May 12 2021 @ 21:56PM

గొడ్డలి పట్టుకొని నా వెంట పడతాడు: ఎన్టీఆర్‌

ఓటీటీలో విడుదల చేసే ఆలోచన లేదు...
ఈ కథను మా పిల్లలకు చెబుతున్నా...
జురాసిక్‌ పార్క్‌ను ఓటీటీలో చూస్తారా?
- ఎన్టీఆర్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ను పాన్‌ ఇండియా సినిమా అనే కంటే భారతీయ సినిమా అనడం నాకు ఇష్టం. పాన్‌ అనే పదం విన్నప్పుడల్లా నాకు ఇంట్లో వంటపాత్ర గుర్తుకొస్తుంది. ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసే ఆలోచనే లేదు. ఇలాంటి విజువల్‌ వండర్‌ను వెండితెరపైనే చూడాలి’’ అంటున్నారు జూనియర్‌ ఎన్టీఆర్‌. కరోనా బారిన పడిన ఆయన   ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. తాజాగా ఆయన ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆ విశేషాలివి...

ఆ ప్రభావం పడలేదు..
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ జర్నీ 2018 నవంబర్‌లో మొదలైంది. జక్కన (రాజమౌళి) పరిపూర్ణత లేకపోతే ఏ పని చేయరు. అందుకే ఆయన చిత్రాలు చాలా సమయం తీసుకుంటాయి.  భారతదేశంలోనే ప్రతిభావంతుడైన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులను అబ్బురపరుస్తాయి. మెజారిటీ షూటింగ్‌ పూర్తయింది. కరోనా వల్ల కథ, సినిమా బడ్జెట్‌పైనా ఎలాంటి ప్రభావం చూపలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కొన్ని నెలలు వాయిదా పడిందంతే! అయినా అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయటానికి ఇంకా అవకాశం ఉంది. అసలు రాజమౌళి ఈ ఇంటర్వ్యూ చదివితే గొడ్డలి పట్టుకొని నా వెంట పడతాడు. ఇందులో ప్రతి యాక్షన్‌ సీక్వెన్స్‌ అద్భుతంగా ఉంటుంది. ‘బాహుబలి’ లాంటి సినిమా అవుతుందని నమ్మకం ఉంది. ఈ సినిమాలో నేనూ, రామ్‌చరణ్‌ కలసి నటించటాన్ని ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తారు. దీనిని పాన్‌ ఇండియా చిత్రం అనే కంటే భారతీయ చిత్రం అనటం నాకు ఇష్టం. పాన్‌ అనప్పుడల్లా ఇంట్లో వంటపాత్ర గుర్తుకొస్తుంది నాకు.


చారిత్రక యోధుడి పాత్ర..
మొదట్లో ఆర్‌ఆర్‌ఆర్‌ అంటే అంతా రాజమౌళి– రామారావు– రామ్‌చరణ్‌ అనుకున్నారు. అది వర్కింగ్‌ టైటిల్‌ మాత్రమే! అయితే, ఆ పేరు బాగా జనాల్లోకి వెళ్లడంతో పేరుతోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’: ‘రౌద్రం, రణం, రుధిరం’ అని అర్థం వచ్చేలా రాజమౌళి టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్రంలో నేను చేసేది ఓ చారిత్రక యోధుడి పాత్ర. ఇలాంటి పాత్ర చేసేటప్పుడు ఒత్తిడి ఉండటం సహజం.  ఈ పాత్రకు తగ్గట్టు మారటానికి 18 నెలల పాటు కఠోర శిక్షణ తీసుకున్నా. ఈ సినిమా కోసం 9 కిలోల బరువు పెరిగాను. నిజమైన హీరోల గురించి దేశవ్యాప్తంగా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఇందులో కొమురం భీమ్‌, అల్లూరి సీతారామరాజు రెండు పాత్రలు చాలా బలమైనవి. వాటిపై చాలా పరిశోధన చేసి యాక్ట్‌ చేశాం. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోల కథను మా పిల్లలకి చెబుతున్నా.
జురాసిక్‌ పార్క్‌ను ఓటీటీలో చూస్తారా?
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఓటీటీలో విడుదల చేేస ఆలోచన ఏమాత్రం లేదు. బాహుబలి, జురాసిక్‌ పార్క్‌, అవేంజర్స్‌ వంటి సినిమాలను ఓటీటీలో చూస్తారా? ఇది కూడా అంతే. కొన్ని విజువల్‌ వండర్స్‌ని థియేర్లలోనే చూడాలి. వెండితెర మీద చూసి ఆస్వాదించే సినిమా ఇది.

పెద్ద టాస్క్‌ మాస్టర్‌...

