లెక్క తేలేనా..!

ABN , First Publish Date - 2020-06-05T10:48:41+05:30 IST

రెవెన్యూ, అటవీ శాఖల భూతగాదాలో నిరుపేదలు బలవుతున్నారు. జిల్లాలో దాదాపు 25 వేల ఎకరాల భూములు అటవీ, రెవెన్యూ శాఖల

లెక్క తేలేనా..!

అటవీ, రెవెన్యూ శాఖల భూవివాదంలో  25 వేల ఎకరాలు

ఇరుశాఖల మధ్య నలుగుతున్న నిరుపేదలు

జాయింట్‌ సర్వే పైనే ఆశలు

సీజన్‌ ప్రారంభానికి ముందు తేల్చాలని కోరుతున్న బాధితులు

వేమనపల్లి మండలంలో సర్వే ప్రారంభం


(ఆంధ్రజ్యోతి, మంచిర్యాల)

 రెవెన్యూ, అటవీ శాఖల భూతగాదాలో నిరుపేదలు బలవుతున్నారు.  జిల్లాలో దాదాపు 25 వేల ఎకరాల భూములు అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో చిక్కుకొన్నాయి. భూతగాదాలతో సుమారు 8 వేల మంది  పేద ప్రజలు నలిగిపోతున్నారు. దశాబ్దాల కాలంగా ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. ఏళ్ళ క్రితం సర్వే చేసి పెట్టిన హద్దుల ఆనవాళ్లు లేక ఏ భూములు ఏ శాఖకు చెందినవో  తెలియకుండా పోయింది. సంయుక్త సర్వే చేయాలని వేడుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. సమగ్ర భూ సర్వేలో లెక్క తేలుతుందని భావించిన్పటికి  అధికారులు వివాదాస్పద భూముల జోలికి వెళ్ళలేదు. ప్రస్తుతం మండలాల వారీగా వివాదాస్పద భూముల లెక్కతేల్చే పనిలో అధికారులున్నారు. వేమనపల్లి మండ లం బుయ్యారంలో ఇరు శాఖల అధికారులు సర్వే చేప డుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వివాదంలో ఉన్న భూముల లెక్కలు తేల్చితే ఈ వానకాలంలో అయినా పంటలు సాగు చేసుకుంటామని బాదిత రైతులం టున్నారు. 


 దళితులు.. గిరిజనులే అధికం...

సాగుకు చేసుకుంటున్న రైతులను అటవీశాఖ వారు అడ్డుకుంటున్నారు.  రిజర్వు ఫారెస్టుకు చెందిన భూము ల్లో  పంటలెలా వేస్తారని కేసులు పెడుతున్నారు. చెట్టు పుట్టలు తొలగించుకుని రైతులు అష్టకష్టాలు పడి సాగుకు యోగ్యంగా చేసుకున్న భూముల్లో అధికారులు మొక్కలు నాటుతున్నారు. దీంతో ప్రభుత్వం ద్వారా పట్టాలు పొందిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న వారిలో మెజార్టీ రైతులు దళితులు, గిరిజనులే ఉన్నారు.  ప్రభుత్వ శాఖల్లో సరైన రికార్డులు లేకపోవడం వివాదాలకు కారణమవుతోంది. 


వివాదంలో 25 వేల ఎకరాలు

జిల్లాలో అటవీ, రెవెన్యూ శాఖల మధ్య దాదాపు 25 వేల ఎకరాల భూములు ఉండగా, 8 వేల మంది వరకు ఈ సమస్యలతో నలిగిపోతున్నారు.   పలు చోట్ల అటవీ శాఖ దాడులు, కేసులు తట్టుకోలేక సాగు మానేశారు. జిల్లాలోనే అత్యధిక ప్రభుత్వ భూములు ఉన్న నెన్నెల మండలంలో దాదాపు 7,800ల ఎకరాల భూమి వివా దంలో ఉంది.  అటవీశాఖ అడ్డంకులతో నెన్నెలలో నిర్మిం చ తలపెట్టిన సోలార్‌ పవర్‌ ప్లాంటు పనులు వెనుక బడ్డాయి. సింగాపూర్‌లోని సర్వే నంబరు 34, 36 లలో 950 ఎకరాలు, కొంపెల్లి, పొట్యాల, కొత్తూరు శివారులోని సర్వే నంబరు 4లో 600ల ఎకరాలు, కోనంపేట వద్దగల సీమరేగళ్లలోని సర్వే నంబరు 660లో 700ల ఎకరాలు, నెన్నెల, బొప్పారం శివారులోని సర్వేనంబరు 671, 672, 674లలో 1200లో ఎకరాలు, పుప్పల్‌వానిపేటలోని సర్వే నంబరు 125లో 600, కుశ్నపల్లిలో సర్వేనంబరు 67లో 400, సీతానగర్‌లోని సర్వేనంబరు 1లో 1425, జంగాల్‌ పేటలోని సర్వేనంబరు 22, 24, 27, 55లలో  600ల ఎకరాల భూములు వివాదంలో ఉన్నాయి.


