చెలరేగుతున్న కరోనా.. బైడెన్ కీలక నిర్ణయం!

ABN , First Publish Date - 2021-01-26T00:13:43+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తున్న కొవిడ్ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడం కోసం మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసిన జో బైడెన్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోనున్న

చెలరేగుతున్న కరోనా.. బైడెన్ కీలక నిర్ణయం!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తున్న కొవిడ్ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయడం కోసం మాస్క్‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసిన జో బైడెన్.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. నాన్ అమెరికన్ సిటిజన్లపై ట్రావెల్ బ్యాన్‌ను విధించేందుకు అగ్రరాజ్య అధినేత జో బైడెన్ సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. బ్రెజిల్‌తోపాటు యూరప్ దేశాలైన బ్రిటన్, ఐర్లాండ్ దేశాల్లో కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా దేశాల పౌరులపై బైడెన్.. ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశం ఉందని వైట్‌హౌస్ అధికారులు వెల్లడించారు. కొత్త కరోనా వైరస్ నేపథ్యంలో ఆ ఆంక్షలను సౌత్ ఆఫ్రికాకు వర్తింప చేయాలనే ఆలోచనలో బైడెన్ ఉన్నట్టు అమెరికా మీడియా పేర్కొంది. 



కాగా.. కరోనా వైరస్ విజృంభిస్తున్న తొలినాళ్లలో అప్పటి అమెరికా అధ్యక్షుడ డొనాల్డ్ ట్రంప్.. చైనా నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధిస్తూ జనవరి 31,2020 తేదీన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఈ మహమ్మారి ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు పాకడంతో.. ప్రయాణ ఆంక్షలను యూరప్ దేశాలకు కూడా వర్తింప చేస్తూ మార్చి 14న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ట్రంప్.. ప్రయాణ ఆంక్షలను కాస్త సడలించారు. అయితే తన పదవి కాలం చివరి రోజుల్లో ట్రంప్ ఈ ఆంక్షలను పూర్తిగా ఎత్తేస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ క్రమంలో ఈ నెల 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బైడెన్.. కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం ప్రయాణ ఆంక్షలను తిరిగి పునరుద్దరించేందుకు సిద్ధం అయ్యారు. ఇదిలా ఉంటే.. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికాలో కొవిడ్ బాధితుల సంఖ్య 25 మిలియన్లు దాటింది. ఇందులో దాదాపు 4.20లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2021-01-26T00:13:43+05:30 IST