Abn logo
Aug 2 2020 @ 13:03PM

ఓటమిని పరోక్షంగా మన్మోహన్ నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తున్న జూనియర్లు?

న్యూఢిల్లీ : కాంగ్రెస్ లో విభేదాలు తార స్థాయికి చేరుకున్నాయి. జూనియర్లు, సీనియర్ల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఇంకో అడుగు ముందుకేసి చెప్పాలంటే రాహుల్ టీమ్‌కూ, సీనియర్లకు మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఎక్కడో కాదు... ఏకంగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ముందే. ఈ సమావేశంలో మాజీ ప్రధాని, కాంగ్రెస్ అగ్రనేత మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. మూడు రోజుల క్రితం పార్టీ పరిస్థితి, రాజకీయాలపై సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ ఓ కీలక సమావేశం నిర్వహించింది.


కరోనా కారణంగా ఈ సమావేశాన్ని ‘వెబినార్’ సహాయంతో నిర్వహించారు. ఈ సమావేశంలోనే జూనియర్లకు, సీనియర్లకు మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగినట్లు సమాచారం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో ఉన్న సీనియర్ల కారణంగానే పార్టీ ఘోరంగా పతనమైందని రాహుల్ టీంలోని సభ్యులు ఒంటికాలుతో సీనియర్లపై లేచారు. పార్టీ ఘోర పరాభవానికి వారందరూ బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్ చేసినట్లు సమాచారం.


అందుకే రాహుల్‌కు తిరిగి పగ్గాలు చేపట్టాలని, మరో విధమైన ఆలోచనేదీ పెట్టుకోకూడదని రాహుల్ టీం గట్టిగా డిమాండ్ చేసింది. యూపీఏ ప్రభుత్వాన్ని నడిపించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ వెబినార్‌లో ఉన్నా.... మౌనంగానే ఉండిపోయారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. పరోక్షంగా ఈ చర్చ మన్మోహన్ వైపు వెళ్లిందని కొందరి కాంగ్రెస్ నేతల వాదన.


కరోనా కట్టడిలో విఫలం, ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడటం, చైనాతో ఘర్షణ.. ఇంతటి ముఖ్యమైన అంశాల్లో మోదీని ఇరుకున పెట్టడంలో కాంగ్రెస్ విఫలమైందని సీనియర్లు వ్యాఖ్యానించడంతో గొడవ ప్రారంభమైంది. ప్రధాని మోదీపై విరుచుకుపడటంలో కాంగ్రెస్ విఫలమైందని, దీనిపై ఆత్మ పరిశీలన కూడా చేయాలని సీనియర్లు సూచించారు. అంతేకాకుండా ఇలాంటి కీలక అంశాలపై ఎలాంటి చర్చలూ లేకపోవడాన్ని వారు తప్పుబట్టారు.


దీంతో రాహుల్ టీంలోని సభ్యుడు... రాజీవ్ సతవ్ అనే యువ నేత ఒక్కసారిగా జోక్యం చేసుకొని... సీనియర్లపై తీవ్రంగా మండిపడినట్లు సమాచారం. ‘‘ఈ విషయంపైనే ఆత్మ పరిశీలన కాదు... కాంగ్రెస్ పార్టీ నఖశిఖ పర్యంతమూ ఆత్మ పరిశీలన చేయాలి. 2014 లో ఘోర పరాభవాన్ని కూడా ఆత్మ పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది’’ అంటూ ఏకంగా సీనియర్లపై విరుచుకుపడ్డారు.


అయితే మన్మోహన్ కేబినెట్లో మంత్రులుగా విధులు నిర్వర్తించిన ఆనంద్ శర్మ, శశి థరూర్, మనీశ్ తివారీ, మిలింద్ దేవరా... మన్మోహన్‌ సింగ్‌కు బాసటగా నిలిచినట్లు సమాచారం. పరోక్షంగా మన్మోహన్ పై విరుచుకుపడటం ఏమాత్రం భావ్యం కాదని, ఆరోగ్యకరమైన వాతావరణం కాదని జూనియర్లతో అన్నట్లు తెలుస్తోంది. మోదీ సారథ్యంలోని బీజేపీ ఎన్నికల సమయంలో ఓ పద్ధతి ప్రకారం కాంగ్రెస్‌పై నిందారోపణలు మోపిందని, లేనిపోని ఊహలను కూడా జత చేసి విమర్శలకు దిగడంతోనే పార్టీ పరాభవం పాలైందని సీనియర్లు ఈ సమావేశంలో పేర్కొన్నారు. 


ఈ వివాదంపై కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత మనీశ్ తివారీ స్పందిస్తూ.. .‘‘2004 నుంచి 2014 వరకూ బీజేపీ అధికారంలో లేదు. ఈ సమయంలో వాజ్‌పాయ్‌ని గానీ... అప్పటి ప్రభుత్వాన్ని గానీ ఆ పార్టీ నేతలు ఒక్కసారిగా కూడా విమర్శించలేదు. నిందించలేదు. కానీ కాంగ్రెస్ లో మాత్రం తప్పుడు సమాచారం ఆధారంగా మన్మోహన్ నేతృత్వంలోని యూపీఏపై కొందరు నిందలు వేస్తున్నారు’’ అంటూ ట్విట్టర్ వేదికగా జూనియర్లపై తివారీ ధ్వజ మెత్తారు. 

మనీశ్ తివారీ చేసిన ట్వీట్‌ను కేంద్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత శశి థరూర్ పూర్తిగా సమర్థిస్తూ మరో ట్వీట్ చేశారు. ‘‘మనీశ్ తివారీ ఆలోచనతో నేను పూర్తిగా ఏకీభవిస్తా. పది సంవత్సరాల పాటు యూపీఏ సారథ్యంలో బాగా పాలించాం. కానీ.. కొందరు తప్పుడు సమాచారంతో, వక్రీకరణలతో విమర్శలు చేస్తున్నారు. మన ఓటమి నుంచి చాలానే నేర్చుకోవాలి మనం. కాంగ్రెస్‌ పార్టీని కూడా ప్రక్షాళన చేయాలి. అంతేగానీ... మన రాజకీయ విరోధులతో చేతులు కలుపొద్దు’’ అంటూ జూనియర్లకు థరూర్ చురకలంటించారు. 

ఇక... మరో సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు ఆనంద్ శర్మ కూడా మన్మోహన్‌ను ట్విట్టర్ వేదికగా వెనకేసుకొచ్చారు. ‘‘యూపీఏ పరిపాలన కాలాన్ని చూసి... కాంగ్రెస్ కచ్చితంగా గర్వించాలి. ఆ కాలాన్ని ఏ పార్టీ కూడా వక్రీకరించలేదు. విధ్వంసం చేయలేదు. మనల్ని బీజేపీ ఓ స్వచ్ఛంద సంస్థ అని, కాంగ్రెస్‌కు ఉన్న పళంగా క్రెడిట్ ఇస్తుందని ఎవరూ అనుకోం. కానీ... మన పార్టీ వారినే మనం కచ్చితంగా గౌరవించుకోవాలి. ఈ విషయాన్ని మరిచిపోవద్దు సుమా’’ అంటూ ఆనంద్ శర్మ జూనియర్లకు చురకలంటించారు. 

Advertisement
Advertisement
Advertisement