ఆకలికి వ్యాక్సిన్‌ వేస్తున్నాడు

ABN , First Publish Date - 2021-06-02T05:30:00+05:30 IST

తెల్లవారుజామున అయిదు గంటలకు మొదలవుతుంది అతడి దినచర్య. లేస్తూనే దగ్గర్లోని బస్తీల వైపు పరుగు పెడతాడు. వందల్లో భోజనం ప్యాకెట్లు... అంతే సంఖ్యలో నిత్యావసరాలు...

ఆకలికి వ్యాక్సిన్‌ వేస్తున్నాడు

తెల్లవారుజామున అయిదు గంటలకు మొదలవుతుంది అతడి దినచర్య. లేస్తూనే దగ్గర్లోని బస్తీల వైపు పరుగు పెడతాడు. వందల్లో భోజనం ప్యాకెట్లు... అంతే సంఖ్యలో నిత్యావసరాలు... వెంట తీసుకెళ్లి అక్కడ పంచిపెడతాడు. కరోనా విలయంలో ఉపాధి కోల్పోయిన పేదల కడుపు నింపడమే కాదు... వారి పిల్లలకు చదువు కూడా చెబుతున్న హరియాణా కుర్రాడు నిలయ్‌ అగర్వాల్‌ జర్నీ ఇది... 


‘‘నా ఈ ప్రయాణం కరోనాకు ముందే మొదలైంది. మూడేళ్ల కిందట నా స్నేహితురాలు రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఆమె జ్ఞాపకార్థం సేవ చేయాలనుకున్నాను. ఆ పేరు మీదే 2019లో ‘విశాలాక్షి ఫౌండేషన్‌’ ప్రారంభించాను. ఇప్పుడంటే అంతా కరోనా! కానీ దీనికి ముందే నేను మరో మహమ్మారిని చూశాను. అదే ఆకలి. దిగ్ర్భాంతి కలిగించే విషయమేంటంటే... దేశంలో పోషకాహార లోపం, ఆకలితో రోజుకు 7 వేల మంది చనిపోతున్నారు. వారిలో 3 వేల మంది పిల్లలు. అయితే దీన్ని మహమ్మారి అని ప్రకటించకపోవడమే పెద్ద సమస్య. దీన్ని రూపుమాపడానికి అన్నమనే వ్యాక్సిన్‌ కావాలి. అంతమంది ఆకలి తీర్చాలంటే కష్టమే కావచ్చు. అదే మనమందరం కలిసికట్టుగా కదిలితే..! ఈ ఆలోచనతోనే ముందడుగు వేశాను. స్వచ్ఛంద సంస్థను స్థాపించాను. నేనుండే గురుగ్రామ్‌లోని బస్తీవాసులకు ఆహార పొట్లాలు ఇచ్చాను. అది మొదలు నిరంతరం మా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. 


కొవిడ్‌తో మారిన చిత్రం... 

మా సంస్థ లక్ష్యం... చాలీచాలని సంపాదనతో నెట్టుకొస్తున్న కుటుంబాల ఆకలి తీర్చడం. కానీ గత ఏడాది కరోనాతో లక్ష్యం మారింది. పరిధి పెంచుకోవాల్సి వచ్చింది. అనేకమంది అట్టడుగు వర్గాలవారు ఉపాధి కోల్పోయారు. వలస కూలీల ఆకలి బాధలు రెట్టింపయ్యాయి. ఏంచేయాలి? అప్పటికి మా ఎన్‌జీఓలో దాదాపు వెయ్యి మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. అంతా యువత... విద్యార్థులు, ఉద్యోగస్తులు ఉన్నారు. ఒక్క పిలుపుతో ప్రాణాలకు ముప్పని తెలిసినా వారంతా కదిలారు. అది నాకు కొండంత బలాన్నిచ్చింది. వారి సహకారంతో వలసలకు 25 వేలకు పైగా ఫుడ్‌ ప్యాకెట్లు పంచిపెట్టాం. బస్తీల్లోని కుటుంబాలకూ సాయం అందించాం. 


అది బాధ కలిగించింది...  

కరోనా మళ్లీ విజృంభించింది. తొలి దశలో అనుభవాలతో ఈసారి మరింత మందికి చేరువయ్యేందుకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. ఒక్క గురుగ్రామ్‌లోనే కాకుండా లఖ్‌నవూ, ఢిల్లీ, రాంచీ, నోయిడా, జైపూర్‌, ఫతేపూర్‌ తదితర నగరాల్లోని పేదలకు కూడా వీలైనంత సాయం అందిస్తున్నాం. ఇప్పుడు మా సంస్థ తరుఫున మూడు వేల మంది వలంటీర్లు చురుగ్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. భోజనం ప్యాకెట్లతో పాటు నిత్యావసరాలు, పాల ప్యాకెట్లు కూడా ఇళ్ల వద్దకే తీసుకువెళ్లి ఇస్తున్నాం. మొత్తం కలిపి ఇప్పటి వరకు యాభై వేలకు పైగా కిట్లు పంపిణీ చేసి ఉంటాం.


