నిత్యావసరాల కొరత రానివ్వం

ABN , First Publish Date - 2020-04-04T09:27:56+05:30 IST

జిల్లాలో ప్రజలకు అవసరమైన నిత్యావసర సరకులకు కొరత రాకుండా చర్యలు తీసుకుంటు న్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌ పేర్కొన్నారు.

నిత్యావసరాల కొరత రానివ్వం

‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం):జిల్లాలో ప్రజలకు అవసరమైన నిత్యావసర సరకులకు కొరత రాకుండా చర్యలు తీసుకుంటు న్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ లోతేటి శివశంకర్‌ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడుతూ బియ్యం తరువాత ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేసే కందిపప్పు, నూనెలు, గోధుమపిండి, మిననపప్పు వంటి వాటి నిల్వలు తగ్గకుండా అంతర్‌ జిల్లాల రవాణాకు అనుమతి తీసుకున్నామన్నారు. 


వినుకొండ నుంచి కందిపప్పు

గుంటూరు జిల్లా వినుకొండ నుంచి రెండు రోజుల క్రితం 36 టన్నుల కందిపప్పు  నగరానికి వచ్చిందన్నారు. సాధారణంగా రోజుకు 60 టన్నుల కందిపప్పు వస్తుందని, ఈ నేపథ్యంలో మరింత సరకు తెప్పించేందుకు చర్యలు తీసుకుంటు న్నామన్నారు. అదేవిధంగా జిల్లా అవసరాలకు సరిపడా ఉల్లిపాయల రవాణాకు ఇబ్బందులున్నా యని, దీనిపై రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నారన్నారు. 


గోధుమపిండి కొరత

నగరం, జిల్లాలో రోజుకు 100 టన్నుల గోధుమపిండి అమ్మకాలు జరుగుతుంటాయని వివరించారు. అయితే ప్రస్తుతం ఉత్తరాది నుంచి వచ్చే గోధుములు, పిండి రావడంలో సమస్యలు ఉన్నాయన్నారు. గోధుమపిండి నిల్వలు తక్కువగా వున్నాయని హోల్‌సేల్‌ వ్యాపారులు జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చారన్నారు. కాకి నాడ, కాండ్లా, పారదీప్‌ పోర్టులకు వంట నూనె లతో కూడిన నౌకలు వచ్చాయని, వాటి దిగుమతికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. మనకు దగ్గర లో వున్న కాకినాడ నుంచి నూనెను తీసుకు రావడంపై దృష్టిసారించామన్నారు. బిస్కెట్ల కొరత వున్నట్టు పలువురు వ్యాపారులు చెప్పడంతో హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల నుంచి సరుకు తీ సుకు రావడానికి యత్నిస్తున్నామని వివరించారు. 


ధరల అదుపునకు కమిటీ

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యావసర సరకుల ధరల అదుపునకు ఒక కమిటీ పనిచేస్తోందన్నారు. మూడు రోజుల క్రితం సరకులు, కూరగాయలకు ధరలు నిర్ణయించి, ఆ వివరాలు వ్యాపారులు, రైతులు, వినియోగదారులు...అందరికీ తెలిసేలా రైతుబజార్లు, దుకాణాలు, షాపుల వద్ద పోస్టర్లు అతికించామని, ముఖ్యమైన ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటుచేశామన్నారు. ఈనెల 14వ తేదీ వరకు ఇవే ధరలు అమలులో ఉంటాయన్నారు. ధరలు పెంచి విక్రయాలు చేపడితే చర్యలు తీసుకుంటా మని జాయింట్‌ కలెక్టర్‌ హెచ్చరించారు. ధరల అమలుపై తూనికలు, కొలతల శాఖ అధికారులు నగరం, జిల్లాలో దుకాణాలు, రైతుబజార్లలో తనిఖీలు చేయాలని ఆయన ఆదేశించారు. 


కాగా రేషన్‌ డిపోల ద్వారా 50 శాతం మేర బియ్యం పంపిణీ జరిగిందన్నారు. గురువారం వరకు జిల్లాలో 6,02,954 కార్డులకు 957 మెట్రిక్‌ టన్నుల బియ్యం, 513 టన్నుల కంది పప్పు పంపిణీ చేశామన్నారు. 


ఈ నెల 15 వరకు సరకులు పంపిణీ జరుగుతుందని, కార్డుదారులు ఆందోళన చెందనవసరం లేదని జేసీ తెలిపారు. తక్కువగా సరకులు అందజేశారని ఫిర్యాదు మేరకు చీడికాడ మండలం వీరభద్రపేట డీలర్‌ను సస్పెండ్‌ చేశామన్నారు. 

Updated Date - 2020-04-04T09:27:56+05:30 IST