Afghanistan:జర్నలిస్టులను కొట్టిన తాలిబన్లు...ఫొటో చూస్తే షాక్

ABN , First Publish Date - 2021-09-09T15:56:10+05:30 IST

అప్ఘానిస్థాన్ దేశాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు జర్నలిస్టులను అతి దారుణంగా కొట్టిన ఘటన తాజాగా వెలుగుచూసింది....

Afghanistan:జర్నలిస్టులను కొట్టిన తాలిబన్లు...ఫొటో చూస్తే షాక్

కాబూల్ : అప్ఘానిస్థాన్ దేశాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు జర్నలిస్టులను అతి దారుణంగా కొట్టిన ఘటన తాజాగా వెలుగుచూసింది.కాబూల్ వీధుల్లో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న మహిళలపై తాలిబన్లు గాలిలో కాల్పులు జరిపారు. అనంతరం ఈ నిరసన కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న జర్నలిస్టులను తాలిబన్లు అరెస్ట్ చేశారు. అనంతరం తాలిబన్లు ఇద్దరు అఫ్ఘాన్ జర్నలిస్టులను అతి క్రూరంగా కొట్టారు.‘‘మహిళల నిరసన గురించి రిపోర్ట్ చేసిన అఫ్ఘాన్ జర్నలిస్టులు నెమత్ నఖడి, తాకిదర్యాబిలను తాలిబన్లు దారుణంగా కొట్టారు. వారికి తగిలిన గాయాలను ఫొటోలో చూడండి’’ అంటూ అమెరికన్ జర్నలిస్ట్ మార్కస్ యామ్ ట్వీట్ చేశారు. 


‘‘తాలిబన్లు తమ కెమెరాపర్సన్ వాహిద్ అహ్మదిని అదుపులోకి తీసుకుని అతని కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది జర్నలిస్టులు నిరసన కార్యక్రమాలను చిత్రీకరించకుండా తాలిబన్ దళాలు అడ్డుకున్నాయి.’’అని ఓ వార్తాసంస్థ వెల్లడించింది. కాబూల్‌లో నిరసనకారులు, జర్నలిస్టులను తాలిబన్లు హింసించడంపై మేం తీవ్ర ఆందోళన చెందుతున్నామని మానవ హక్కుల సంఘం అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ట్వీట్ చేసింది. అప్ఘానిస్థాన్ దేశంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటే ముందుగా తాలిబన్ న్యాయమంత్రిత్వశాఖ నుంచి అనుమతి పొందాలని షరతులు పెట్టారు. 


నిరసన కార్యక్రమాలను కవర్ చేస్తున్న జర్నలిస్టులను తాలిబన్లు దారుణంగా కొట్టారు. తాలిబన్ల దాడిలో తీవ్రంగా గాయపడి రక్తం స్రవిస్తున్న జర్నలిస్టుల చిత్రాలు ప్రజలను షాక్ కు గురిచేశాయి.కాబూల్ నగరంలో తాలిబన్ల చేతిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు జర్నలిస్టుల ఫొటో చూస్తే చాలు భవిష్యత్తులో తాలిబన్ల పాలన ఎలా ఉంటుందో అనే భయం ప్రజల్లో ఏర్పడింది.

Updated Date - 2021-09-09T15:56:10+05:30 IST