‘చొరబాటు’పై తీర్పు నేడే!

ABN , First Publish Date - 2021-04-01T07:36:39+05:30 IST

అసోం అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. తొలిదశలో 46 స్థానాల్లో ఓటింగ్‌ పూర్తవగా మరో 39

‘చొరబాటు’పై తీర్పు నేడే!

అసోం రెండోదశ పోలింగ్‌కు సర్వం సిద్ధం

బంగ్లా సరిహద్దు జిల్లాల్లో నేడు ఓటింగ్‌

డిస్పూర్‌, మార్చి 31: అసోం అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. తొలిదశలో 46 స్థానాల్లో ఓటింగ్‌ పూర్తవగా మరో 39 సీట్లలో ఐదుగురు మంత్రులు, డిప్యూటీ స్పీకర్‌, కొందరు విపక్ష ప్రముఖులు సహా అభ్యర్థుల భవితవ్యం గురువారం సాయంత్రానికల్లా నిక్షిప్తమైపోతుంది. ముఖ్యంగా ఎన్నికల ప్రచారాంశాల్లో ఒకటైన ‘చొరబాటుదారుల’ అంశంపై అసోం వాసులు తమ తీర్పును వెలువరిస్తారు. బంగ్లాదేశ్‌ సరిహద్దులను ఆనుకుని ఉన్న కరీంగంజ్‌, కచార్‌ జిల్లాల్లో జరిగే ఎన్నికల్లో ఈ అంశమే నిర్ణయాత్మకం.


2016లో బరాక్‌ వ్యాలీలో ఉన్న 18 సీట్లలో 11 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈసారి పరిస్థితి అంత ఈజీగా కనిపించడం లేదు. పౌరసత్వ సవరణ చట్టంపై ఎగసిన అసంతృప్తి జ్వాలలు బీజేపీని చుట్టుముట్టాయి. భాగస్వామ్య పక్షాలైన ఏజీపీ, యునైటెడ్‌ పీపుల్స్‌ పార్టీ లిబరల్‌తో కాషాయసేనకు అంతగా పొసగడం లేదు. అధికారంలోకొస్తే సీఏఏను అమలు చేయనివ్వబోమని ప్రకటించిన కాంగ్రెస్‌ సారథ్య మహాకూటమి గట్టి సవాల్‌ విసురుతోంది.


కొత్తగా ఏర్పడ్డ ఏజేపీ 19 సీట్లలో అభ్యర్థులను దింపింది. 25 నియోజకవర్గాల్లో ఎన్‌డీఏ, మహాకూటమి మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. అధికారంలోకొస్తే చొరబాటుదారులను ఏరిపారేస్తామని కేంద్ర మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. మోదీ అబద్ధాల కోరని రాహుల్‌ఽ ధ్వజమెత్తారు. ‘మీరు నిజాలు వినాలనుకుంటే నా మాటలు వినండి. అబద్ధాలు వినాలనుకుంటే టీవీ ఆన్‌ చేయండి. మోదీ 24-7 అబద్ధాలు వినవచ్చు’ అని కామరూప్‌, నల్బడీ జిల్లాల్లోని బార్‌ఖేత్రి సభల్లో అన్నారు.


Updated Date - 2021-04-01T07:36:39+05:30 IST