Oct 27 2021 @ 12:06PM

బార్సిలోనా ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికైన మలయాళ చిత్రం

ప్రతీ సంవత్సరం ఏదో ఒక మలయాళ చిత్రం అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఎంపికవుతూ.. సత్తా చాటుకుంటోంది. లాక్ డౌన్ టైమ్ లో ఓటీటీలో విడుదలై.. మంచి పేరు తెచ్చుకున్న ‘జోజి’ సినిమా వంతు వచ్చిందిప్పుడు. ఈ సినిమా బార్సిలోనా ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రంగా ఎంపికవడం విశేషం. ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో బాబూరాజ్, ఉన్నిమాయా ప్రసాద్, బెసిల్ జోసెఫ్, షమ్మి తిలకన్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.  ఇంతకు ముందు ఫహద్ హీరోగా నటించిన ‘మహేషిండే ప్రతీకారం’ (తెలుగులో ‘ఉమా మహేశ్వరా ఉగ్రరూపస్య’ గా రీమేక్ అయింది), ఫహద్ కు నేషనల్ అవార్డ్ తెచ్చిపెట్టిన ‘తొండిముదలుమ్ దృక్సాక్షియుమ్’ సినిమాలతో మాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న దిలీష్ పోత్తన్ ఈ సినిమాకి దర్శకుడు. ఈ దర్శకుడి ప్రత్యేకత ఏంటంటే.. ఇప్పటి వరకూ ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలన్నిటీలోనూ ఫహద్ ఫాజిలే హీరో. 



ప్రముఖ షేక్స్పియర్ నాటకం మెక్బెత్ ఆధారంగా ‘జోజి’ సినిమా రూపొందింది.  కేరళలోని ఒక సంపన్నమైన కుటుంబానికి కుట్టప్పన్ యజమాని. ఆయనకి ముగ్గురు కొడుకులు. వారిలో చిన్నవాడు జోజి. తండ్రి అంటే అతడికి భయం. తన ఆస్తిని స్వేచ్ఛగా అనుభవించకుండా చేస్తున్నందుకు జోజికి ఆయనమీద చాలా కోపం ఉంటుంది. దాంతో తండ్రి అడ్డుతొలగించుకొని ఆస్తిలోని తన వాటా చేజిక్కించుకొని విదేశాల్లో సెటిల్ అవ్వాలని జోజీ ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో అతడికి ఎదరైన అనుభవాలేంటి అన్నదే మిగతా కథ. జోజిగా ఫహద్ ఫాజిల్ అద్భుతంగా నటించారు. ఈ సినిమా ఇంకా పలు అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రదర్శించబడింది.