‘పరిషత్‌’ ఫలితాల తీర్పు మళ్లీ వాయిదా!

ABN , First Publish Date - 2021-07-29T05:03:27+05:30 IST

పరిషత్‌ ఎన్నికల ఫలితాల తీర్పు మరోసారి వాయిదా పడింది. ఆగస్టు 4న తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ బుధవారం ప్రకటించింది. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

‘పరిషత్‌’ ఫలితాల తీర్పు మళ్లీ వాయిదా!

- ఆగస్టు 4న ప్రకటిస్తామన్న హైకోర్టు డివిజన్‌ బెంచ్‌

- అభ్యర్థుల్లో నైరాశ్యం

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

పరిషత్‌ ఎన్నికల ఫలితాల తీర్పు మరోసారి వాయిదా పడింది. ఆగస్టు 4న తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ బుధవారం  ప్రకటించింది. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. జిల్లాలో 667 ఎంపీటీసీ స్థానాలు, 38 జడ్పీటీసీ స్థానాలకు గాను గత మార్చి 8న పోలింగ్‌ నిర్వహించారు. అదే నెల 10న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఎస్‌ఈసీ నీలం సాహ్ని అప్పట్లో ప్రకటించారు. ఈ ఎన్నికల నిర్వహణలో   సుప్రీం కోర్టు మార్గదర్శకాలను ఎస్‌ఈసీ పాటించలేదంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పరిషత్‌  ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌బెంచ్‌ అప్పట్లో తీర్పు ఇచ్చింది. దీనిపై ఎస్‌ఈసీ.. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. డివిజన్‌ బెంచ్‌లో వాదనలు ప్రతి వాదనలు కూడా ముగిశాయి. కరోనా రెండోదశ ఉధృతి కారణంగా తీర్పు ప్రకటన వాయిదా పడింది. నాటి నుంచి తీర్పు ఎప్పుడు వెల్లడిస్తారా? అని అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ప్రకటించాల్సిన తీర్పు మళ్లీ వాయిదా పడడంతో అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి చెందారు. పోలింగ్‌ పూర్తయినా ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడిపై ప్రతిష్టంభన కొనసాగుతుండడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. మరోపక్క పరిషత్‌ ఫలితాల జాప్యంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారుల పాలనను కొనసాగిస్తోంది. ప్రస్తుతం వర్షాకాలంలో బ్యాలెట్‌ పెట్టెలు తడవకుండా భద్రంగా ఉంచడం అధికారులకు సమస్యగా మారింది.

Updated Date - 2021-07-29T05:03:27+05:30 IST