జడ్జిలకు శిక్షణ అవసరం : సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2021-03-18T22:51:29+05:30 IST

కేసుల విచారణలో న్యాయమూర్తులు మూస పద్ధతులను

జడ్జిలకు శిక్షణ అవసరం : సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : కేసుల విచారణలో న్యాయమూర్తులు మూస పద్ధతులను మానుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. న్యాయమూర్తులను చైతన్యపరచేందుకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపింది. నిందితుడు బెయిలు పొందాలంటే బాధితురాలి చేత రాఖీ కట్టించుకోవాలని మధ్య ప్రదేశ్ హైకోర్టు విధించిన షరతును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. 


లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొంటున్న నిందితుడి బెయిలు పిటిషన్‌పై మధ్య ప్రదేశ్ హైకోర్టు విచారణ జరిపింది.  గత ఏడాది జూలైలో జారీ చేసిన ఆదేశాల్లో, నిందితుడు బెయిలు పొందడం కోసం  బాధితురాలి చేత రాఖీ కట్టించుకోవాలని షరతు విధించింది. ఈ ఆదేశాలను అడ్వకేట్ అపర్ణ భట్, మరొక ఎనిమిది మంది మహిళా న్యాయవాదులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఏఎం ఖన్విల్కర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. న్యాయమూర్తులను చైతన్యపరచేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపింది. న్యాయమూర్తులు మూస పద్ధతిని అవలంబించడం మానుకోవాలని తెలిపింది. మధ్య ప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. 


బెయిలు మంజూరు కోసం హైకోర్టు విధించిన షరతును అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కూడా వ్యతిరేకించారు. పిటిషనర్లు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ, బెయిలు కోసం హైకోర్టు విధించిన షరతు బాధితురాలు అనుభవించిన బాధను చులకన చేయడమేనని ఆరోపించారు. రక్షా బంధన్‌ను అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ళు సంరక్షణ భావంతో జరుపుకునే పండుగ అని వివరించారు. హైకోర్టు వంటి రాజ్యాంగ న్యాయస్థానాలు ఇటువంటి ఆదేశాలను ఇవ్వడం వల్ల ఓ నేరాన్ని సాధారణీకరించడానికి దారి తీస్తుందని ఆరోపించారు. 


Updated Date - 2021-03-18T22:51:29+05:30 IST