‘ఆకర్ష్‌ సర్పంచ్‌’

ABN , First Publish Date - 2021-04-05T08:31:12+05:30 IST

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు..

‘ఆకర్ష్‌ సర్పంచ్‌’

  • సాగర్‌ ఉప ఎన్నికలో ‘జంప్‌ జిలానీ’ పర్వం
  • ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లపై పార్టీల గురి
  • తమ పార్టీల్లో చేర్చుకునేందుకు ప్రయత్నాలు
  • భారీగా డబ్బు ముట్టజెప్పేలా ఒప్పందాలు!’’

నల్లగొండ, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ప్రధాన రాజకీయ పార్టీలు.. స్థానికంగా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యుల ద్వారా ఓటర్లను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ.. ‘ఆకర్ష్‌ సర్పంచ్‌’ను మొదలుపెట్టాయి. ప్రత్యర్థి పార్టీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు పెద్దమొత్తంలో ముట్టజెప్పి తమ పార్టీలో చేర్చుకునే పనిలో పడ్డాయి. ఇలా త్రిపురారంమండలంలో ఓ ప్రధాన పార్టీ.. ఎదుటి పార్టీ సర్పంచిని తమ పార్టీలో చేరాలని ఒత్తిడి తేగా ‘‘నేను సర్పంచ్‌గా గెలవడానికి రూ.15 లక్షలు ఖర్చయింది. ఆ మొత్తం చెల్లిస్తే మీ పార్టీ కండువా కప్పుకొనేందుకు సిద్ధం’’ అని ఆ సర్పంచ్‌ చెప్పారు. దీంతో చకచకా పావులు కదిలాయి.. ఆయన పార్టీ మారారు. 


మరో సర్పంచ్‌కు రూ.50 లక్షల విలువైన అభివృద్ధి పని అప్పగించేందుకు అంగీకారం కుదరడంతో పార్టీ మారిపోయారు. కాగా, మాడ్గులపల్లి మండలంలో ప్రచారం చేస్తు న్న ఓ ఎమ్మెల్యే.. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన గోపాలపురం సర్పంచిని పార్టీ మారాలని రెండుసార్లు కోరారు. అయితే, ‘‘మారడం కుదరదు.. నేను అనారోగ్యంతో చావుబతుకుల్లో ఉంటే మా నాయకుడు రూ.10 లక్షల సాయం చేశాడు’’ అంటూ సదరు సర్పంచ్‌ తేల్చి చెప్పారు. దీంతో ఆగ్రహించిన సదరు ఎమ్మెల్యే పంచాయతీ అధికారులకు వెంటనే ఫోన్‌ చేయగా.. వారొచ్చి ఎంబీ రికార్డులు, ఇతర రికార్డులను తీసుకొని వెళ్లారు. ‘‘మొన్ననే ఆడిట్‌ ముగిసిందని, సమాచారం ఇచ్చిన అరగంటలో రికార్డులు ఎలా తీసుకెళతారని సర్పంచ్‌ ప్రశ్నించారు. మరుసటి రోజు సర్పంచ్‌ పార్టీకి చెందిన పెద్దలు మాడ్గులపల్లి మండల కేంద్రంలో ఆందోళనకు దిగడంతో పంచాయతీ అధికారులు రికార్డులు తిరిగి ఇచ్చేశారు. కాగా, గత కొద్ది రోజులుగా జరుగుతున్న ‘ఆకర్ష్‌ సర్పంచ్‌’లో భాగంగా ఇప్పటివరకు కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు సర్పంచులు, ఇద్దరు ఎంపీటీసీలు టీఆర్‌ఎ్‌సకు ఫిరాయించారు. ఇక టీఆర్‌ఎస్‌ నుంచి ఇద్దరు సర్పంచ్‌లు కాం గ్రెస్‌కు జంప్‌ అయ్యారు. కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి ఒక సర్పంచ్‌ మారిపోయారు.


ఓటు వేస్తారనుకున్న వారికే డబ్బులు..!

ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంపిణీ ప్రతిసారీ జరిగేదే అయినా.. ఈసారి పార్టీలు ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. గతంలో.. ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా ఉన్నవారికి డబ్బులిచ్చి ఓటు వేయించుకోవాలని, తమ పార్టీవారు ఎలాగూ తమకే వేస్తారనే అభిప్రాయంతో ఉండేవి. కానీ, ఈసారి మాత్రం తమకు పక్కాగా ఓటు వేసే అవకాశం ఉన్నవారికే డబ్బులు ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. తమ పార్టీ అనుకూలురు, ఇటీవల తమ వైపు మళ్లిన వారిని గుర్తించి వారికే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అనుకూలురు, తటస్థులు, ప్రత్యర్థి పార్టీకి ఓటు వేసేవారి చొప్పున జాబితాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఠి


నిమ్మ ధర దిమ్మ తిరిగేలా చేస్తోంది. కొనుగోలుదారులకుకు చుక్కలు చూపిస్తోంది. కేజీ రూ. 150 పలుకుతోంది. ఒక్కటి రూ. 10కి తగ్గేది లేదంటోంది. ఓ వైపు ఎండ తీవ్రత పెరుగుతుండగా.. మరోవైపు చాప కింద నీరులా కరోనా విస్తరిస్తోంది.. దీంతో.. వీటి ప్రభావం నుంచి ఉపశమనానికి నిమ్మకాయలు అత్యవసరమయ్యాయి. రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు విటమిన్‌-సీ అవసరం కావడం, అది నిమ్మలో పుష్కలంగా ఉండడంతో.. దీనికి ఎక్కడలేని డిమాండ్‌ వచ్చిపడింది. దీంతో భువనగిరిలో ఆదివారం నిమ్మకాయల ధరలు ఆకాశాన్నంటాయి.  

స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, యాదాద్రి

Updated Date - 2021-04-05T08:31:12+05:30 IST