ఉమ్మడి ఫ్రంట్‌

ABN , First Publish Date - 2021-04-01T07:14:29+05:30 IST

కీలక రాజకీయ సమరాన్ని ఎదుర్కొనబోతున్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల

ఉమ్మడి ఫ్రంట్‌

  • బీజేపీపై సంయుక్తంగా పోరాడదాం
  • హక్కుల్ని, స్వేచ్ఛను హరిస్తోంది.. మోదీ నియంత పోకడలే కారణం
  • కేంద్రంలో గట్టి ప్రత్యామ్నాయం అవసరం.. కలిసి రండి
  • కేసీఆర్‌, జగన్‌ సహా విపక్ష నేతలకు బెంగాల్‌ సీఎం మమత లేఖ
  • పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల తర్వాత జాతీయ సమీకరణాల్లో మార్పు!


న్యూఢిల్లీ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): కీలక రాజకీయ సమరాన్ని ఎదుర్కొనబోతున్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ అధినేత మమతా బెనర్జీ జాతీయ రాజకీయాల దిశగా వ్యూహాత్మకంగా ఓ అడుగు ముందుకేశారు. బీజేపీని దీటుగా ఎదుర్కొని మట్టికరిపించేందుకు ఉమ్మడిగా ఉద్యమిద్దామని పిలుపిస్తూ తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్‌, జగన్‌ సహా పది విపక్షాల అగ్రనేతలకు బుధవారం ఓ లేఖను పంపారు.


‘‘ప్రజాస్వామ్యం పెద్ద ప్రమాదంలో పడింది. రాజ్యాంగంపైనా, సమాఖ్య వ్యవస్థపైనా నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా సమైక్యంగా, సమర్థంగా పోరాడేందుకు సమయం ఆసన్నమైంది. అందరం కలిసి దేశ ప్రజలకు విశ్వసనీయ ప్రత్యామ్నాయాన్ని అందించాలి. ఇందుకు కలిసిరావాలని కోరుతున్నాను’’ అని ఆమె తన లేఖలో విజ్ఞప్తి చేశారు.


ఈ లేఖను చూస్తే... బెంగాల్‌తో పాటు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఘట్టం ముగిసిన తర్వాత కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంయుక్త వ్యూహరచనకు మమత పిలుపివ్వడం, దాదాపుగా అన్ని పార్టీలకూ బీజేపీ ఉమ్మడి శత్రువుగా మారడంతో ఎన్నికలయాక ఓ ఐక్య సంఘటన రూపుదిద్దుకునే దిశగా కార్యాచరణ మొదలుకావచ్చన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అంతేకాక, ఈసారి కూడా గెలుపుపై ధీమాగా ఉన్న మమత, ఈ విపక్షాల ఐక్యతకు కేంద్ర బిందువుగా మారే ప్రయత్నాన్ని ఈ లేఖ ద్వారా చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.


మమతా బెనర్జీ లేఖ అందుకున్న నేతల్లో  సోనియాగాంధీ, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, కే చంద్రశేఖర్‌రావు, శరద్‌ పవార్‌,  స్టాలిన్‌, ఉధ్దవ్‌ ఠాక్రే, అఖిలేష్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, దీపాంకర్‌ భట్టాచార్య ఉన్నారు. అందరూ ఎన్నికల ఫలితాలకోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న రీ త్యా వెంటనే మమత లేఖకు ఎవరూ స్పం దించకపోవచ్చునని, అయితే కాంగ్రెస్‌ సహా కొన్ని పార్టీలతో అవగాహన ఉన్నందువల్లే ఆ మె ఈ లేఖ రాశారని ఈ వర్గాలు తెలిపారు



తాను లేఖ రాసిన పది పార్టీలే కాక దేశంలో భావ సారూప్యత గల పార్టీలన్నీ కలిసికట్టుగా ఐక్యం కావాలని, టీఎంసీ  చైర్‌ పర్సన్‌గా అందరితో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మమత చెప్పారు. కాగా దేశంలో సమైక్య ప్రతిపక్షం ఏర్పర్చేందుకు 2019 లోక్‌ సభ ఎన్నికల ముందునుంచీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ వివిధ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల అది ఇంతవరకూ సాధ్యం కాలేదు.


కాని ప్రస్తుతం దేశంలో విశ్వసనీయ ప్రత్యామ్నాయం ఏర్పడేందుకు సమయం పరిపక్వంగామారిందని,  మోదీ పాలన పట్ల దేశంలో వివిధ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఇందుకు కారణమని, లేఖను రాయడం వెనుక ఆంతర్యమిదేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పార్లమెంట్‌లో ప్రస్తుతం బీజేపీకి 300మంది లోక్‌సభ సభ్యులుండగా ఆ పార్టీ మిత్ర పక్షాల్లో జేడీయూకు 16, లోక్‌ జనశక్తికి ఆరుగురు, అప్నాదళ్‌ కు ఇద్దరు సభ్యులున్నారు.


మమత తన లేఖలో బిజూ జనతాదళ్‌, బీఎస్పీ పేర్లను ప్రస్తావించలేదని, ఈ రెండు పార్టీలకు కలిసి 22 మంది సభ్యుల మద్దతు ఉన్నప్పటికీ మాయవతి, నవీన్‌ పట్నాయక్‌లను ఆమె నమ్మదగ్గ మిత్ర పక్షాలుగా భావించడం లేదని రాజకీయ వర్గాలు అంటున్నాయి. టీఆర్‌ఎస్‌, వైసీపీ కూడా తమ వైఖరిని మరింత స్పష్టంగా తెలిపేందుకు ఆమె లేఖ ఉపయోగపడుతుందని ఈ వర్గాలు భావిస్తున్నాయి. అయినా లోక్‌సభలోని 543 సీట్లలో ప్రతిపక్షాలు బలంగా సమీకృతమైతే 150 మం దికి పైగా ఎంపీలు సంఘటితం కావొచ్చని రాజకీయ వర్గాలు వివరిస్తున్నాయి. 




ఏడు దృష్టాంతాలు 

ప్రజాస్వామ్యంపై, సహకార సమాఖ్య స్ఫూర్తిపై బీజేపీ తీవ్ర దాడికి పాల్పడుతోందని ఆరోపిస్తూ మమతా బెనర్జీ తన లేఖలో ఏడు ఉదంతాలను ప్రస్తావించారు, ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మరిన్ని అధికారాలను కల్పించడం, గవర్నర్‌ అధికారాలను దుర్వినియోగపరచడం, సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర సంస్థలను తమకు అనుకూలంగా వాడుకోవడం, రాష్ట్రాల నిధుల్ని తొక్కిపెట్టడం, జాతీయ అభివృద్ది మండలి, ప్రణాళికా సంఘం వంటి సంస్థల్ని రద్దు చేయడం, బీజేపీయేతర ప్రభుత్వాల్ని పడగొట్టేందుకు డబ్బు సంచుల్ని పంచడం, జాతీయ ఆస్తులను విశృంఖలంగా ప్రైవేటుపరం చేయడం, కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు క్షీణించడం మొదలైన వాటిని ఆమె ప్రస్తావించారు. స్వాతంత్య్రం తరువాత అధికార విపక్షాల మధ్య అంతరం ఇంతలా అగాధంగా మారడం ఇదే ప్రథమమని ఆమె దుయ్యబట్టారు. 


Updated Date - 2021-04-01T07:14:29+05:30 IST