రాజమౌళితో నాలుగో సినిమా ఇది. 2001లో మేమిద్దరం తొలిసారి కలసి ప్రయాణించాం. అప్పట్లో నాకూ అంత అవగాహన లేదు, ఆయనకూ లేదు. కానీ భారతీయ సినిమాల్లో ఏదో సాధించాలనే పెద్ద ఆలోచనలు ఆయనకు ఉండేవి. ఇప్పటికీ ఆయనలో అదే స్ఫూర్తి. రాజమౌళి పెద్ద టాస్క్‌ మాస్టర్‌. ఆయన ‘బాహుబలి’ రెండు భాగాలను ఐదేళ్లపాటు చెక్కాడు. అందుకే జక్కన పేరును ఆయనకు బిరుదుగా ఇచ్చాను. ‘బాహుబలి’తో దేశంలోని అన్ని మార్కెట్లను తెరిచాడు. తన చిత్రాలతో దేశాన్ని ఒక్కటిగా మార్చాడు. తెలుగు ప్రాంతీయ చిత్రంతో దేశం మొత్తంలోనే కాకుండా చైనా, బ్రిటన్‌, అమెరికాలాంటి విదేశాల్లోనూ ఆదరణ దక్కించుకున్నాడు. ఇలాంటి పెద్ద సినిమాలో భాగమైనందుకే కాదు, రాజమౌళి లాంటి ఆత్మీయుణ్ణి సంపాదించుకున్నందుకు గర్వపడుతున్నా.
దర్శకత్వం ఆలోచన లేదు...
సినిమాల్లో యాక్ట్‌ చేయడమే తప్ప దర్శకత్వం వైపు ఇప్పటి వరకూ ఆలోచించలేదు. మంచి కథ ఉంటే నిర్మాతగా వ్యవహరిస్తా. ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి, భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచంతో పంచుకోనే కంటెంట్‌ను సృష్టించాలనే కోరిక ఉంది.
అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు!
హాలీవుడ్‌లో అవకాశం వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు. నేను కూడా అంతే! ప్రస్తుతం మన సినిమాలతో నేను హ్యాపీగా ఉన్నా. జనతా గ్యారేజ్‌తో నాకు పెద్ద హిట్‌ ఇచ్చిన కొరటాల శివతో తదుపరి చిత్రం చేస్తున్నా. ఆర్‌ఆర్‌ఆర్‌ పూర్తవగానే ఆ సినిమా మొదలు పెడతాం. ప్రస్తుతం స్ర్కిప్టు వర్క్‌ జరుగుతుంది. ఆ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ సినిమా ఉంటుంది.  


ఫ్యూచర్‌ ఎలా ఉంటుందో తెలీదు కదా!
ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ క్రేజ్‌, కరోనా మహమ్మారి బాధలో ఉన్నాం. ఓటీటీ, వెబ్‌ సిరీస్‌లు చేసే ఆలోచన ఇంకా రాలేదు. ఫ్యూచర్‌ ఎలా ఉంటుందో చెప్పలేం కదా? దాని గురించి తర్వాత ఆలోచిద్దాం.
కరోనా అనుభవం...
నా మొదటి సినిమా చేసేటప్పుడు నా వయసు 17 సంవత్సరాలు. అప్పట్నుంచి నేను వర్క్‌హలిక్‌ను. 365 రోజులూ పనిచేయటానికి ఇష్టపడేవాణ్ణి. ఇంటికి పరిమితం కావటం అనేది ఓ ఆప్షన్‌ మాత్రమే. పని విషయంలో కరోనా అనుభవం నన్ను బాగా నిరాశపరిచింది. అయితే ఇంటిపట్టునే ఉండాల్సి రావటంతో కుటుంబంతో గడపటానికి వీలు కుదిరింది. అమ్మా, భార్య, పిల్లలతో గడపడం అనేది ఒక ఎమోషన్‌ అన్నారు.  మొత్తం మీద చూస్తే ఇదొక భావోద్వేగాల కలబోతలా ఉంది.
పరిశ్రమ దెబ్బతింది..
కొవిడ్‌ వల్ల చిత్ర పరిశ్రమ బాగా దెబ్బతింది. చైన్‌ రియాక్షన్‌లా సినిమా ప్రొడక ్షన్‌ నుంచి ప్రదర్శనల దాకా సినీ రంగంలోని అన్ని వ్యవస్థలు కుదేలయ్యాయి. ప్రభుత్వం నుంచి పెద్దగా సాయం అందకపోయినా స్వయంగా నిలదొక్కుకుంది. ఆంక్షలు ఎత్తివేయగానే ప్రేక్షకులు థియేటర్లకు తిరిగి రావటం మాలో నమ్మకాన్ని పెంచింది.