సమస్యల స్వాగతం

ABN , First Publish Date - 2021-08-12T04:59:15+05:30 IST

జిల్లాలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఈ ఏడాదీ అవస్థల చదువులు తప్పేలా లేవు. ప్రభుత్వం ఈ నెల 16న జూనియర్‌ కళాశాలలను పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కానీ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో మాత్రం అధికారులకు ముందుచూపు కొరవడింది. చాలా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు తగిన వసతులు లేవు. చాలీచాలని తరగతి గదులు, పాడైన మరుగుదొడ్లు, అంతంతమాత్రంగా తాగునీటి సౌకర్యం, శిథిలావస్థకు చేరుకున్న భవనాలు.. విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి.

సమస్యల స్వాగతం
రాజాంలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ కళాశాల

- 16 నుంచి జూనియర్‌ కళాశాలలు పునః ప్రారంభం

- ఈ ఏడాదీ ఇంటర్‌ విద్యార్థులకు తప్పని అవస్థలు 

- కనీస మౌలిక వసతులు కరువు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఈ ఏడాదీ అవస్థల చదువులు తప్పేలా లేవు. ప్రభుత్వం ఈ నెల 16న జూనియర్‌ కళాశాలలను పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.  కానీ కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో మాత్రం అధికారులకు ముందుచూపు కొరవడింది. చాలా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు తగిన వసతులు లేవు. చాలీచాలని తరగతి గదులు, పాడైన మరుగుదొడ్లు, అంతంతమాత్రంగా తాగునీటి సౌకర్యం, శిథిలావస్థకు చేరుకున్న భవనాలు.. విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల మధ్య భౌతికదూరం పాటించాలని ప్రభుత్వమే పదేపదే చెబుతోంది. కానీ, ఆ దిశగా తరగతి గదుల్లో సౌకర్యాలు ఉన్నాయా? అనే ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం కరువవుతోంది. 

జిల్లాలో 46 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సర ఇంటర్మీడియట్‌ విద్యార్థులు 19వేల మందికిపైగా ఉన్నారు. శ్రీకాకుళంలో బాలురు, బాలికల విభాగాల కళాశాలలకు ఎన్నో ఏళ్లుగా వసతి సమస్య నెలకొంది. తగినన్ని గదులు లేక డిగ్రీ కళాశాలకు చెందిన తరగతి గదులను వినియోగిస్తున్నారు. 

- రాజాం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవనాలు శిథిలావస్థకు చేరాయి. ఇక్కడ తరగతులు నిర్వహించేందుకు నిర్వాహకులు  నానా యాతన పడుతున్నారు. స్థానిక కళాభారతి ప్రాంగణంలోనే తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. 

- ఇచ్ఛాపురం, కళింగపట్నం, టెక్కలిలో కూడా కళాశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వీటి మరమ్మతులు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి. చాలా కళాశాలల్లో ఇదే దుస్థితి నెలకొంది. 

- ఆర్‌ఐడీఎఫ్‌ కింద జిల్లాలో 16 కళాశాలల భవనాలకు   నిధులు మంజూరయ్యాయి. ఎచ్చెర్ల, కొయ్యాం, హిరమండలం, కొత్తూరు, జి.సిగడాం, కవిటి, పోలాకి ప్రాంతాల్లో పనులు పూర్తయ్యాయి. ఇంకా ఎనిమిది చోట్ల వివిధ వివాదాలతో నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. 


నాడు-నేడు పనులకు మోక్షం ఎప్పుడో

‘నాడు-నేడు’ పథకం కింద విద్యాశాఖ అధికారులు పాఠశాలల్లో తొలిదశ పనులు చేపట్టారు. రెండో దశలో భాగంగా కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో 46 కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.13కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ నెల 16 నుంచి కళాశాలలు పునః ప్రారంభం కానున్నాయి. కానీ ప్రభుత్వం ఆ ప్రతిపాదనల ఊసెత్తలేదు. కళాశాలల్లో ప్రధానంగా మరుగుదొడ్లు, తాగునీటి సమస్య నెలకొంది. అయినా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘నాడు-నేడు’ పథకం కింద నిధులు మంజూరు చేసేలా పాలకులు ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని పలువురు కోరుతున్నారు. మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2021-08-12T04:59:15+05:30 IST