Abn logo
Aug 4 2021 @ 04:07AM

అప్పుడు విరిగిన స్టిక్‌తో ఆట.. ఇప్పుడు ఒలింపిక్‌ పతక వేట

‘ఛీ..ఛీ.. సిగ్గులేకుండా పొట్టి బట్టలేసుకుని మగరాయుడిలా ఆ తిరుగుడేంటి?’ హాకీ నేర్చుకునే దశలో ఆ చిన్నారికి ఇరుగు పొరుగు నుంచి, బంధువుల నుంచి ఎదురైన ఈసడింపు మాటలివి..

‘మా పిల్లలకు హాకీ ఆడాలని ఉంది. కాస్త నేర్పిస్తావా. వారు కూడా నీ అంత గొప్ప క్రీడాకారిణి కావాలి’.. ఆనాడు సూటిపోటి మాటలతో ఈసడించుకున్న వారే ఇప్పుడు ‘రాణి’లా ఎదిగిన ఆ అమ్మాయిని ప్రాధేయపడుతున్నారు.. భారత మహిళల హాకీ జట్టును తొలిసారి ఒలింపిక్‌ సెమీఫైనల్‌కు చేర్చిన కెప్టెన్‌ రాణీ రాంపాల్‌ గురించే ఇదంతా. 


(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

ప్రస్తుతం అంతా బాగానే కనిపిస్తున్నా రాణీ రాంపాల్‌ ఎదిగి వచ్చిన నేపథ్యం వింటే ఎవరికైనా అద్భుతమే అనిపిస్తుంది. నిరంతరం ఎన్ని సమస్యలు వేధిస్తున్నా.. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్నా తమ లక్ష్యాన్ని చేరుకోవడమెలాగో రాణీ జీవితం చెబుతుంది. ఆమెది కడుపేద కుటుంబం. ఇంట్లో కరెంట్‌ కూడా ఉండేది కాదు. నిద్రపోనీయకుండా ఎల్లప్పుడూ చెవిలో దోమల రొద. ఒకసారి వరదల కారణంగా రెండు పూటలా భోజనం కూడా తినలేని పరిస్థితి. తండ్రి సామాను మోసుకెళ్లే గుర్రపు బండి కార్మికుడు కాగా.. తల్లి పనిమనిషిగా పనిచేసేది. వీరింటికి దగ్గర్లోనే హాకీ అకాడమీ ఉండేది. అక్కడి ఆటగాళ్ల ప్రాక్టీ్‌సను రాణి రోజంతా అక్కడే నిలబడి చూసేది. దీంతో తనకూ హాకీ ఆడాలనే ఆసక్తి పెరిగింది. కానీ తండ్రి రోజువారీ సంపాదనే రూ. 80. ఇక స్టిక్‌ కొనే స్థోమత ఎక్కడిది? అయినా ప్రతి రోజూ అక్కడి కోచ్‌ను ఆట నేర్పాలని ప్రాధేయపడుతుండేది. అతడేమో రాణి వాలకం చూసి బలహీనంగా ఉన్నావంటూ ఈ ఆటకు సరిపోవని ఖరాఖండీగా చెప్పేవాడు. అయినా వదలకుండా అకాడమీలోనే విరిగిన హాకీ స్టిక్‌ ఒకటి తీసుకుని ప్రాక్టీస్‌ మొదలెట్టింది. ఎట్టకేలకు అతి కష్టమ్మీద కోచ్‌ను ఒప్పించింది. ఇక ఇంట్లో చెబితే ఏముంది.. అమ్మాయిలకు ఇలాంటి ఆటలెందుకంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ ‘ఒక్క చాన్సిస్తే నన్ను నేను నిరూపించుకుంటా.. లేకపోతే మీకిష్టమైనట్టుగానే ఉంటా’నంటూ రాణి రంగంలోకి దిగింది. ఇక ప్రాక్టీ్‌సకు తెల్లవారుఝామునే వెళ్లాల్సి వచ్చేది. అటు రాణీ పట్టుదల చూసిన కోచ్‌ హాకీ స్టిక్‌, షూస్‌ కొనివ్వడంతో పాటు అతడి కుటుంబంతోనే ఉండనిచ్చి పోషకాహార భోజనం అందించాడు.తొలిసారిగా రూ.500..

ఓ టోర్నమెంట్‌లో పాల్గొని విజేతగా నిలిచినందుకు రాణీకి రూ.500 లభించాయి. వీటిని తండ్రికివ్వగా అంతకుముందెప్పుడూ అతడు అంత డబ్బు చేతిలో పట్టుకోకపోవడంతో ఉప్పొంగిపోయాడు. ఏదో ఒక రోజు తన కుటుంబానికి చక్కటి ఇల్లు కట్టిస్తానని ఆ రోజే వారికి మాటిచ్చింది. 2017లోనే ఆ ముచ్చటను తీర్చేసింది కూడా.. అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన రాణి 15 ఏళ్ల వయస్సులోనే జాతీయ జట్టుకు ఆడింది. ఇప్పటికీ తన బంధువులు పెళ్లెప్పుడు చేసుకుంటావని అడుగుతుంటారట. కానీ.. ‘నీ మనస్సు కోరుకున్నంత వరకు హాకీ ఆడమంటూ’ తల్లిదండ్రులు పూర్తి మద్దతు ఇవ్వడంతో రాణి కెప్టెన్‌గా ముందుకుసాగుతూ జట్టుకు ఒలింపిక్‌ స్వర్ణం అందించాలనుకుంటోంది. ఓసారి ఇంట్లో ఉన్నప్పుడు రాణీ తండ్రి స్నేహితుడు తన మనువరాలిని తీసుకొచ్చి.. ‘నీవే తనకు ఆదర్శం. తను కూడా హాకీ ప్లేయర్‌ కావాలనుకుంటోంది’ అన్నప్పుడు రాణీ సంతోషంతో పాటు భావోద్వేగంతో కన్నీళ్లను ఆపుకోలేకపోయిందట.