అమెజాన్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌...

ABN , First Publish Date - 2021-07-30T03:14:40+05:30 IST

రిలయన్స్ రిటైల్-ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందంపై అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్ పైన తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్‌లో పెట్టింది.

అమెజాన్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌...

న్యూఢిల్లీ : రిలయన్స్ రిటైల్-ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందంపై అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్ పైన తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్‌లో పెట్టింది. ఫ్యూచర్-రిలయన్స్ ఒప్పందంపై ముందుకు వెళ్లవచ్చునని ఇటీవల ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ అమెజాన్ సుప్రీం కోర్టునాశ్రయించింది. ఫ్యూచర్-రిలయన్స్ రిటైల్ ఒప్పందాన్ని నిలిపివేయడంతోపాటు,  సింగపూర్‌కు చెందిన ఎమర్జెన్సీ ఆర్బిటరేటర్ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని అమెజాన్ తన పిటిషన్‌లో అభ్యర్ధించింది.


కాగా ఈ కేసులో న్యాయస్థానం తన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఫ్యూచర్ గ్రూపునకు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ నిరుడు ఒప్పందాన్ని  కుదుర్చుకుంది. దీని విలువ రూ. 24,713 కోట్లు. కాగా... ఫ్యూచర్ గ్రూపునకు చెందిన ఫ్యూచర్ కూపన్స్ లిమిటెడ్‌లో అమెజాన్ 2019 లో 49 % మేర పెట్టుబడులు పెట్టింది. ఫ్యూచర్ కూపన్స్‌కు 7.3 % శాతం మేర ఫ్యూచర్ రిటైల్‌లో వాటా ఉంది. దీంతో 3-10 ఏళ్ల లోపు ఫ్యూచర్ రిటైల్‌ను కొనుగోలు చేసే హక్కు అమెజాన్‌కు ఉంటుంది. 


అయితే, రిలయన్స్‌-ఫ్యూచర్‌ మధ్య కుదిరిన ఒప్పందం ఈ నిబంధనను ఉల్లంఘిస్తోందని అమెజాన్ వాదిస్తోంది. ఈ క్రమంలో...  అమెజాన్... సింగపూర్ ఆర్బిట్రేటరీ కోర్టునాశ్రయించింది. ఈ క్రమంలో... రిలయన్స్‌తో ఒప్పందంపై స్టే ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు ఢిల్లీ హైకోర్టులోని సింగిల్ బెంచ్ ధర్మాసనం కూడా అమెజాన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-07-30T03:14:40+05:30 IST