మొద్దుశీను హత్యకేసు రిపోర్టును.. జస్టిస్‌ ఈశ్వరయ్య గల్లంతు చేశారు!

ABN , First Publish Date - 2020-08-11T09:16:06+05:30 IST

మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దు శీను హత్యకు గురైన కేసులో జస్టిస్‌ ఈశ్వరయ్య పాత్రపై సీబీఐతో విచారణ జరగాలని దళిత జడ్జి

మొద్దుశీను హత్యకేసు రిపోర్టును.. జస్టిస్‌ ఈశ్వరయ్య గల్లంతు చేశారు!

  • ఆయనపై సీబీఐ విచారణ జరపాలి.. హైకోర్టును ఆశ్రయిస్తా..
  • ఏబీఎన్‌ డిబేట్‌లో జడ్జి రామకృష్ణ డిమాండ్‌ 


తిరుపతి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దు శీను హత్యకు గురైన కేసులో జస్టిస్‌ ఈశ్వరయ్య పాత్రపై సీబీఐతో విచారణ జరగాలని దళిత జడ్జి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. జస్టిస్‌ ఈశ్వరయ్య వ్యవహారంపై సోమవారం ఏబీఎన్‌ చానెల్‌ నిర్వహించిన డిబేట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్‌ ఈశ్వరయ్యపై పలు సంచలన ఆరోపణలు చేశారు. ‘‘పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న జూలకంటి శ్రీనివాసులురెడ్డి అలియాస్‌ మొద్దు శీను అనంతపురం జైలులో హత్యకు గురైన సమయంలో నేను అక్కడ మేజిస్ట్రేట్‌గా పని చేస్తున్నాను. కస్టోడియల్‌ మరణం సంభవించినప్పుడు స్థానిక మేజిస్ర్టేట్‌ ప్రథమంగా విచారణ జరిపి కోర్టుకు నివేదిక అందజేయాలి. దాని ప్రకారమే నేను విచారణ జరిపాను. నేను ప్రత్యక్షంగా పరిశీలించిన మేరకు మొద్దు శీనును జైలు బ్యారక్‌ వెలుపలే హత్యచేసి మృతదేహాన్ని బ్యారక్‌లోకి లాక్కొచ్చి పడేశారు. ఇలా బ్యారక్‌లోకి లాగినప్పుడు నేలపై ఏర్పడిన రక్తపు మరకలను కూడా నేను చూశాను. ఆ విషయాన్ని నా రిపోర్టులో పేర్కొన్నాను.


అయితే ఏదో కార్యక్రమంలో పాల్గొనేందుకు అనంతపురం వచ్చిన జస్టిస్‌ ఈశ్వరయ్య.. ఒక రోజంతా బీసీ సామాజికవర్గానికి చెందిన అప్పటి జిల్లా జడ్జితో సుదీర్ఘ సంభాషణలు సాగించారు. ఆ తర్వాత నేనిచ్చిన రిపోర్టు మాయమైంది. కోర్టు రికార్డుల్లో అది నమోదు కాలేదు. ఇప్పుడు జస్టిస్‌ ఈశ్వరయ్య మాటలను వింటుంటే అప్పట్లో అనంతపురం జిల్లా జడ్జితో జస్టిస్‌ ఈశ్వరయ్య సాగించింది పవిత్రమైన సంభాషణ కాదు.. అపవిత్ర సంభాషణ అని అనుమానం వస్తోంది. మొద్దు శీను హత్య కేసును అణచిపెట్టడానికి నాడు కుట్ర జరిగిందన్న అనుమానం ఈరోజు వస్తోంది. దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉంది. దీనిపై నేను హైకోర్టుకు వెళతాను. ఇటీవలే కరోనాతో చనిపోయిన మొద్దు శీను హత్య కేసు నిందితుడు ఓం ప్రకాశ్‌ను అప్పట్లో అరెస్టు చేసినప్పుడు నా ఎదుటే హాజరుపరిచారు.


ఈ హత్యతో తనకు సంబంధం లేదని, తనను బలిపశువును చేస్తున్నారని కోర్టులో అతడు కేకలు వేసి మరీ చెప్పాడు. ఇవన్నీ ఆలోచిస్తుంటే మొద్దుశీను హత్య తర్వాత జస్టిస్‌ ఈశ్వరయ్య అనంతపురం ఎందుకు విజిట్‌ చేశారనేది ఇప్పుడు అర్థమవుతోంది. ఒక రోజంతా ఆయన అనంతపురంలోనే ఉండి నాటకాన్ని ఆడించారు. జిల్లా జడ్జిగా ఉన్న తన కులం వ్యక్తి ద్వారా నేనిచ్చిన రిపోర్టును గల్లంతు చేయించారు. ఆ రిపోర్టు ఇచ్చిన 15 రోజులకే నన్ను బదిలీ చేశారు. వీటన్నింటిపైనా సీబీఐతో విచారణ జరిపించాలి’’ అని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. పెద్దనోట్ల రద్దు సమయంలో రూ.60 లక్షలతో ఢిల్లీలో పట్టుబడిన వ్యక్తి... జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డికి సంబంధించిన మనిషని రామకృష్ణ ఆరోపించారు. దీనిపైనా సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. 

Updated Date - 2020-08-11T09:16:06+05:30 IST