రాజు మృతిపై న్యాయ విచారణ

ABN , First Publish Date - 2021-09-18T08:43:30+05:30 IST

సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటనలో నిందితుడు పల్లకొండ రాజు మృతిపై హైకోర్టు న్యాయ విచారణకు ఆదేశించింది.

రాజు మృతిపై న్యాయ విచారణ

  • 4 వారాల్లో నివేదిక ఇవ్వండి
  • వరంగల్‌ 3వ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌కు హైకోర్టు ఆదేశం
  • అనుమానాస్పద మృతిలా కనిపిస్తోందని వ్యాఖ్య
  • ముమ్మాటికీ ఆత్మహత్యే: ఏజీ


హైదరాబాద్‌, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటనలో నిందితుడు పల్లకొండ రాజు మృతిపై హైకోర్టు న్యాయ విచారణకు ఆదేశించింది. రాజుది అనుమానాస్పద మృతిలా కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఘటనపై నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేసి ని వేదికను సీల్డ్‌ కవర్‌లో హైకోర్టు జ్యుడీషియల్‌ రిజిస్ర్టార్‌కు సమర్పించాలని వరంగల్‌ 3వ మెట్రోపాలిటిన్‌ మేజిస్ర్టేట్‌కు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు రికార్డు చేసి న ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్ల వీడియోలు, పోస్ట్‌మార్టం వీడియోలను వరంగల్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తికి శ నివారం రాత్రి 8 గంటలలోగా సమర్పించాలని రాష్ట్ర ప్ర భుత్వానికి నిర్దేశించింది.


రాజుది కస్టోడియల్‌ డెత్‌ అని, దీనిపై న్యాయ విచారణకు ఆదేశించాలని కోరుతూ పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్‌ గడ్డం లక్ష్మణ్‌ హైకోర్టులో శుక్రవారం లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని అత్యవసరంగా విచారణ చేపట్టేందుకు హైకోర్టు అనుమతించింది.


మధ్యాహ్నం 2.30 గంటలకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు, జస్టిస్‌ అమర్‌నాథ్‌ గౌడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ లక్ష్మణ్‌ తరఫున న్యాయవాది వెంకన్న వాదనలు వినిపించారు. రాజును ప్రభుత్వమే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందని, మంత్రులే రెచ్చగొట్టి అతడిని హత్య చేయించారని ఆరోపించారు. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తోందని, ప్రజా పాలన కాదని ఆరోపించారు. రాజు కుటుంబ సభ్యులను ఐదు రోజులపాటు అదుపులోకి తీ సుకుని దారుణంగా వేధించారని, వారిని అన్ని రకాలుగా ప్రలోభ పెట్టేందుకు యత్నించారని తెలిపారు. రాజు కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇచ్చేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. 


ఏడుగురు ప్రత్యక్ష సాక్షులున్నారు..

ఇంకేం కావాలి?: ఏజీ బీఎస్‌ ప్రసాద్‌

నిందితుడు రాజుది ముమ్మాటికీ ఆత్మహత్యనేనని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ ఉద్ఘాటించారు. కేవలం అపనమ్మకాలు, ఆందోళనలను ఆధారంగా చేసుకుని పిటిషన్‌ దాఖలు చేశారని, దానిని కొట్టేయాలని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ‘‘రాజు ఆత్మహత్య చేసుకున్నప్పు డు ఏడుగురు ప్రత్యక్ష సాక్షులు చూశారు. వారిలో ఇద్దరు కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ డ్రైవర్లు కూడా ఉన్నారు. వారే స్వయంగా వాకీటాకీల ద్వారా సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన పోలీసులు డ్రైవర్లు సహా ఏడుగు రు సాక్షుల స్టేట్‌మెంట్లను వీడియోల్లో రికార్డు చేశారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌, పోస్ట్‌మార్టం వీడియో చిత్రీకరణ కూడా చేశారు’’ అని వివరించారు. అది ప్రభుత్వ హత్య అనేందుకు పిటిషనర్‌ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు.


ఇంత వేగంగా అంత్యక్రియలా?

రాజు మృతదేహానికి అంత వేగంగా అంత్యక్రియలు పూర్తి చేయడంపై హై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ‘‘ఈ విషయంలో పోలీసులు వేగంగా పని పూర్తి చేశారు. వెరీ గుడ్‌’’ అని ధర్మాసనం నర్మగర్భంగా వ్యాఖ్యానించింది. దాంతో, మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని, వారే అంత్యక్రియలు చేశారని ఏజీ ప్రసాద్‌ తెలిపారు. ‘‘దిశ కేసులో కూడా మీరు హాజరయ్యారు. అక్కడ నలుగురు ఎన్‌కౌంటర్‌ అయ్యారు. అక్కడ కూడా ఏం చేశారో చూశాం. రాజుది ఆత్మహత్యలా కనిపిస్తున్నా.. అది అనుమానాస్ప ద మరణం. పిటిషనర్‌వి కేవలం ఆరోపణలే అని భావించినా.. అవి నిజం కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది’’ అని ఏజీని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే పిటిషనర్‌ కోరిన విధంగా సీఆర్పీసీ సెక్షన్‌ 176(1) (ఏ) ప్రకారం న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభు త్వం, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్నవారు, బంధువులు, ప్రతివాదులు, ఆసక్తి ఉన్న ఇతరులెవరైనా వరంగల్‌ 3వ ఎంఎం మేజిస్ట్రేట్‌ వద్ద జరిగే విచారణకు హాజరై తమ వద్ద ఉన్న ఆధారాలు సమర్పించవచ్చని తెలిపింది.


అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు

ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం రికార్డు చేశాం: డీజీపీ మహేందర్‌రెడ్డి

ఆరేళ్ల బాలిక హత్యాచారం కేసులో నిందితుడు పల్లకొండ రాజు మృతి విషయంలో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఎవరికీ లే దని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహాలకు తావు లేదన్నారు. రాజు మృతిపై వస్తున్న ఆరోపణల పట్ల డీజీ పీ స్పందించారు. గురువారం ఉదయం 9.05 గంటల సమయంలో కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ హైదరాబాద్‌ వస్తున్న సమయంలో ఓ వ్యక్తి రైలు ముందుకువచ్చి పడడాన్ని ఇద్దరు లోకో పైలెట్లు ప్రత్యక్షంగా చూశారన్నారు. తర్వాత వచ్చిన స్టేషన్‌ ఘన్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో విషయాన్ని స్టేషన్‌ మాస్టర్‌కు తెలియజేశారని చెప్పారు. హైదరాబాద్‌ చేరాక వారి ఇన్ఫర్మేషన్‌ సిస్టం లో దాన్ని నమోదు చేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారని డీజీపీ వివరించారు. లోకో పైలట్లతో పాటు అక్కడ పనిచేస్తున్న రైతులు ఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని చెప్పారు. ఇద్దరు లోకో పైలట్లు, గ్యాంగ్‌మన్‌, రైతులు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని డీజీపీ వివరించారు. ఏడుగురు ప్రత్యక్ష సాక్షులు వాంగ్మూలం ఇచ్చారని, దానిని వీడియో రికార్డు చేశామని వెల్లడించారు.

Updated Date - 2021-09-18T08:43:30+05:30 IST