ఈ ఇద్దరి మధ్యే పోటీ.. ఏం జరుగునో..?

ABN , First Publish Date - 2021-06-22T08:56:48+05:30 IST

టీపీసీసీలో ఈసారి అన్ని జిల్లాలు, ప్రాంతాలు, కులాలకూ ప్రాతినిఽధ్యం కల్పించనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఇద్దరి మధ్యే పోటీ.. ఏం జరుగునో..?

  • అన్ని ప్రాంతాలు, కులాలకు ప్రాతినిధ్యం
  • చీఫ్‌గా రేవంత్‌, కోమటిరెడ్డి మధ్యే పోటీ..! 
  • వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొండా సురేఖ?
  • దామోదర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్‌, 
  • జగ్గారెడ్డికి ప్రాధాన్యం కలిగిన పదవులు!


హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీలో ఈసారి అన్ని జిల్లాలు, ప్రాంతాలు, కులాలకూ ప్రాతినిఽధ్యం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తు పూర్తి చేసింది. ఇక పీసీసీ నూతన అధ్యక్ష పదవికి పరిశీలనలో మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేరు కూడా చేరినట్లు సమాచారం. మధ్యేమార్గంగా ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, బీసీ కోటాలో మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌ పేర్లూ పరిశీలనలో ఉన్నా.. ప్రధానంగా ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్లే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రేవంత్‌, కోమటిరెడ్డి ఇద్దరూ ఢిల్లీలో అధిష్ఠానానికి అందుబాటులో ఉన్నారు. మరోవైపు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గాన్ని, టీపీసీసీ కమిటీల కసరత్తునూ అధిష్ఠానం పూర్తి చేసినట్లు తెలిసింది. కార్యవర్గం, కమిటీల్లో అన్ని కులాలు, ప్రాంతాలు, జిల్లాలు, వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్‌ తదితర మాజీ మంత్రులకు ప్రస్తుతం ప్రాధాన్యం కలిగిన పదవులు లేవని, అలాంటి వారికి ఈసారి పదవుల్లో ప్రాతినిధ్యం దక్కవచ్చని అంటున్నారు. 


ఆదివాసీలకు ప్రాధాన్యం..

టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి మాజీ మంత్రి కొండా సురేఖ పేరును పరిశీలనకు పెట్టినట్లు తెలుస్తోంది. ఆదివాసీలకు ప్రాధాన్యం కల్పించడంలో భాగంగా ఎమ్మెల్యే పొదెం వీరయ్య, ఆ వర్గంలోని మరికొందరు నేతల పేర్లనూ పరిశీలిస్తున్నారు. ఇక ఎమ్మెల్యే జగ్గారెడ్డికీ ప్రాధాన్యత గల పదవి ఇచ్చేందుకు అవకాశం ఉందంటున్నారు. టీపీసీసీ కార్యవర్గంతోపాటు సలహా కమిటీ, ఎన్నికల నిర్వహణ కమిటీ, ప్రచార కమిటీ, స్ట్రాటజీ.. ప్లానింగ్‌ కమిటీ, ఎన్నికల కమిటీ, మేనిఫెస్టో కమిటీలనూ నియమిస్తున్నట్లు సమాచారం. 



Updated Date - 2021-06-22T08:56:48+05:30 IST