జూలై వ్యాక్సినేషన్‌ లక్ష్యం గగనమే!?

ABN , First Publish Date - 2021-07-27T06:57:32+05:30 IST

భారత్‌ నిర్వహిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి

జూలై వ్యాక్సినేషన్‌ లక్ష్యం గగనమే!?

  • వేగం పుంజుకోని ‘కొవాగ్జిన్‌’ ఉత్పత్తి
  • కేంద్ర ప్రభుత్వ ఆశలన్నీ ఆగస్టుపైనే 
  • వచ్చే నెలలో 12 కోట్ల కొవిషీల్డ్‌ డోసుల ఉత్పత్తి ? 


న్యూఢిల్లీ, జూలై 26 : భారత్‌ నిర్వహిస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి టీకాల కొరత ప్రధాన సవాల్‌గా మారింది. జూలై నెలాఖరుకల్లా 50 కోట్ల టీకా డోసులతో వ్యాక్సినేషన్‌ చేయాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకునే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటిదాకా ప్రజలకు 43.51 కోట్ల డోసులను వేయగా, ఈనెలలో మిగిలిన నాలుగైదు రోజుల్లో మిగతా 7 కోట్ల డోసుల వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని ఛేదించడం దాదాపు అసాధ్యమేనని పరిశీలకులు అంటున్నారు.


ఈ పరిస్థితికి దారితీసిన ప్రధాన కారణాల్లో.. భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకాల ఉత్పత్తి వేగవంతంగా జరగకపోవడం, రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి టీకాల విడుదల, పంపిణీలో జాప్యం అనేవి ఉన్నాయని చెబుతున్నారు. అమెరికా విరాళంగా అందించనున్న మోడెర్నా, ఫైజర్‌ టీకాల దిగుమతికి న్యాయపరమైన అవాంతరాలు ఎదురవుతున్నాయని, ఒకవేళ ఆ డోసులు భారత్‌కు అంది ఉంటే జూలై నెల వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని చేరుకోవడం సులువై ఉండేదని వైద్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

'

మరోవైపు కొవిషీల్డ్‌ టీకాను ఉత్పత్తి చేసే సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) గత మూడు నెలల్లో టీకా ఉత్పత్తిని రెట్టింపు చేసింది. ఇప్పటిదాకా దేశంలో వ్యాక్సినేషన్‌ చేసిన డోసుల్లో దాదాపు 88 శాతం ఆ టీకావే కావడం గమనార్హం. జూన్‌ నెలలో 10 కోట్ల కొవిషీల్డ్‌ డోసులను ఉత్పత్తి చేసిన ‘సీరం’.. ఆగస్టులో దీన్ని 12 కోట్ల డోసులకు పెంచుతుందనే ఆశాభావంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, దేశంలో కొత్తగా 39,361 కరోనా కేసులు నిర్ధారణ కాగా, 416 మంది మరణించారు. యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,11,189కి చేరింది.  



సెప్టెంబరు నెలాఖరుకల్లా ‘కొర్బెవ్యాక్స్‌’ ! ? 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌) : బయొలాజికల్‌-ఈ కంపెనీ అభివృద్ధి చేసిన కొవిడ్‌ టీకా ‘కొర్బెవ్యాక్స్‌’కు సెప్టెంబరు చివరికల్లా అత్యవసర వినియోగ అనుమతులు లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం దీనితో మూడో దశ ప్రయోగ పరీక్షలు జరుగుతున్నాయి. ఆగస్టు 21  నాటికి అత్యవసర అనుమతుల కోసం కంపెనీ దరఖాస్తు చేసుకోనుంది. దానికి ఆమోదం లభించిన వెంటనే డిసెంబరు నెలాఖరుకల్లా కేంద్ర ప్రభుత్వానికి 30 కోట్ల టీకా డోసులను సరఫరా చేయాలని భావిస్తోంది. 




కరోనా సోకిన బాలింతలూ.. 

పిల్లలకు పాలు ఇవ్వొచ్చు 

కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిన బాలింతలు పిల్లలకు పాలు ఇవ్వొచ్చని న్యూఢిల్లీలోని లేడీ హార్డింగ్‌ వైద్య కళాశాల ఆబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్‌ మంజుపురి పేర్కొన్నారు. అయితే మిగితా సమయాల్లో శిశువుకు కనీసం 6 అడుగుల భౌతిక దూరంతో మెలగడం శ్రేయస్కరమని సూచించారు. 


Updated Date - 2021-07-27T06:57:32+05:30 IST