దీంతోపాటు అత్యవర చికిత్సకు అవసరమైన ప్లాస్మా, ఆక్సిజన్‌, మందులు కూడా ఇస్తున్నాం. అర్ధరాత్రి మెసేజ్‌ పెట్టినా స్పందిస్తున్నాం. ఆకలి తీర్చినందుకు కృతజ్ఞతగా మా తాత వయసుండే వృద్ధులు కొందరు నా కాళ్లకు దండం పెట్టడానికి ప్రయతిస్తుంటారు. అది నాకు ఎంతో బాధ కలిగిస్తుంది. వాళ్ల దుస్థితిని చూసి హృదయం ద్రవిస్తుంది. 


బస్తీ పిల్లలకు బడి... 

ఒక రోజు గురుగ్రామ్‌ దగ్గరి బస్తీలో ఫుడ్‌ ప్యాకెట్లు పంచుతున్నాం. ఆ సమయంలో అక్కడ కొంత మంది పిల్లలు ఆడుకొంటున్నారు. వారిని అడిగితే... తాము బడికి వెళ్లడంలేదని చెప్పారు. లాక్‌డౌన్‌ కనుక ఇంటి పట్టునే ఉన్నారనుకున్నా. కానీ విషయం ఏమిటంటే... అప్పుడే కాదు అసలు ఎప్పుడూ వాళ్లు బడి మొహమే చూడలేదట! అస్సలు నమ్మలేకపోయా. దీంతో గత ఏడాది జూన్‌లో ఆ మురికివాడను దత్తత తీసుకున్నా. దానికి ‘డ్రీమ్‌ స్లమ్‌’ అని పేరు పెట్టాను. అక్కడి చిన్నారుల ప్రతిభను ప్రోత్సహించి, వాళ్ల కలలకు రెక్కలు తొడిగే ప్రాజెక్ట్‌ ఇది. ‘డ్రీమ్‌ స్కూల్‌’ ఒకటి ప్రారంభించాను. కావల్సిన పుస్తకాలు, యూనిఫామ్‌, ఫర్నిచర్‌, టీచర్లు... అన్నీ సమకూర్చాను. కొద్ది నెలల్లోనే మరో మూడు స్కూల్స్‌ తెరిచాను. వాటన్నిటిలో కలిపి 300 మంది పిల్లలు చదువుకొంటున్నారు. లాక్‌డౌన్‌ వల్ల ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాం. మా సేవలన్నీ ఉచితం. 


ఉద్యోగం... సేవా కార్యక్రమం... 

నా దినచర్య ఉదయం ఐదింటికే మొదలవుతుంది. లేవగానే పాల ప్యాకెట్లు తెచ్చి, పంపిణీ చేయాలి. ఆ తరువాత ఉదయం 7.30కి నా ఆఫీస్‌. ‘గ్లోబల్‌ లాజిక్‌’ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం. మధ్యాహ్న భోజన సమయంలో మా స్నేహితుల సాయంతో ఫుడ్‌ ప్యాకెట్లు, రేషన్‌ పంపిణీ జరుగుతుంది. అత్యవసర కాల్స్‌కు సమాధానాలిస్తాను. సాయంత్రం 4.30కి ఇంటికి వెళ్లగానే మళ్లీ ఎన్‌జీఓ పని. నా ప్రధాన లక్ష్యం పేదవారి సాధికారత. నేను పంపిణీ చేసే భోజనం బస్తీవాసులే వండుతారు. ఆ పని చేసినందుకు నేను వారికి కొంత మొత్తం చెల్లిస్తాను. దానివల్ల ఒక వైపు ఉపాధి దొరుకుతుంది. మరోవైపు ఆకలి బాధ తీరుతుంది. 




సముద్రంలో బిందువంత...

నేను చేస్తున్నది సముద్రంలో బిందువంత. సొంత ఇల్లు కావాలనో, కారు కొనుక్కోవాలనో, నగలు పెట్టుకోవాలనో వాళ్లు కలలు కనరు. రోజూ నేను కలిసే పేదలు కోరుకొనేది రెండు పూటలా కడుపు నిండా తిండి... అంతే! దాని కోసమే వారి నిత్య పోరాటం. అలాంటిది ఈ లాక్‌డౌన్ల వల్ల ఆ ప్రజల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నా తాపత్రయం, ప్రయత్నం ఒక్కటే... ఆకలితో ఎవరూ పడుకోకూడదని! 

Updated Date - 2021-06-02T05:30:00+05:30 IST