ఉన్న చోట మనం దృష్టి పెట్టాలని జో బైడెన్ చెప్పారు. ఓ ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేస్తూ పోదామనే ఆలోచన, వేలాది మంది అమెరికా దళాలను ఆఫ్ఘనిస్థాన్‌లో కొనసాగిద్దామనే ఆలోచన, ఓవైపు ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ ఆఫ్రికా (సమస్యలు) ఉండగా, ముంచుకొస్తున్న, పెరుగుతున్న సమస్యలను పట్టించుకోకుండా  ఇవన్నీ చేయగలమనే ఆలోచన హేతుబద్ధమైనది కాదన్నారు. 


ఆఫ్ఘనిస్థాన్‌లో కన్నా సిరియా, తూర్పు ఆఫ్రికాలలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐసిస్) పెను ముప్పుగా పరిణమించిందన్నారు. ఐసిస్ (కేన్సర్ రోగంలా) అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోందన్నారు. సిరియా వంటి ప్రాంతాల్లో అమెరికా సైన్యం చెప్పుకోదగ్గ స్థాయిలో లేనప్పటికీ, ఐసిస్‌ను తుదముట్టించే సామర్థ్యం ఉందన్నారు. 


ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలు, బాలికలపై జరుగుతున్న దురాగతాల గురించి ప్రస్తావిస్తూ, సైనిక శక్తితో మహిళల హక్కులను కాపాడటానికి ప్రయత్నించడం సరికాదన్నారు. మానవ హక్కుల ఉల్లంఘనదారులు తమ ప్రవర్తనను మార్చుకునే విధంగా దౌత్యపరంగా, అంతర్జాతీయంగా ఒత్తిడి తేవాలన్నారు. 


ఆఫ్ఘనిస్థాన్‌లో దాదాపు 15 వేల మంది అమెరికన్లు ఉన్నట్లు అంచనా. వేలాది మంది ఆ దేశం విడిచి పారిపోయేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా, అక్కడి హింసాత్మక దృశ్యాలు ప్రపంచాన్ని కలచివేస్తున్నాయి. ఈ పరిణామాలతో జో బైడెన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాలను ఈ నెల 31 తర్వాత కూడా ఉంచబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని ప్రతి అమెరికన్ తిరిగి స్వదేశానికి వచ్చే వరకు ఆ దేశంలో అమెరికన్ దళాలను ఉంచుతామని చెప్పారు. 


Updated Date - 2021-08-20T00:46:23+05:30 IST