ఆటోతో ఢీకొట్టి జడ్జి దారుణ హత్య

ABN , First Publish Date - 2021-07-30T06:29:21+05:30 IST

మాఫియా హత్య కేసులను విచారిస్తున్న ఓ జిల్లా జడ్జి దారుణ హత్యకు

ఆటోతో ఢీకొట్టి జడ్జి దారుణ హత్య

  • మాఫియా హత్య కేసుల విచారణ..
  • ఝార్ఖండ్‌ ధన్‌బాద్‌లో దారుణం
  • ఉదయం జాగింగ్‌కు వెళ్లినప్పుడు ఘటన
  • తలభాగంలో తీవ్రగాయాలతో ఆస్పత్రిలో మృతి
  • లాయర్ల లేఖతో హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ విచారణ
  • సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన బార్‌ అసోసియేషన్‌
  • హైకోర్టు పరిశీలిస్తోందన్న సీజేఐ జస్టిస్‌ రమణ
  • ఇద్దరు వ్యక్తుల అరెస్టు.. వారిలో ఒకరు ఆటోడ్రైవర్‌


 ధన్‌బాద్‌/రాంచీ, జూలై 29: మాఫియా హత్య కేసులను విచారిస్తున్న ఓ జిల్లా జడ్జి దారుణ హత్యకు గురయ్యారు. ఉద యం జాగింగ్‌కు వెళ్లిన ఆయనను దుండగులు ఆటోతో ఢీకొట్టి హతమార్చారు. ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు దుండగులు చేసిన ప్రయత్నం సీసీ కెమెరా ఫుటేజీతో భగ్నమైంది. ఈ ఘటన జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ నగరంలో చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ సంజీవ్‌కుమార్‌ కథనం ప్రకారం.. ధన్‌బాద్‌ అదనపు సెషన్స్‌ జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు జాగింగ్‌కు వెళ్లారు. వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ ఆటోరిక్షా ఆయనను ఢీ కొట్టింది. రక్తపు మడుగులో ఉన్న ఉత్తమ్‌ ఆనంద్‌ను ఉదయం 5.30 గంటలకు మరో ఆటోరిక్షా డ్రైవర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన తల వెనుక భాగంలో బలమైన గాయాలవడంతో చికిత్స పొం దుతూ ఉదయం 8.30కు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.


పోలీసులు తొలుత రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేశారు. ఉత్తమ్‌ ఆనంద్‌ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆయన భార్య కీర్తి సిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఆటోతో ఉద్దేశపూర్వకంగా ఉత్తమ్‌ ఆనంద్‌ను ఢీ కొట్టినట్లు గుర్తించారు. కీర్తి సిన్హా ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఉత్తమ్‌ ఆనంద్‌ మాఫియా హత్యలకు సంబంధించిన 5 కేసులను విచారిస్తున్నారు. ఇటీవల ఓ హత్యకేసులో యూపీకి చెం దిన ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల బెయిల్‌ను నిరాకరించారు. ఆ మూకలే ఈ హత్యకు పాల్పడి ఉంటాయని జార్ఖండ్‌ హైకోర్టు, ధన్‌బాద్‌ జిల్లా కోర్టు న్యాయవాదులు జార్ఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రవి రంజన్‌కు లేఖ రాశారు. ఆ లేఖను రిట్‌ పిటిషన్‌గా మార్చిన హైకోర్టు సీజే గురువారం విచారణ జరిపారు. సిట్‌ను ఏర్పాటు చేయాలని డీజీపీ నీరజ్‌ సిన్హాను ఆదేశించారు. అదనపు డీజీ సంజయ్‌ లౌట్కర్‌ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ కోర్టుకు చెప్పారు.


 ‘‘సిట్‌ ద్వారా పైపై దర్యాప్తు కుదరదు. ఆటో డ్రైవర్‌ను అరెస్టు చేసి చేతులు దులుపుకొంటే సరిపోదు. కేసు మూలాల్లోకి వెళ్లి తెరవెనుక సూత్రధారుల ముసుగు తొలగించాలి. విచారణ తీరు సరిగ్గా లేకుంటే కేసును సీబీఐకి బదలాయిస్తాం’’ అని జస్టిస్‌ రవి రంజన్‌ హెచ్చరించారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు బార్‌  కౌన్సిల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


‘‘ఘటనను ఉద్దేశపూర్వకంగా వీడియో తీశారు. అది సీసీకెమెరా ఫుటేజీ కాదు. వీడియో తీసిన వాళ్లు పలుమార్లు కెమెరాను జూమ్‌ చేసి చూపించడాన్ని బట్టి ఇది నిర్ధారణ అవుతుంది’’ అన్నారు. ఈ కేసును సుమోటోగా స్వీకరించాలన్న వికాస్‌సింగ్‌ లేఖపై స్పందించిన సీజేఐ జస్టిస్‌ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌ల ధర్మాసనం.. ఈ కేసును జార్ఖండ్‌ హైకోర్టు పర్యవేక్షిస్తోందని తెలిపింది.


‘‘జార్ఖండ్‌ హైకోర్టు సీజేతో మాట్లాడాను. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నా. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కల్పించుకోవడం సరికాదు’’ అని జస్టిస్‌ రమణ అన్నారు. ఈ ఘటనకు ఉపయోగించిన ఆటోరిక్షా డ్రైవర్‌ లఖన్‌ కుమార్‌ వర్మ, అతని మిత్రుడు రాహుల్‌ వర్మను పోలీసులు అరెస్టు చేశారు. తమ ఆటోరిక్షా కొన్ని గంటల క్రితమే చోరీకి గురైందని వాళ్లు తొలుత బుకాయించారు. అయితే, లాటరీలో రూ.80 వేలు వచ్చాయని లఖన్‌ చెప్పాడని, ఆ డబ్బుతోనే రెండు రోజుల క్రితం ఆటోరిక్షా, మొబైల్‌ఫోన్‌ కొన్నాడని అతడి భార్య పోలీసులకు తెలిపింది. లఖన్‌కు ఆ డబ్బు ఎవరిచ్చారు? ఉత్తమ్‌ ఆనంద్‌ హత్యకు ఎన్ని రోజులుగా రెక్కీ వేశారు? అసలు సూత్రధారులు ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Updated Date - 2021-07-30T06:29:21+05:30 IST