రక్షణ రంగానికి మోదీ ప్రాధాన్యం : జేపీ నడ్డా

ABN , First Publish Date - 2021-08-21T23:46:07+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రక్షణ రంగానికి గొప్ప ప్రాధాన్యం

రక్షణ రంగానికి మోదీ ప్రాధాన్యం : జేపీ నడ్డా

డెహ్రాడూన్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రక్షణ రంగానికి గొప్ప ప్రాధాన్యం ఇస్తున్నారని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా చెప్పారు. బడ్జెట్ కేటాయింపులను పెంచారని, సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని, సైన్యంతో కలిసి దీపావళి ఉత్సవాల్లో పాల్గొంటూ వారి మనోబలాన్ని పరిపుష్టం చేస్తున్నారని చెప్పారు. 


రైవాలాలో మాజీ సైనికులతో జరిగిన కార్యక్రమంలో నడ్డా మాట్లాడుతూ, దీపావళి పండుగను ఇంటి వద్ద జరుపుకోవడానికి అందరూ ప్రాధాన్యమిస్తారని, అయితే మోదీ మాత్రం సరిహద్దుల్లో కానీ, వేరొక చోట కానీ సైనికులతో కలిసి దీపావళి జరుపుకుంటున్నారని చెప్పారు. ఇలా చేయడం ద్వారా మోదీ ప్రజలకు ఓ సందేశాన్ని ఇస్తున్నారని తెలిపారు. సరిహద్దుల్లోని సైనికుల కారణంగానే మిగిలినవారంతా ఇళ్ళ వద్ద దీపావళి జరుపుకోగలుగుతున్నారనే సందేశాన్ని పంపిస్తున్నారన్నారు. సాయుధ దళాల్లో నూతనోత్తేజాన్ని సృష్టించారన్నారు. 


కేంద్ర ప్రభుత్వ పగ్గాలను మోదీ చేపట్టినప్పటి నుంచి రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపులను భారీగా పెంచారని చెప్పారు. 2011-12లో ఈ రంగానికి బడ్జెట్ కేటాయింపులు రూ.1,45,000 కోట్లు కాగా, ప్రస్తుతం ఇది రూ.4,78,000 కోట్లు అని తెలిపారు. 


మనాలీ-లేహ్ సొరంగ మార్గం ప్రపంచంలో చాలా పొడవైనదని, దీనికి అటల్ బిహారీ వాజ్‌పాయి ప్రధాన మంత్రిగా పని చేసిన కాలంలో శంకుస్థాపన చేశారని, ఆ తర్వాత వచ్చిన యూపీయే ప్రభుత్వం పదేళ్ళపాటు దీనిని నిర్మించలేదని చెప్పారు. 9.02 కిలోమీటర్ల పొడవైన ఈ హైవే టన్నెల్‌ను మోదీ పూర్తి చేశారన్నారు. ఇది మనాలీ నుంచి లాహౌల్-స్పీతీ లోయను కలుపుతోందన్నారు. ఈ మార్గం అందుబాటులోకి రాకమునుపు భారీగా మంచు కురవడం వల్ల సంవత్సరంలో ఆరు నెలలపాటు ఈ ప్రాంతానికి వెళ్ళడం సాధ్యమయ్యేది కాదన్నారు. 


Updated Date - 2021-08-21T23:46:07+05:30 IST