Abn logo
Sep 27 2021 @ 00:08AM

ఈ నేర లోకానికి ఏ సిచ్చ లేదా!

ఆడు ఢిల్లికి లంగ దొంగ అయినా

తల్లికి కొడుకే

కడుపు తిప్పల కన్నపేగు

కన్నది నేనే ఆని రాతను గన్నది మీరే

బతుకు బాటల్ల బల్లేల కోతల్ల బడ్డ పందెమ్‌ కోడి

పొడిసే పొద్దయితడనుకుంటే కుంగే పొద్దయిండు

గీ సట్టాల కొట్టాలు పేదలను సంపి

పెద్దలను మూస్తయి

ఎవల కోసం గన్న ఎవల గడ్డకు వెట్టిన

ఆనికి సదువు సందెలెందుకు లేవో

అచ్చురాలొదిలి ఆగమెందుకైండో

జెర జెప్పుండ్రి


ఆడు సదువుకొని కొలువుల కొలుపుల్లేక

ఆగంపచ్చిని జేసి గంజాయికి గుంజినోల్లెవరు?

సారా కషాయాల నిషాలు నిండిన పశువును జేసిందెవరు?

గుట్కాలు గుమ్మరిచ్చుకునే రొచ్చుగుంటంజేసిందెవరు?


సెల్లుఫోనులకు సినేతంజేసి సెడగొట్టిందెవరు

నీతుల్లేని సీన్మల తోని వాన్ని బూతోన్ని జేసి

వాన్ని నాశనం పదారుబాల్లు జేసిన పానంగుత్తోల్లెవరు?

పాలిచ్చి పెంచుకున్న నా కొడుకు మెదడుకు

అంగాలు మొలిపిచ్చిందెవరు


పసిపోరగాండ్లు, పండుముసలోల్లు

తల్లిసెల్లె వాయివరస సోయిదప్పిన

కామ పిశాచుల్ని పిచికారి జేస్తున్నదెవరు

ఆని నెత్తురు సెమట మీద అదికార రాజ్య

విత్తులు నాటుకుంటున్నదెవరు


నా కొడుకును లంగను, లఫంగిని, బద్మాషిని జేసిన

ఈ నేర లోకానికి ఏ సిచ్చ లేదా!

ఆడు దొంగో దోషో పంచనామా జరుపక ముందే పానాలు బాయె!



జూపాక సుభద్ర