జైపూర్‌ మం డలం గుత్తేదారిపల్లి శివారులోని సర్వేనంబరు 368, 369-12,లో 200ల ఎకరాలు,  వేమనపల్లి మండలంలోని గోదంపేటలో సర్వేనంబరు 3లో 350 ఎకరాలు, శ్రావనపల్లి శివారులోని 61లో 100 ఎకరాలు,  సూరారం లో 200ల ఎకరాలు, చెన్నూరు మండలం బుద్దారం, సంకారం, గ్రామాలకు ఆనుకొని ఉన్న  సర్వేనంబరు 354లో 800ల ఎకరాలు, మందమర్రి మండలం సారంగ పల్లిలోని 33లో 220 ఎకరాలు, భీమిని మండలం రెబ్బెన శివారులోని సర్వే నంబరు 247లో 250 ఎకరాలు, ఆనం దపూర్‌లోని సర్వే నంబరు 101లో 120 ఎకరాలు, మెట్‌ పల్లిలోని సర్వే నంబరు 20, 22లలో 120 ఎకరాలు, జజ్జరవెల్లి వద్దగల సర్వే నంబరు 88, 89లలో 400ల ఎకరాల భూమి వివాదంలో చిక్కుకుని ఉంది. కోటపల్లి మండలం కొండంపేట, పార్‌పల్లి గ్రామాల్లో దాదాపు 800 ఎకరాల భూములు అటవీ, రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో చిక్కుకొన్నాయి. ఏళ్ల తరబడి వివాదానికి పరిష్కారం లభించక వేల ఎకరాల భూములు నిరుపయోగంగా ఉన్నాయి. 


జాయింట్‌ సర్వేపైనే ఆశ

ఆర్బాటంగా పట్టాలందజేసిన ప్రభుత్వం, ప్రజాప్రతి నిధులు ఆ తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు. కేటాయించిన భూములు ఏ శాఖకు చెందుతాయో నిర్ధారించాల్సిన జాయింట్‌ సర్వే నిర్వహణలో జాప్యం జరిగింది. ప్రభుత్వం పట్టాలిచ్చిన భూమి పొజిషన్‌ (మోఖా) ఎక్కడుందో తెలియకపోవడంతో ఆ నంబరులో ఎక్కడ భూమి ఖాళీ ఉంటే అక్కడ దున్నడం ప్రారం భించారు. సర్వే నంబరు ఆధారంగా ప్రభుత్వ భూమిలో నే రైతులు సాగు చేసుకుంటున్నారు. కొన్నాళ్లు సాగు చేసుకున్నాక ఈ భూములు తమవని అటవీ శాఖ  అడ్డుకుంటోంది. రికార్డుల్లో పీపీ ల్యాండ్‌కే పట్టాలు ఇస్తున్నామని రెవెన్యూ అధికారులు వాదిస్తున్నారు. పట్టాల పేరిట ఫారెస్టు భూములను కబ్జా చేస్తున్నారని అటవీశాఖ వారు పేర్కొంటున్నారు.


అటవీభూములు నిర్ధారించేందుకు చాలా ప్రాంతాల్లో సరైన హద్దులు లేవు. దీంతో రిజర్వు ఫారెస్టు హద్దులేవో తెలియడం లేదు. ప్రభుత్వం రక్షిత అటవీ ప్రాంతాన్ని గుర్తించినపుడు అం దుకు అనుగుణంగా రికార్డుల్లో మార్పులు చేయలేదు. దీంతో మిగులు భూములపై వివాదం కొనసాగుతూనే ఉంది. సంయుక్తంగా భూ సర్వే చేసి రెవెన్యూ, అటవీ భూముల హద్దులు నిర్ణయిస్తే భూ సమస్య పరిష్కారం లభిస్తుంది. దశాబ్దాల కాలంగా నిరుపేదలు ఎదుర్కొం టున్న బాధలు తీరుతాయి. 

Updated Date - 2020-06-05T10:48:41+05:30 IST