గ్రూప్‌-1 పరీక్షపై తీర్పు వాయిదా

ABN , First Publish Date - 2021-09-15T08:45:26+05:30 IST

గ్రూప్‌-1 పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి.

గ్రూప్‌-1 పరీక్షపై తీర్పు వాయిదా

హైకోర్టులో ముగిసిన వాదనలు

అమరావతి, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. దీంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులు మంగళవారం ప్రకటించారు. గ్రూప్‌-1 ప్రధాన పరీక్ష జవాబుపత్రాలను డిజిటల్‌ విధానంలో ఏపీపీఎస్సీ దిద్దించడాన్ని సవాల్‌ చేస్తూ వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలైన సంగతి తెలిసిందే. ప్రధాన పరీక్ష నిర్వహణలో అక్రమాలు జరిగాయని..దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని.. ప్రధాన పరీక్షను తిరిగి నిర్వహించేలా ఏపీపీఎస్సీకి ఉత్తర్వులివ్వాలని పిటిషనర్లు కోరారు. ఈ వ్యాజ్యాలను విచారించిన సింగిల్‌ జడ్జి గ్రూప్‌-1 ఇంటర్వ్యూలకు ఒక రోజు ముందు ఇంటర్వ్యూలతో పాటు తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేయాలని ఈ ఏడాది జూన్‌ 16న మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు.


వ్యాజ్యాలపై తుది విచారణ జరపాలని పిటిషనర్లు, ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు, ఏపీపీఎస్సీ కోరడంతో న్యాయమూర్తి ఇటీవల తుది విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు బి.ఆదినారాయణరావు, ఎం.విద్యాసాగర్‌, న్యాయవాదులు జె.సుధీర్‌, ఎం.విజయ్‌కుమార్‌, జి.శివ వాదనలు వినిపించారు. మంగళవారం జరిగిన విచారణలో పిటిషనర్ల తరఫున న్యాయవాది తాండవ యోగేశ్‌ రిప్లై వాదనలు వినిపించారు. గ్రూప్‌-1 పరీక్ష నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకున్నాయని.. చైర్మన్‌ పాత్ర లేకుండా తప్పించి.. ఏపీపీఎస్సీ కార్యదర్శి పర్యవేక్షణలో పరీక్ష నిర్వహించారన్నారు. ‘ఽథర్డ్‌ పార్టీ ద్వారా జవాబు పత్రాలను డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం చేయించారు. మార్కులను జవాబు పత్రాలపై కాకుండా ఎక్సెల్‌ షీట్‌లో ఇవ్వడం వల్ల మార్కులు తారుమారు చేసే అవకాశం ఉంది. వాస్తవాలు బయటకు రావాలంటే ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలి’ అని కోరారు. ఇరు పక్షాల వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు.

Updated Date - 2021-09-15T08:45:26+05:30 IST