25న జూబ్లీహిల్స్‌ సొసైటీ ఓటర్ల జాబితా

ABN , First Publish Date - 2021-01-18T09:30:06+05:30 IST

హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జూబ్లీహిల్స్‌ కో-ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ ఓటర్ల జాబితాను ఈ నెల 25న ప్రకటించనుంది. అర్హులైన ఓటర్లు తాజా ఫొటోలు, కమ్యూనిటీ వివరాలను తమ కార్యాలయంలో

25న జూబ్లీహిల్స్‌ సొసైటీ ఓటర్ల జాబితా

అర్హులంతా ఫొటోలు, వివరాలివ్వాలి

23లోగా బకాయిలు చెల్లించాలి: సొసైటీ 


హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జూబ్లీహిల్స్‌ కో-ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీ ఓటర్ల జాబితాను ఈ నెల 25న ప్రకటించనుంది. అర్హులైన ఓటర్లు తాజా ఫొటోలు, కమ్యూనిటీ వివరాలను తమ కార్యాలయంలో సమర్పించాలని, ఈ నెల 23లోగా బకాయిలను చెల్లించాలని కోరింది. ఓటర్ల జాబితాను ప్రకటించిన తర్వాత.. సభ్యుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తుది జాబితాను ప్రకటిస్తారు. బకాయిలు చెల్లించని సభ్యుల పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చరు. జాబితాను రూపొందించేందుకు ఐదుగురు డిప్యూటీ రిజిస్ట్రార్లు, 20 మంది అసిస్టెంట్‌ రిజిస్ట్రార్లను నియమించారు. ఒక్కో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ 250 మంది సభ్యుల పత్రాలను పరిశీలించే బాధ్యతను అప్పగించారు. కాగా,  జూబ్లీహిల్స్‌ కో-ఆపరేటివ్‌ హౌస్‌ బిల్డింగ్‌ సొసైటీలో మొత్తం 5250 మంది సభ్యులుండగా.. కేవలం 263 మంది సభ్యులతో కూడిన ఓటర్ల జాబితాను తాత్కాలిక కమిటీ రూపొందించింది.


బకాయిలు చెల్లించని కారణంగా మిగతా వారందరినీ తొలగించినట్లు పేర్కొంది. ఆ జాబితాను కో-ఆపరేటివ్‌ సొసైటీల ఎన్నికల అథారిటీకి గత ఏడాది అక్టోబర్‌లో పంపింది. అధిక సంఖ్యలో సభ్యులను ఓటరు జాబితా నుంచి తొలగించడాన్ని సవాల్‌ చేస్తూ హైకోర్టులో ఏడుగురు సభ్యులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో అర్హులైన సభ్యులతో తాజా జాబితాను కో-ఆపరేటివ్‌ చట్టం-1964 ప్రకారం రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియనంతా కోర్టు ఉత్తర్వులు అందిన నాటి నుంచి రెండు నెలల్లోపు పూర్తి చేయాలని ఈనెల 5న సూచించింది. ఈ నేపథ్యంలోనే ఓటర్ల జాబితాను రూపొందిస్తున్నారు. 

Updated Date - 2021-01-18T09:30:06+05:30 IST