Abn logo
Jun 19 2021 @ 00:30AM

నీవు లేవు, నీ పాట ఉంది

ఉద్యమ పాటల నేర్పరి, ఉద్యమ పాటల ఊటబావి, ఉద్యమ పాటల గురువు గూడ అంజయ్య మనల్ని విడిచి జూన్ 21కి ఐదేండ్లు అవుతుంది. ఈ రోజు వస్తుందంటే గుండె బరువెక్కుతుంది. తెలంగాణ జనుల జ్ఞాపకాలలో నిత్యం మెదులుతూనే ఉన్నాడు. రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఉద్యమ అవసరం ఏర్పడడం దానిని ముందుకు నడిపించే పాట కోసం వెతుకులాట మొదలైనప్పుడు గూడ అంజన్న మళ్ళీ పుడితే బాగుండును అనిపిస్తుంది. స్వచ్ఛమైన పల్లె మనసుతో రాసే పాటలకు గౌరవం ఎక్కువ ఉంటుంది. అందుకే అంజన్న రాసిన పాటలు తెలుగు సమాజానికి వెలుగునిచ్చే దివిటీలుగా నిలబడినవి.


అరవై ఏండ్ల జీవితంలో నాలుగు దశాబ్దాలు ప్రజాకళాకారుడిగా చైతన్యవంతమైన మార్గంలో జీవించాడు. తను రాసిన ‘ఊరు మనదిరా...’ పాట 16 భాషలలో అనువాదం కావడం చూస్తే పాటకు ఉన్న శక్తి ఏమిటో తెలుస్తుంది. ఎందరెందరో రాస్తారు. కానీ ప్రజల హృదయాలను మేల్కొలిపే వారు కొందరే ఉంటారు. అందుకే గూడ అంజన్న తనకు తానే సాటి. ఆదిలాబాద్ జిల్లా లింగాపురంలో అట్టడుగు వర్గాల బిడ్డగా పుట్టి పల్లె జీవితం కనులారా చూసి కత్తికి ఉండే పదును లాగా తన పాటలను మలిచాడు. సామాజిక వ్యవస్థలలోని దుర్మార్గమైన పద్ధతులను ఎండగట్టాడు. ప్రజా చైతన్య పోరాటాలకు ధైర్యాన్ని నూరిపోశాడు. తెలంగాణ ఉద్యమానికి ఆయువు పట్టులాంటి పాటలను అందించిన గూడ అంజన్న తెలుగు ప్రజల చరిత్ర ఉన్నంత వరకు తను ఆశించిన వారసత్వ కళారూపాలకు ప్రాణం పోస్తూ ఉంటాడు. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’, ‘భద్రం కొడుకో నా కొడుకో కొమురన్న జర’, ‘ఊరిడిసి నే బోదునా... అయ్యో ఉరిబెట్టుకొని సద్దునా’ ‘ఊరు మనదిరా..ఈ వాడ మనదిరా..’ పాటల హోరును, అవి రగిలించిన ఉద్యమ జ్వాలలను గుర్తించిన పాలకులు దిద్దుబాటుకు పూనుకున్నారు.


ప్రత్యేక రాష్ట్ర మలి దశ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన పాటల జాతరలో గూడ అంజన్న రాసిన ‘అవ్వోనివా నీవు అయ్యోనివా’, ‘పుడితొక్కటి చస్తే రెండు రాజిగ ఒరి రాజిగా’ అనేవి ధూంధాం వేదికలపై గజ్జె కట్టి గంతులేసినవి. రాజకీయాలకు దూరంగా ఉంటూనే వాటి ద్వారా రావలసిన మార్పులను గురించి ప్రజలలో ఆలోచనలు రేకెత్తించాడు. ప్రజాస్వామిక ఆకాంక్షలు నెరవేరాలని అహర్నిశలు కృషి చేశాడు. ఆరుపదుల వయసులో ఆరోగ్యాన్ని లెక్కచేయక తెలంగాణ రాష్ట్రమే తన శ్వాసగా భావించి ఉద్యమ పాటను యుద్ధక్షేత్రంలో ముందు వరుసలో నిలిపాడు. చిరుద్యోగిగా బతుకును వెళ్లదీసినా పేరు ప్రఖ్యాతులు కలిగి ఉన్నా ఇతరుల వలె పక్క చూపులు చూడలేదు. కుటుంబానికి ఏమి కూడబెట్టక పోయినా తెలంగాణ పోరాట చరిత్రలో తన ముఖచిత్రాన్ని సగౌరవంగా ముద్రించుకున్నాడు. పాలకులు నిరంకుశంగా మారినప్పుడల్లా తెలంగాణ మనదిరా... అంటూ, వీడేందిరో అంటూ జనం పాటలు అందిస్తూనే ఉంటాడు. గూడ అంజన్న త్యాగాలను గుర్తించి ప్రభుత్వాలు ఏమి చేసినా చేయకపోయినా పౌర సమాజం వారి కుటుంబానికి బాసటగా నిలవాలి. ప్రజా సాహిత్య ఒరవడిని నేర్పుగా సాగించాలి. 


జోగు అంజయ్య

(జూన్ 21: గూడ అంజన్న వర్ధంతి)