మార్కెట్లో రిటైల్‌ జోష్‌!

ABN , First Publish Date - 2021-07-23T05:49:55+05:30 IST

దేశీయ సెక్యూరిటీస్‌ మార్కెట్లో రిటైల్‌ మదుపరుల పాత్ర అనూహ్యంగా పెరిగిందని క్యాపిటల్‌ మార్కెట్‌

మార్కెట్లో రిటైల్‌ జోష్‌!

  • అనూహ్యంగా పెరిగిన రిటైల్‌ మదుపర్లు జూ క్యూ1లో నెలకు 25 లక్షల కొత్త డీమ్యాట్‌ ఖాతాలు
  • తక్కువ వడ్డీ రేట్లు, అధిక ద్రవ్య లభ్యతే కారణం
  • ఎన్‌ఐఎ్‌సఎం సదస్సులో సెబీ చీఫ్‌ అజయ్‌ త్యాగి  


న్యూఢిల్లీ: దేశీయ సెక్యూరిటీస్‌ మార్కెట్లో రిటైల్‌ మదుపరుల పాత్ర అనూహ్యంగా పెరిగిందని క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి ‘సెబీ’ చైర్మన్‌ అజయ్‌ త్యాగి అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో నెలకు సగటున 24.5 లక్షల చొప్పున కొత్త డీమ్యాట్‌ ఖాతాలు తెరిచినట్లు ఆయన తెలిపారు. కనిష్ఠ స్థాయి వడ్డీ రేట్లు, తగినంత ద్రవ్య లభ్యత వంటి అంశాలు మార్కె ట్లో రిటైల్‌ ఇన్వెస్టర్ల పెరుగుదలకు దోహదపడుతున్నాయని అన్నారు. అయితే, భవిష్యత్‌లో ద్రవ్య లభ్యత తగ్గడం, వడ్డీ రేట్ల పెరుగుదల వంటి అంశాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గురువారం జరిగిన ఎన్‌ఐఎ్‌సఎం ద్వితీయ వార్షిక క్యాపిటల్‌ మార్కెట్‌ సదస్సులో త్యాగి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించిన మరిన్ని విషయాలు.. 




 గత ఆర్థిక సంవత్సరం (2020-21) నుంచే మార్కె ట్లో రిటైల్‌ ఇన్వెస్టర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. 2020 ఏప్రిల్‌ 1 నాటికి దేశంలో 4.1 కోట్ల డీమ్యాట్‌ ఖాతాలుండగా.. 2021 మార్చి 31 నాటికి 5.5 కోట్లకు పెరిగాయి. ఏడాది కాలంలో ఖాతాలు 34.7 శాతం పెరిగాయి. 


 2020-21 ఆర్థిక సంవత్సరంలో నెలకు సరాసరిగా 12 లక్షల కొత్త డీమ్యాట్‌ ఖాతాలు తెరిచారు. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2019-20)లో ఈ సగటు 4.2 లక్షలుగా నమోదైంది. 


 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) ట్రెండ్‌ ఊపందుకుంది. తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌) లో నెలకు 24.5 లక్షల చొప్పున కొత్త డీమ్యాట్‌ ఖాతాలు తెరిచారు.  


 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ క్యాష్‌ మార్కెట్‌ టర్నోవర్‌ రూ.96.6 లక్షల కోట్ల స్థాయిలో నమోదు కాగా.. 2020-21లో 70.2 శాతం వృద్ధి చెంది రూ.164.4 లక్షల కోట్లకు పెరిగింది. ఈ టర్నోవర్‌లో రిటైల్‌ మదుపర్ల వాటా మరో 5 శాతం పెరిగి 51.4 శాతానికి చేరుకుంది. 


 అధిక శాతం సెక్యూరిటీల లావాదేవీలు మొబైళ్లు, ఇంటర్నెట్‌ ద్వారా జరుగుతుండటం రిటైల్‌ ఇన్వెస్టర్ల పాత్ర అనూహ్యంగా పెరిగిందనడానికి స్పష్టమైన సంకేతం. 


 కరోనా సంక్షోభ ఆర్థిక సంవత్సరమైనప్పటికీ 2020-21లో కంపెనీలు క్యాపిటల్‌ మార్కెట్‌ నుంచి రూ.10.12 లక్షల కోట్లు సమీకరించాయి. 2019-20 లో ఈ విలువ రూ.9.96 లక్షల కోట్లుగా ఉంది. 


 పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)లు, రీట్స్‌, ఇన్విటీలు, ఈఎస్‌జీ థీమ్డ్‌ మ్యూచువల్‌ ఫండ్లు, ఈటీఎ్‌ఫల్లో పెట్టుబడులపై రిటైల్‌ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరిగింది. 


 క్యాపిటల్‌ మార్కెట్లో గత ఆర్థిక సంవత్సరంలో ఐపీఓ సందడి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరింత జోరందుకుంది. 


 మార్కెట్లు సమగ్ర అభివృద్ధితో పాటు కొత్త యుగంలోకి అడుగుపెడుతున్నాయి. ఆధునిక టెక్నాలజీ కంపెనీలు సైతం దేశీయ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌కు ఆసక్తి చూపుతున్నాయి. ఈ మధ్య కాలంలో పలు టెక్‌ కంపెనీలు ఐపీఓకు వచ్చేందుకు సెబీకి దరఖాస్తు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. 


 క్యాపిటల్‌ మార్కెట్ల అభివృద్ధితో పాటు మరింత మంది ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు సెబీ పలు చర్యలు చేపట్టింది. 


Updated Date - 2021-07-23T05:49:55+05:30 IST